సిటీబ్యూరో, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ) : “ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రాజెక్టుల పేర్లు మారిపోతున్నాయి. కానీ మూసీ జనాల బతుకులు మారట్లేదు. కేవలం మోసపూరిత ప్రకటనలతో, తమ బతుకులు ఆగం చేయవద్దని మాత్రమే కోరుతున్నారు. చంద్రబాబు నుంచి మొదలుకుని, రేవంత్‌రెడ్డి వరకు కేవలం మూసీని ఒక కాసులు కురిపించే ఏటీఎంలాగే చూస్తున్నారే తప్పా… ఏనాడూ మూసీకి జీవం పోయాలనే ఆలోచన మాత్రం. గత ప్రభుత్వం ఎస్టీపీలను కట్టి, మురుగు నీటిని కట్టడి చేసేందుకు శ్రమించింది.
కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ ప్రణాళికను కొనసాగించడంలో విఫలమవుతున్నది. ఎంత సేపు మూసీ పరీవాహక క ప్రాంతంలో ఉన్న జనాలను తరలించాలనే చూస్తున్నారు. కానీ ఇక్కడి జనాలను తరలించడం కంటే మూసీ నదికి జీవం ఎలా పోయవచ్చనే విషయాన్ని ఏ ఒక్క నాయకుడు గుర్తించడం లేదు. కనీసం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఎంత సేపు వేల కోట్ల రూపాయలను మూసీ మురుగులో పెట్టి, నగర వాసుల ఆస్తిత్వాన్ని ఆర్థిక సంస్థలకు తాకట్టు పెట్టే ప్రణాళికలే తప్పా, ఒకప్పటి జీవనదిలో కనుమరుగైతున్న జీవవైవిధ్యాన్ని పరిరక్షించేవారు లేరు.” అంటూ గడిచిన మూడు దశాబ్ధాలుగా మూసీ పరిరక్షణ, నది పరివాహాక జనాల హక్కుల కోసం పోరాడుతున్న హ్యుమన్ రైట్ ఫోరం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ బిలాల్ ‘నమస్తే తెలంగాణ’తో చెప్పిన మూసీ ముచ్చట్లు.
నమస్తే: మూసీ ప్రక్షాళన ఎప్పటి నుంచి జరుగుతున్నది..?
బిలాల్: 1995లో తొలిసారి మూసీ సుందరీకరణ అంశం తెర మీదకు వచ్చింది. అప్పటి టీడీపీ సర్కారు అధికారంలోకి రావడంతోనే చంద్రబాబు నాయుడు సింగపూర్ కల పేరిట మూసీని ఏటీఎంగా మార్చే విధానానికి రూపకల్పన చేశారు. దాదాపు పదేండ్లు దీనికోసం మూసీ నదిపై విస్తృతమైన కృత్రిమ పరిశోధనలు, అధికారిక పర్యటనలు, ఎన్నో ప్రణాళికలను అధికారాన్ని అడ్డం పెట్టుకుని మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే 1997లో తొలిసారి ముంబైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థకు దాదాపు 3వేల ఎకరాలు కట్టబెట్టేలా ప్రణాళికలు పురుడు పోసుకున్నాయి. మూసీ పరివాహాక ప్రాంత జనాలను తరలించి, ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే కలకు ఆయన ఊపిరిపోశారు. ఆర్థిక సంస్థలను రంగంలోకి దింపి, నిధులు సేకరించారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఏకంగా ఏకంగా వందల కోట్ల రూపాయలను మూసీ ప్రక్షాళన కోసం ఖర్చు చేసింది. అనుకున్నట్లుగా హైకోర్టు సమీపంలో రబ్బర్ డ్యామ్‌ను నిర్మించింది. బీఆర్ఎస్ హయాంలో మూసీ ప్రక్షాళనపై నిధుల దుర్వినియోగానికి తావివ్వకుండా, అసంపూర్ణంగా ఉన్న ఎస్టీపీలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే 25కిపైగా మూసీకి ఇరువైపులా ఎస్టీపీలు అందుబాటులోకి వచ్చాయి. కానీ అధికార దాహంతో ముఖ్యమంత్రి అయినా సీఎం రేవంత్ రెడ్డి… కేవలం భూముల కోసమే మూసీ ప్రాజెక్టును ఎత్తుకున్నారు.
న.తె: మూసీ పరిరక్షణకు ఎలాంటి కార్యాచరణ అవసరం?
