Uppal Balu | బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ చాలాకాలంగా వార్తల్లో ఉన్న ఉప్పల్ బాలు.. ఈసారి ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. సామాన్యుల కోటాలో భాగంగా ఆడిషన్స్‌కు హాజరైన బాలు.. ఈసారి ఎలాగైనా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడతాడని చాలామంది భావించారు. అయితే అనూహ్యంగా ఆడిషన్స్‌లోనే తిరస్కరణకు గురికావడంతో పాటు అవమానాలను ఎదుర్కొన్నానని బాలు ఆరోపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన ప్రతిభను పూర్తిస్థాయిలో నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండానే, సోషల్ మీడియాలో తాను చేసే వీడియోలు, తనకున్న గుర్తింపు ఆధారంగా తనను తక్కువ చేసి మాట్లాడారని ఉప్పల్ బాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆయన వరుస వీడియోలు విడుదల చేస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదంలో ముఖ్యంగా ‘అగ్నిపరీక్ష 2’ జడ్జ్‌గా వ్యవహరిస్తున్న నటుడు నవదీప్‌పై బాలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఆడిషన్ ప్రక్రియలో మొదట తన పర్ఫార్మెన్స్, కామెడీకి ఒక జడ్జ్ ఇంప్రెస్ అయ్యారని, తదుపరి రౌండ్‌కు ఎంపికైనట్లు తనకు మెయిల్ కూడా వచ్చిందని బాలు చెబుతున్నారు. అన్ని నిబంధనలు పూర్తి చేసి స్టేజ్‌పైకి వచ్చిన తర్వాతే అసలు సమస్య మొదలైందని ఆయన ఆరోపించారు. స్టేజ్‌పై తనతో నవదీప్ వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. స్టేజ్‌పై తన ఫాలోయింగ్, వ్యక్తిగత గుర్తింపు, సోషల్ మీడియాలో తాను చేసే వీడియోల శైలి గురించి నవదీప్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బాలు ఆరోపించారు. ఆ మాటలు తనను తీవ్రంగా గాయపరిచాయని చెబుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
ఈ క్రమంలో నవదీప్‌ను ఉద్దేశించి బాలు చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. తనకు జరిగిన అవమానానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తీవ్రంగా స్పందించారు. ఆయన మాటలు నన్ను తీవ్రంగా గాయపరిచాయి. నా మానసిక వేదనకు, భవిష్యత్తులో నాకు ఏమైనా జరిగితే దానికి నవదీపే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉప్పల్ బాలు అన్నాడు. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. నా చావుకు నువ్వే కారణం అంటూ కంటతడి పెట్టారు. అయితే బాలు చేసిన ఈ ఆరోపణలపై నవదీప్ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు. ఉప్పల్ బాలు విడుదల చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు ఆడిషన్స్‌లో భాగంగా జరిగిన విషయాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే స్పందించాలని సూచిస్తున్నారు.