ఖైరతాబాద్, మార్చి 8 : ప్రీ లాంచ్ పేరుతో డబ్బులు కట్టించుకొని 500 మందిని 300 కోట్లకుపైగా ముంచిన జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు శ్రీనివాసమూర్తి, శ్రీరామమూర్తి, ప్రభాకర్ తమ గోడు వెల్లబోసుకున్నారు.
2021లో కూకట్పల్లి హౌజింగ్ బోర్డు ఫేజ్-6లో జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరు తో సంస్థను ఏర్పాటు చేశారని, దాని మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ వెస్ట్రర్న్ వేవ్స్, గెలాక్సీ, హిల్టన్ ప్రాజెక్టుల్లో ఆకర్షణీయమైన ఫ్లాట్లను నిర్మిస్తున్నట్టు ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో ప్రచారం చేశారని తెలిపారు. ఒక్కొక్కరు రూ.20లక్షల నుంచి 60లక్షలకు పైగా చెల్లించారని వెల్లడించారు. ఎండీ 2023లో తన కార్యాలయం బోర్డు తిప్పేశాడని వాపోయారు. ప్రస్తుతం సదరు ఎండీ పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకొని శిక్షించాలని, తమ డబ్బులు తమకు ఇప్పించాలని కోరారు.