రేవంత్ సర్కార్‌పై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నాశనం చేస్తుందని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంట్లో కుటుంబ సభ్యులు పార్టీ చేసుకుంటే రేవ్ పార్టీ అంటున్నారని.. డ్రగ్స్ దొరికాయని అంటున్నారని మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. పోలీసుల భార్యలు న్యాయం చేయాలని రోడ్లపై ధర్నాలు చేస్తే బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కనబడటం లేదని.. ఇంట్లో కుటుంబసభ్యులు పార్టీ చేసుకుంటే మాత్రం గంటోలనే ప్రెస్మీట్లు పెట్టి తిడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైఖరి ఒక్కటేనని.. బీఆర్ఎస్ పార్టీపై బట్ట కాల్చివేయడమే వాళ్ల పని అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీజేపీల డ్రామాలు ప్రజలకు అందరూ చూస్తున్నారు ప్రజలే బుద్ధి చెబుతారని మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఎన్నికలు పెడితే ఏ పార్టీకి ప్రజలు తీర్పు చెబుతారో అర్థం అవుతుందని అన్నారు.