బిలాల్: ఇప్పుడున్న పరిస్థితుల్లో మూసీ పరిరక్షణకు ముందుగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కావాలి. ఆ తర్వాత శాస్త్రీయ విధానాలను అమలు చేసే సత్తా ఉండాలి. అంతకు మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదనే భావనతో ప్రణాళికలను అమలు చేయగలగాలి. ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ముందు చేయాల్సింది.. భూసేకరణ కాదు. అంతకు మించిన పారదర్శకత. అప్పుడు మాత్రమే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే ఆలోచనలు ముందుకు వస్తాయి.
న.తె: 30 ఏండ్ల కిందట మూసీ ప్రక్షాళన, ఇప్పటీ గాంధీ సరోవర్ మధ్య ఏవైనా పోలికలు ఉన్నాయా?
బిలాల్: మూసీ పేరిట దోపిడీకి ఆజ్యం పోసిన చంద్రబాబు నుంచి ఇప్పటి రేవంత్ రెడ్డి వరకు ఒకే తీరు. ఇందులో ఏమాత్రం తేడా లేదు. కానీ పేర్లు మాత్రమే మారాయి. అప్పుడు సింగపూర్ తరహా అభివృద్ధి అంటే.. ఇప్పుడు గాంధీ సరోవర్.. ఒకేసారి వందల ఎకరాల భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టే పక్కా స్కెచ్‌తో ఉన్నారు.
న.తె: మూసీ వెంబడి కబ్జాలు జరిగాయా?
బిలాల్ : మూసీ వెంబడి కబ్జాలు చేసిన వారిలో సాధారణ, పేద ప్రజలు కాదు. కేవలం బడా కార్పొరేట్ కంపెనీలు, పరిశ్రమలు అధినేతలు మాత్రమే. వికారాబాద్ నుంచి మొదలుకుని నల్గొండ వరకు 30శాతం కూడా శిఖం భూములు ఉంటాయి. మిగిలినవన్నీ కూడా పట్టా భూములే. వారసత్వంగా వారంతా మూసీ నీళ్లపై ఆధారపడే సాగు చేస్తూ కుటుంబాలను ఇప్పటికీ పోషిస్తున్నారు. ఇక సర్కారుకు మూసీ వెంబడి ఎక్కడ కబ్జాలు కనిపిస్తున్నాయి. కేవలం పేద, మధ్య తరగతి ఆస్తులను లాక్కోవాలనే దురాశ తప్ప.
న.తె: కాంగ్రెస్ ప్రణాళికలు ఎలా ఉన్నాయి ?
బిలాల్: మూసీ ముఖచిత్రం మారాలంటే ముందుగా మురుగు నీరు కలవకుండా నిలువరించాలి. దీనికి శాస్త్రీయ విధానాలను పక్కాగా అమలు చేయాలి. ఇక భారీ విగ్రహాలు, అరుదైన కట్టడాల పేరిట మూసీ నదికి వచ్చే ప్రయోజనమే లేదు. అంతగా ఉంటే ఉస్మాన్ సాగర్, హిమయత్సాగర్ జంట జలాశయాలకు సమీపంలో ఉన్న పెద్దల అక్రమ నిర్మాణాలను తొలగించాలి. అప్పుడు నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా పూడిక తీయాలి. అవసరమైతే బఫర్ జోన్‌ను గుర్తించి, హద్దుల నిర్ధారణ చేయాలి.
న. తె : మూసీ కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు దుర్వినియోగం జరిగింది?
బిలాల్: ఆనాటి నుంచి ఇనాటి వరకు మూసీ పేరిట వచ్చే ప్రజాధనాన్ని కాజేసేందుకు పేర్లను మార్చి ప్రణాళికలు అమలు చేస్తున్నారు. టీడీపీ రూ. 3వేల కోట్లు, అప్పటి కాంగ్రెస్ రూ. 500-600 కోట్లు, ఇప్పుడున్న కాంగ్రెస్ ఏకంగా రూ. 1లక్ష కోట్ల ప్రణాళికలను తెరమీదకు తీసుకువచ్చి, రాష్ట్ర ఖజానాపై గుదిబండ మోపేలా వ్యవహరిస్తున్నది. నిజానికి రేవంత్ రెడ్డికి సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ముందు మూసీలోకి కలుస్తున్న మురుగునీటిని, జంట జలాశయాల్లో పెద్దలు కట్టుకున్న ఫార్మ్హౌజ్లతోపాటు, నదీ హద్దులను నిర్ధారించి, ప్రణాళికల అంచనా వ్యయం, ఖర్చులు, ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తం, పనుల వివరాలు, గతంలో అభివృద్ధి పేరిట జరిగిన విధ్వంసం, వాటి అంచనా, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.