Harish Rao | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి నీ పాలనలో.. నువ్వు మోసం చేయనిది ఎవర్ని..? ఉసురు పోసుకోనిది ఎవర్ని..? రోడ్డు మీదకు తీసుకురానిది ఎవర్ని..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు. అన్ని కోణాల్లో ఈ ప్రభుత్వం విఫలమై దిక్కుతోచక ప్రతిపక్షంపై దాడులు చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఈ రాష్ట్రంలోని విద్యార్థులను, నిరుద్యగులు, ఉద్యోగులను మోసం చేసిండు రేవంత్ రెడ్డి. 2 లక్షల ఉద్యోగాలను ఏడాదిలో భర్తీ చేస్తానని చెప్పారు. నిరుద్యోగులకు 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మాయమాటలు చెప్పి నట్టేట ముంచారు. ఇక కాంగ్రెస్ ఏడాది పాలనకు ఒక్క నెల మిగిలింది. కనీసం 10 శాతం అంటే 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చావా..? నిరుద్యోగులను దగా చేశావు. నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో అడిగితే హామీ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి మోసపు మాటలు మాట్లాడారు. విద్యార్థులకు భరోసా కార్డు ఇస్తా అన్నావు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఇప్పటి వరకు కూడా నయా పైసా ఇవ్వలేదు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కేసీఆర్ మానవీకోణంలో ఆలోచించి కొనసాగించారు. కరోనా కష్టకాలంలో కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఏడాదికి రూ. 2 వేల కోట్లు ఇచ్చారు కేసీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. విద్యార్థుల బతుకులు ఆగం అవుతుంటే.. నీ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు ఇస్తానని మాటిచ్చావు. పెండింగ్‌లో బిల్లులు క్లియర్ చేస్తా అన్నావు. పీఆర్పీ ప్రకటించి వేతనాలు పెంచుతానని ప్రకటించావు. ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. పీఆర్సీ ఉలుకే లేదు. ఒక్క డీఏ ఇచ్చి దీపావళి పండుగ జరుపుకోండి అంటున్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ నిర్ణయించిన డీఏనే ఇప్పుడి స్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 15 డీఏలు ఇచ్చింది. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండే.. కనీసం మూడు అయినా ఇస్తావు అనుకుంటే.. ఒక్క డీఏతో సర్దిపెడుతున్నావు. పీఆర్పీ ఇవ్వక, ఓపీఎస్ అమలు చేయక, 317 జీవో పరిష్కరించకుండా ఉద్యోగులను మోసం చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేశారు. 6 వేల మంది టీచర్లు పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మూడేండ్లకు నాలుగేండ్లకు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అని హరీశ్‌రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి వికృత రూపాన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారు : హరీశ్‌రావు
Sangareddy | ప్రియురాలి బంధువులు కొట్టారని మనస్తాపంతో ప్రియుడు ఆత్మహత్య?
అంత చిత్తశుద్ధి ఉంటే ఆ 10 మందితో రాజీనామా చేయించండి.. కూకట్పల్లి ఎమ్మెల్యే డిమాండ్