KTR | ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే.. 42శాతం రిజర్వేషన్ల బిల్లు పెడుతున్నరేమో అనుకున్నామని.. చివరకు ఏదో సర్వే రిపోర్ట్‌ని పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. అసెంబ్లీలో బీసీ కుల గణన నివేదికపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి చారిత్రాత్మకమైన ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో కామారెడ్డి డిక్లరేషన్ తరహాలో 42శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి బిల్లు ప్రవేశపెడతారేమోనని.. ఆ బిల్లును శాసనసభలో ఆమోదింప చేసి.. చట్టబద్ధత కల్పిస్తారేమోనని రాష్ట్రవ్యాప్తంగా బలహీన వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. కానీ, ముఖ్యమంత్రి లేచి నాలుగు పేర్లు చదువుతున్నారు. మీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే రేవంత్‌రెడ్డి గారు మీరే చెప్పారు’ అంటూ విమర్శించారు.
‘సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు.. తమరిచ్చిన ఉపన్యాసం యూట్యూబ్‌లలో, అన్ని టీవీల్లో ఉంది. ఆ రోజు ఏమన్నరు ? ఆ ముఖ్యమంత్రి సర్వే పెడితే ఎవరు పడితే వాళ్లు మీ ఇంటికి వచ్చే వివరాలు అడిగితే ఇచ్చేస్తారా..? అని మాట్లాడిందే రేవంత్‌రెడ్డి. మీరు చెప్పిన మాటలనే ఎన్యుమరేటర్లకు చూపించి వివరాలు ఇవ్వమని చెప్పారు. 57 రకాల వివరాలు అడుగుతున్నరు.. ఎట్లిస్తం ? అని మీరే అన్నరు. ఎవరు పడితే వారికి ఇచ్చేస్తామా? అన్నరు. అదే చూపించి ప్రజలు అడిగారు. వాస్తవం ఏంటంటే.. సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. శాంతికుమారి, రామకృష్ణారావు, సందీప్‌కుమార్ సుల్తానియా ఉన్నారు. అప్పుడు ఉన్నది ఇదే అధికారులు.. వేరే ఎవరో లేరు. రికార్డు ప్రకారం మాట్లాడుతున్నాను. సమగ్ర కుటుంబ సర్వేను చేయించింది ప్రభుత్వమే.. చేసింది ప్రభుత్వ అధికారులే. అది ఖచ్చితంగా అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా ఓపెన్‌గా వెబ్సైట్లోనే పెట్టాం’ అన్నారు.
‘అసెంబ్లీలో కాదు.. చాటుమాటుగా కాదు.. పారదర్శకంగా వెబ్సైట్లో పెట్టాం. అదే పాయల్ శంకర్ వివరాలు తీసుకున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో ఏం ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటంటే.. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య కోటి మూడు లక్షల 95వేల కుటుంబాలు. పాల్గొన్న ప్రజలు 3.68కోట్లు. 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యుమరేట్ చేశాం. ముఖ్యమంత్రి ఎంత తప్పుదోవ పట్టిస్తున్నారంటే.. ఇంతకు మించి టాపిక్ లేదు. మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి.. అనుమానాలు తలెత్తే విధంగా మాట్లాడరో దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. సీఎం బీసీల సంఖ్య అందులో ఎంత? అని అడుగుతున్నారు. ఆ నాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856గా ఉంది. 51శాతం బీసీలు.. అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను 10శాతం కలుపుకుంటే.. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 61శాతం ఉండేది. శ్రీనివాస్ యాదవ్ సరిగ్గా చెప్పారు’ అన్నారు.
‘ఈ నివేదిక అంతా తప్పుల తడక అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తగలబెట్టాలని చెబుతున్నడు. రాష్ట్రవ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెబుతున్నయ్. సమగ్ర కుటుంబ సర్వేలో 1.85కోట్లు ఉన్న బీసీలు ఎట్లా 1.64లక్షలకు తగ్గారు.. 51శాతం 46శాతం ఎట్లయ్యిందని అడుగుతున్నరు. శంకర్ అన్న కూడా అదే అడిగిండు.. అందులో తప్పు ఏముంది. ఆయనే కాదు.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నడు. మీరిచ్చిన నివేదికను తగలబెట్టాలని చెబుతున్నడు. శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే.. ఇవాళ మీరేం కొత్తగా ఏం చెప్పారు. మీరు చెప్పిందే మొన్న ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రెస్మీట్లో చెప్పారు. సబ్‌కమిటీ చైర్మన్‌గా చెప్పిన లెక్కలన్నీ.. సీఎం ఇవాళ చెప్పారు. ఎందుకు ఇవాళ సభ పెట్టారు? 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తెస్తారని మేం అనుకున్నాం. మీరు చెప్పినట్లు 56శాతం బీసీలు ఉంటే.. వారికి బీసీ సబ్ ప్లాన్ తెస్తరేమోనని అనుకున్నాం. ఏమీ తేకుండా.. ఇవాళ నివేదికన సభలో పెట్టామంటే.. చరిత్ర అని చెప్పుకుంటే కాదు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని’ కేటీఆర్ డిమాండ్ చేశారు.