వినాయకనగర్, ఫిబ్రవరి 28: లండన్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు శుక్రవారం రాత్రి మరణించాడు. నిజామాబాద్‌లోని శ్రీనగర్‌కు చెందిన ప్రసాద్, రేణుక దంపతుల కుమారుడు సాయి శ్రీకర్ (27) బీటెక్ పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు. తన మిత్రులతో కలిసి నివాసముంటున్న లండన్‌లోని క్రోడియన్ డప్పాస్ హిల్స్ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీకర్‌ను అక్కడి దవాఖానలో చేర్పించారు. 3 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన సాయిశ్రీకర్ శుక్రవారం రాత్రి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు.