గ్రేటర్లో పన్నుల వసూళ్లకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ట్రై కార్పొరేషన్లను గట్టెకించేందుకు సామాన్య మధ్య తరగతి ప్రజలను ముప్పు తిప్పలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. మొండి బకాయిల వసూళ్ల సాకుతో నేటి నుంచే ఆస్తుల సీజ్లకు ముహూర్తం ఖరారు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా, కేవలం టార్గెట్ల కోసమే అధికారులు ఈ స్థాయి దండయాత్రకు దిగడం గమనార్హం. ఈ మేరకు దాదాపు 3.50 లక్షల ఆస్తులకు ఇప్పటికే రెడ్ నోటీసులు జారీ చేసిన అధికారులు..గడువు ముగియకముందే సీజింగ్ అస్త్రం ప్రయోగిస్తున్నారు. జీహెచ్ఎంసీ మూడు ముకలైన తర్వాత.. తమ టార్గెట్లు పూర్తి చేయాలన్న ఆత్రుతలో ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు.
– సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులపై అధికారులు కొరడా ఝుళిపించనున్నారు. అనేక సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని మొండి బకాయిదారుల ఆస్తులను సోమవారం నుంచి సీజ్ చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో లక్ష్యాలను చేరుకోవడమే ధ్యేయంగా జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన సికింద్రాబాద్, మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పన్నులు చెల్లించకుండా ఏండ్ల తరబడి కాలయాపన చేస్తున్న సుమారు 3.50 లక్షల మంది యజమానులకు ఇప్పటికే అధికారులు రెడ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు సుమారు 11,500 ఆస్తులను గుర్తించిన యంత్రాంగం, వారం రోజుల నుంచి తుది హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వీరి ఆస్తులను సోమవారం ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో సీజింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
విభజన తర్వాత పెరిగిన లక్ష్యాలు
గ్రేటర్ విభజన అనంతరం మున్సిపల్ వార్డుల సంఖ్యకు అనుగుణంగా టార్గెట్లను కూడా అధికారులు పంచుకున్నారు. ట్రై కార్పొరేషన్ల పరిధిలో 23 లక్షల ఆస్తులు ఉండగా, జీహెచ్ఎంసీ పరిధిలో 11 లక్షలు, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలో మిగిలిన 12లక్షల ఆస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐతే బల్దియాలో 11 లక్షల ఆస్తులుండగా, ఈ నెలాఖరుకల్లా రూ.1,100 కోట్ల వసూళ్లే లక్ష్యంగా పెట్టుకున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..
మొండి బకాయిలపై విధిస్తున్న వడ్డీపై 90 శాతం మాఫీ పొందేలా ప్రభుత్వం కల్పించిన వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) అవకాశం ప్రస్తుతం అమలులో ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో ఆస్తుల జప్తు తప్పదని డిప్యూటీ కమిషనర్లు స్పష్టం చేస్తున్నారు. పెద్ద మొత్తంలో బకాయి ఉన్నవారిని నేరుగా కలిసి అవగాహన కల్పిస్తున్నప్పటికీ, ఫలితం లేని చోట కఠిన చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు అందడం గమనార్హం.
పడకేసిన అభివృద్ధి ..
ఒకవైపు ట్రై కార్పొరేషన్లలో అభివృద్ధి పనులు పడకేశాయి. రోడ్ల మరమ్మతులు లేవు, వీధి లైట్లు, శానిటేషన్ సమస్యలు తీరడం లేదు. కానీ పన్నుల వసూళ్లలో మాత్రం అధికారులు సింహస్వప్నంలా మారుతున్నారు. ప్రజల నుంచి వసూలు చేసే కోట్లాది రూపాయల నిధులు ఏమవుతున్నాయో తెలియదు కానీ, సామాన్యుడి ఆస్తిని జప్తు చేయడానికి మాత్రం క్షణం కూడా సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో ఈ సీజింగ్ పర్వం మొదలైతే పౌరుల నుంచి అధికారులకు తిరుగుబాటు తప్పదనే చర్చ జరుగుతున్నది.అభివృద్ధి పనులు మాత్రం చేపట్టడం లేదనే విమర్శలున్నాయి.