MLA Jagadish Reddy | హైదరాబాద్ : ఈ ఏడాది కాలంలో రేవంత్ ప్రభుత్వం సత్తా ఏంటో తెలిసిపోయింది.. కేవలం పోలీసులతో పాలన చేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్ని రోజులు ఈ నిర్బంధాలు.. ఎంతకాలం ఈ మోసాలు.. అని నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. గురుకులాల్లో స్థితిగతులను అధ్యయనం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. కేసీఆర్ హాయాంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో గురుకులాలు అద్భుతంగా తీర్చిదిద్దబడితే రేవంత్ ప్రభుత్వం వాటిని నాశనం చేస్తోంది. కేసీఆర్ హాయాంలో గురుకుల విద్యార్థులు ఎవరెస్టుతో పాటు కిలిమంజారో పర్వతం అధిరోహించారు అని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు.
గురుకులాల్లో అద్వాన్నంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో కమిటీ వేశాం. మా విద్యార్ధి విభాగం గురుకులాల్లో సమస్యలు అధ్యయనం చేస్తే రేవంత్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటి..? అసెంబ్లీ సమావేశాలున్న నేపథ్యంలో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడానికే మా బృందాలు పర్యటిస్తున్నాయి. గురుకులాల్లో అన్నీ బాగుంటే రేవంత్ ఈ పర్యటనలు ఎందుకు అడ్డుకుంటున్నారు..? విద్యార్థులను కలిసేందుకు వెళ్లిన మా వాళ్ళను రేవంత్ రెడ్డి ఆపుతున్నారు. విద్యార్థులే రోడ్ల మీదకు వస్తున్నారు.. ఎంత మందిని అడ్డుకుంటావు..? మేము అక్కడికి ధర్నాలు చేయడానికో, తరగతుల బహిష్కరణకో వెళ్లడం లేదు. స్కూల్ పిల్లలకు అన్నం కూడా సరిగా పెట్టలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు.
గురుకులాల్లో విషాహారానికి బీఆర్ఎస్ కుట్ర అనడానికి సిగ్గుండాలి. పాలన చేతకాకనే బీఆర్ఎస్పై నిస్సిగ్గుగా విమర్శలు చేస్తున్నారు. వివిధ శాఖలకు మంత్రులు లేకపోవడం కూడా ప్రభుత్వ వైఫల్యాలకు ప్రధాన కారణం. విద్యా శాఖకు మంత్రి లేకపోవడం ఏంటి..? విద్యా శాఖ కీలకమైందన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు. విద్యా శాఖ మంత్రిగా ముఖ్యమంత్రే ఉండటం దుర్మార్గం. సీఎంకు మంత్రివర్గ విస్తరణ చేసే దమ్ము లేదు.. కనీసం వేరే మంత్రులకు విద్యా శాఖ అప్పగించాలన్న ఇంగితం సీఎంకు లేదు. కనీసం కోదండరాంకైనా సీఎం విద్యా శాఖను కేటాయించాలి. ఇప్పటికైనా సీఎం రేవంత్ సోయి తెచ్చుకుని పాలన చేయాలని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సూచించారు.
ఇవి కూడా చదవండి..
MLA Padi Kaushik Reddy | రేవంత్ రెడ్డి దళిత ద్రోహి.. మండిపడ్డ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
Chevella Road Accident | రంగారెడ్డి జిల్లాలో లారీ బీభత్సం.. ఆరుగురు కూరగాయల వ్యాపారులు మృతి
MLC Kavitha | కేసీఆర్ మొక్క కాదు.. కేసీఆర్ ఒక వేగు చుక్క : ఎమ్మెల్సీ కవిత