Panchayat Election | రంగారెడ్డి, ఫిబ్రవరి 4 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయన్న ప్రభుత్వ ప్రకటనతో గ్రామాల్లో ఆశావాహుల హడావుడి మొదలైంది. రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఆశావాహులు కొంత అయోమయంలో ఉన్నారు. రిజర్వేషన్లు గతంలో ఉన్నవే కొనసాగుతాయా.. లేక.. మారుతాయా అన్న అంశంపైనే చర్చ జరుగుతోంది.
కులగణనత సర్వే ఆధారంగానే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఉంటాయని పలువరు భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆశావాహులు ఇప్పటికే గ్రామాలకు చేరుకుని తమ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది.
రంగారెడ్డి జిల్లాలోని కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు పోగా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 531 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా శివారు ప్రాంతాలతో పాటు కొత్తూరు, షాద్నగర్, ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోకి వెళ్లిపోయాయి. కొత్తగా చేవెళ్ల, షాద్నగర్లు మున్సిపాలిటీలుగా మారడంతో జిల్లాలో 19 మండలాలే మిగిలాయి. ఈ 19 మండలాల్లో 531 గ్రామపంచాయతీలున్నాయి. ఈ గ్రామాల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించటానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
జిల్లాలో గామ పంచాయతీలు 531
వార్డులు 4,710
పోలింగ్ స్టేషన్లు 4,724