KTR | హైదరాబాద్ : డిక్లరేషన్ పేరిట ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను ఎప్పుడు అమలు చేస్తారని రేవంత్ సర్కార్ను కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
ఎస్సీల (59 కులాలు) జనాభా, అక్షరాస్యత, ఉపాధి, విద్యా సంస్థలలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక సహాయం, రాజకీయ ప్రాతినిధ్యాలకు సంబంధించిన డేటాను అన్ని ప్రభుత్వ విభాగాలు, గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విచారణ కమిషన్ సేకరించింది అని చెప్పారు. సంతోషం. అన్ని అధ్యయనం చేసిన తర్వాత ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించామని చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా విభజించామని చెప్పారు. బీఆర్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని దేశంలో దళిత పారిశ్రామికవేత్తలు, గిరిజన పారిశ్రామికవేత్తలు ఎదగాలని.. ఫీక్కి, సీఐఐ తరహాలో డిక్కీ అనే సంస్థ వచ్చింది. కేవలం విద్య, ఉపాధిలో కాదు.. ఆర్థికంగా ముందుకు పోవడానికి అవకాశాలు కల్పిస్తేనే న్యాయం జరుగుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ దళితబంధు రూ. 10 లక్షల ఇస్తున్నారు. మేం అధికారంలోకి రాగానే అంబేద్కర్ అభయహస్తం కింద రూ. 12 లక్షలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏకసభ్య కమిషన్ ఇచ్చిన సిఫారసులు అమలు చేయడంతో పాటు రాబోయే బడ్జెట్లో డబ్బులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. కేవలం విద్యలో ఉపాధిలో కాకుండా ముందుకు పోవాలంటే ఈ వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. చాలా కాంట్రాక్టులు పిలుస్తున్నారు కానీ ఈ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఎప్పుడు అమలు చేస్తారని ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు.
ఎస్సీ వర్గీకరణను తప్పకుండా స్వాగతిస్తున్నాం. 61 శాతం ఉన్న బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బలహీన వర్గాల విషయంలో మాత్రం.. కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది. బీసీల సంఖ్య తగ్గిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో సహా బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. 42 రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇవాళ బీసీల గొంతు కోసింది కాంగ్రెస్ పార్టీ. బీసీ జనాభాలో 51 శాతం నుంచి 5 శాతం జనాభా తగ్గించి చూపెట్టిందో దాన్ని తీవ్రంగా నిరసిస్తూ.. మా పార్టీ తరపున ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ.. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని, దగాను నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తున్నాం : కేటీఆర్
KTR | సమగ్ర కుటుంబ సర్వే మాయం.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్