న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: పేరు లోనే పెన్నిధి ఉంది.. రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది! ఒక వర్గం వారి విశ్వాసం పెరుగుతుంది అని గట్టిగా నమ్ముతున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేర్లను మార్చడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది.
నగరాలు, కార్యాలయాలు, మెట్రో స్టేషన్లు, రోడ్లు, ప్రముఖ కట్టడాలు, స్థలాలు, మంత్రుల కార్యాలయాలు ఇలా ఒక్కటేమిటి అన్నింటినీ మార్చేస్తూ తమకు అనుకూలమైన పేర్లను పెడుతూ వాటితోనూ ప్రచారం పొందాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆరాటపడుతున్నట్టు కనిపిస్తున్నది! పాత, కొత్త పేర్లతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా దీని కోసం రూ.200 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని టైమ్స్ ఆఫ్ ఇండియా విశ్లేషణాత్మక కథనం పేర్కొంది.
వలస రాజ్యాల యుగం నుంచి ఏండ్ల తరబడి ఉన్న పేర్లను బీజేపీ ప్రభుత్వం 2014లో తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మార్చడం ప్రారంభించింది. ఇటీవల ఒక అంతర్జాతీయ సదస్సు సందర్భంగా భారత్ మండపంలో (పాత పేరు ప్రగతీ మైదాన్)లో నిర్వహించగా, అదెక్కడున్నదంటూ స్థానికులే చాలామంది గందరగోళానికి గురయ్యారు. పేరు మార్పు పెద్ద ఖర్చుతో కూడుకున్నది. దీని కోసం రాష్ట్ర స్థాయిలో అయితే రూ.200 కోట్ల నుంచి 500 కోట్లు, పెద్ద నగరాలకు అయితే వెయ్యి కోట్ల వరకు ఖర్చు అవుతుంది.