KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని కేటీఆర్ గుర్తు చేశారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై కేటీఆర్ మాట్లాడారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రాష్ట్రం ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ చేసిన సిఫారసులను సభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ రోజు కాదు.. మొదటి నుంచి ప్రజాస్వామిక ఉద్యమంగా, మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీగా.. బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఇస్తూ వచ్చింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో 2001 నుంచి స్పష్టంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
అస్థిత్వ ఉద్యమానికి నాయకుడిగా, ప్రజల ఆకాంక్షలను, సంపూర్ణంగా అర్థం చేసుకున్న నాయకుడిగా కేసీఆర్ ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చారు. ఆనాడు మరొక అస్థిత్వ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మందకృష్ణ మాదిగను తప్పకుండా ఈ సభలో గుర్తు చేసుకోవాలి. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఎమ్మార్పీఎస్, టీఎమ్మార్పీఎస్, ఇతర సంఘాలు, సంస్థలు, వ్యక్తులు చేసిన పోరాటానికి కేసీఆర్ అండగా నిలబడ్డారు. కానీ వర్గీకరణ విసయంలో వారు పోరాడితే మేం అడ్డుకున్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎంగా కేసీఆర్.. 2014 నవంబర్ 29న దీక్షా దివస్ సందర్భంగా ఇదే శాసనసభలో వర్గీకరణపై తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించారు. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ వర్గీకరణకు నడుం బిగించండి అని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కేవలం తీర్మానం చేసి చేతులు దులపుకోలేదు. అప్పటి ప్రధాని మోదీని కలిసి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇది మా చిత్తశుద్ధి అని తీర్మానం కాపీ నేరుగా అందజేశారు. ఈ ఘనత కేసీఆర్కు మాత్రమే దక్కుతుందన్నారు కేటీఆర్.
బీఆర్ అంబేద్కర్ గొప్ప మాట అన్నారు. అదేంటంటే.. సామాజిక స్వేచ్ఛ అనేది లేకపోతే చట్టం ద్వారా సంక్రమించిన హక్కు ఏదైనా వ్యర్థం, నిరర్ధకం అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో నిజాయితీని గుర్తించి ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారపక్షంలో ఉన్నా ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చాం. గాంధీ భవన్ వద్ద ఎమ్మార్పీఎస్ పోరాటంలో అమరులైన కుటంబాలను కేసీఆర్ ఆదుకున్నారు. సుప్రీంకోర్టులో 10 ఏండ్ల పాటు ఇంప్లీడ్ అయి గట్టిగా వాదించారు. ఆ ప్రయత్నం మా ప్రభుత్వ హయాంలో కూడా బలంగా చేశామని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | సమగ్ర కుటుంబ సర్వే మాయం.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
Panchayat Election | రంగారెడ్డి జిల్లాలో మొదలైన పంచాయతీ ఎన్నికల సందడి.. రిజర్వేషన్లపైనే ఉత్కంఠ
KTR | అసెంబ్లీలో 42శాతం రిజర్వేషన్లు బిల్లు పెడుతరేమో అనుకున్నం : కేటీఆర్