RS Praveen Kumar | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి.. మీరు నా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, కాల్చి చంపినా నేను నోరు లేని ఈ పేద బిడ్డల పక్షపాతిగానే ఉంటానని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ గురుకుల బాట చేపట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై రేవంత్ సర్కార్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్పీ తీవ్రంగా స్పందించారు.
మీ సోషల్ మీడియా లీకులు, మీరిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మతిస్థిమితం లేని మంత్రులు, ఎమ్మెల్యేలు, మరెందరో చిల్లర మూకలు నాపై చేస్తున్న దాడికి నేను బెదరను. మీరేసే తాయిలాలకు గతంలో లొంగలేదు, భవిష్యత్తులో కూడా లొంగను. మీరు స్కూళ్లకు తాళాలు వేసుకుంటెనో, పోలీసులతో మమ్ముల అరెస్టు చేయిస్తేనో మా గురుకుల బాట ఆగుతదనుకుంటే మీ అంత మూర్ఖులు ఇంకొకరుండరు అని రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
ఇక అసలు విషయానికొస్తే.. మీరు ఎందుకు నిజాలను దాచిపెట్టాలని అనుకుంటున్నారో ప్రజలకు చెప్పండి. మీరు చెప్పకపోతే వాటిని చెప్పాల్సిన బాధ్యత మా పిల్లలకోసం మా బీఆర్ఎస్ పార్టీపై ఉంది. మీ బంగళాలో బతికే నలుగురి కోసం నలభై మంది పనిచేయొచ్చు కానీ, మా పేద పిల్లలు చదువుకునే హయత్ నగర్ ప్రతిభా పాఠశాలలో 600 మంది విద్యార్థుల స్కూల్‌ను శుభ్రం చేయడానికి కేవలం ఒకటే ఒక వృద్ద మహిళను ఎట్ల పెడుతరు..? అదీ ఆమెకు టైంకు జీతాలు ఇవ్వకుండా..? అని ఆర్ఎస్పీ నిలదీశారు.
రాష్ట్రంలో అత్యంత ప్రతిభావంతులైన పేద పిల్లలను ఎంట్రన్స్ ద్వారా సెలక్టు చేసి వాళ్లకు అవసరమైన ఉపాధ్యాయులను ఇవ్వకపోతే వాళ్ల భవిష్యత్ కు భరోసా ఎవ్వరు..? హయత్ నగర్లో ఇంటర్మీడియట్‌కు ఇప్పటికీ ఇద్దరు జూనియర్ లెక్చరర్స్ లేరని పిల్లలు కన్నీరు పెట్టుకున్నారు. వాళ్లు పరీక్షలు ఎట్ల పాసైతరు? మీ పిల్లలకు టీచర్లు లేకపోతే మీరు ఊరుకుంటారా? ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడలేని పరిస్థితి దాపురించిన పరిస్థితిని మీరెట్ల చూస్తరు? అని రేవంత్ రెడ్డిని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
బ్లాక్ అయి అత్యంత దుర్గంధం వెదజల్లుతున్న టాయిలెట్లు ఉంటే విద్యార్థులు కాలకృత్యాలు ఎట్ల తీర్చుకుంటరు? విధిలేక రోజూ బహిరంగ మల విసర్జనకు చీకట్లో ఈ పేద బిడ్డలు భయంభయంగా పోతున్నారు! అడవుల్లో వాళ్లకు ఏమైనా పాములు తేళ్లు కరిస్తే వాళ్ల ప్రాణాలకు మీరు గ్యారంటీ ఇవ్వగలరా? కుళ్లి పోయిన కూరగాయలతో పిల్లలకు వంటలెట్ల చేస్తరు? మీ ఇంట్లో అట్లనే తింటారా? యూనిఫాంలు, దుప్పట్లు, బెడ్లు, బూట్లు లేకుండా, రోజూ అడవుల్లో ఈగలు దోమల మధ్య చదవడానికి ఈ పిల్లలు ఏమైనా పశువులా? మీకు దమ్ముంటే బంగళా నుండి బయటికొచ్చి గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ విద్యాలయాల్లోకి వెళ్లండి.
మీ సైకో-రౌడీ కుట్రలు బంజేయండి. పరిపాలన మీద దృష్టి సారించండి అని రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | జలదృశ్యం టు తెలంగాణ భవన్.. ఇదీ శ్రీనివాస్ రెడ్డి ప్రస్థానం : హరీశ్‌రావు
Harish Rao | రేవంత్ రెడ్డి అపరిచితుడు.. ఇలాంటి నాయకులను నమ్మి మోసపోవద్దు : హరీశ్‌రావు
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి రెండు నాల్కల ఆణిముత్యాలు.. విడుదల చేసిన హరీశ్‌రావు