మహబూబ్‌నగర్, జూలై 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కండ్ల ముందే కృష్ణా నదిలో వరద నీరు వచ్చినట్టే వచ్చి దిగువకు వెళ్తుంటే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో పంట పొలాలకు నీరు పారని దైన్యం ఉమ్మడి పాలమూరు జిల్లాను వెంటాడుతున్నది. ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణాకు గత 52 గంటలుగా భారీ వరద వస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు నీళ్లు వదలకుండా ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని నీటి పారుదలశాఖ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. జూరాలకు మూడు రోజుల క్రితమే వరద మొదలైనప్పటికీ నీటిని ఎత్తిపోయడానికి అధికారులు 36 గంటల సమయం తీసుకొన్నారు.
కొందరు ప్రజాప్రతినిధులు తీవ్ర ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌కు నీటి విడుదల మొదలుపెట్టారు. వరద పోటెత్తుతున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు నీళ్లు వదలాలని కొందరు ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తే సర్కార్ నుంచి ఆదేశాలు లేవని కాలయాపన చేస్తున్నారు. జూరాల కుడి, ఎడమ కాలువలతో పాటు భీమా ఫేజ్-2, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు కూడా నీళ్లు వదలాలని పట్టుబట్టగా క్యాబినెట్ అప్రూవల్ కావాలంటూ ఏకంగా నీటిపారుదల శాఖ ఎస్ఈ సమాధానం ఇవ్వడం గమనార్హం.
ఈ మేరకు గురువారం గద్వాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నాకు పిలుపునిచ్చారు. నీటి విడుదలలో జాప్యంపై గద్వాల కలెక్టరేట్ ముట్టడికి అధికార పార్టీ కూడా పిలుపునిచ్చింది. అయితే ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు నీటి పారుదల శాఖ మంత్రిని కలువగా, ఆందోళనను విరమిస్తున్నట్టు ఆ పార్టీ నాయకులు ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం గురువారం ధర్నా నిర్వహిణకు రైతులను సమాయత్తం చేస్తున్నది.
ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తుతున్నది. ఆదివారం ఆల్మట్టి రిజర్వాయర్ నుంచి భారీ ఎత్తున నీటిని నారాయణపూర్ జలాశయానికి వదిలారు. గత శనివారమే అక్కడి నుంచి నీటిని విడుదల చేశారు. ఈ నీళ్లు సరిగ్గా 24 గంటల తర్వాత తెలంగాణలోకి ప్రవేశించి ఆదివారం ఉదయం జూరాల ప్రాజెక్టుకు చేరాయి. జూరాలలో క్రమక్రమంగా నీటిమట్టం పెరుగడంతో పూర్తిస్థాయి నీటిమట్టం 9 టీఎంసీలు కాగా, 8 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగతా నీటిని మళ్లిస్తున్నారు. గత 52 గంటలుగా జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నిరంతరంగా భారీ వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు భీమా ప్రాజెక్టుకు నెట్టెంపాడుకు, కోయిల్‌సాగర్‌కు సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి నీటి ఎత్తిపోతల ప్రారంభించారు.
ఈ మూడు ప్రాజెక్టులకు కలిపి ముందుగా వెయ్యి క్యూసెక్కులు.. ఆ తర్వాత క్రమక్రమంగా పెంచుతూ 2,300 క్యూసెక్కుల నీటినే ప్రస్తుతం వదులుతున్నారు. నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, భీమాకు 1,000, కోయిల్‌సాగర్‌కు 350 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. నడిగడ్డ ప్రాంతానికి నీళ్లు రావాలంటే జూరాల కుడి, ఎడమ కాలువల్లో నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. దీనివల్ల జములమ్మ రిజర్వాయర్‌తోపాటు నడిగడ్డలోని మరో రెండు రిజర్వాయర్లకు నీటిని తోడవచ్చు. అధికార యంత్రాంగం మాత్రం వీటన్నింటికీ నీళ్లు వదలాలంటే మంత్రివర్గ తీర్మానం తప్పనిసరి అంటూ దాటవేస్తున్నది. ఒకవేళ వీటన్నింటికీ నీళ్లు వదిలితే రైతులు పంటలు పండించుకొనే అవకాశం ఉన్నదని, ఆ తర్వాత వరద తగ్గితే నీళ్లివ్వలేమనే కొత్త వాదనను ముందుకు తెస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి గోదావరి జలాల మాదిరిగానే కృష్ణా జలాలను కూడా ఆంధ్రాకు మళ్లిస్తున్నారన్న అనుమానం బలంగా వినిపిస్తున్నది. ఎన్డీఎస్ఏ నివేదికను అడ్డం పెట్టుకొని గోదావరి నదీజనాలను ఏపీకి వదిలినట్టే.. కృష్ణా వరద ప్రవాహాన్ని కూడా ఏపీ ప్రయోజనాల కోసమే దిగువకు వదులుతున్నారని ఆరోపణలున్నాయి. హడావుడిగా విద్యుదుత్పత్తి పేరుతో కిందికి నీటిని వదలడం ఆ అనుమానాలకు తావిస్తున్నది. దీనికి తోడు అధికార పార్టీకి చెందిన నేతలే నీటి విడుదల కోరుతూ ఆందోళనకు దిగాలని నిర్ణయించడం గమనార్హం.
తమ ప్రాంతానికి నీళ్లు వదలాలని విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలో రైతులతో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి అధికార పార్టీ నేతలే సన్నాహాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే జూరాల నుంచి నడిగడ్డకు నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ మంత్రిని కలిసి అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు విన్నవించారు. ఆ తర్వాత ఆందోళన కార్యక్రమాన్ని రద్దు చేసుకొన్నారు.
జూరాల ప్రాజెక్టుకు వస్తున్న కృష్ణా నీటిని యథావిథిగా పాలమూరు జిల్లా రైతాంగానికి ప్రయోజనం చేకూరేలా వదలాలని, వాటి పరిధిలోని రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపి, చెరువులకూ నీళ్లు మళ్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం గద్వాల జిల్లా కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో భారీ ధర్నా నిర్వహించనున్నట్టు పార్టీ గద్వాల ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు తెలిపారు. ఇప్పటికే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కృష్ణా నీటిని పాలమూరు ప్రాజెక్టులకు మళ్లించడంలో సర్కార్ సవతితల్లి ప్రేమను చూపుతున్నదని ఆరోపించారు. ఏపీకి ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర సర్కార్ వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. పాలమూరు రైతులు పంటలు పండించవద్దా? నీళ్లు వదలాలంటే క్యాబినెట్ ఆమోదం కావాలా? చంద్రబాబు డైరెక్షన్‌తో రేవంత్ కృష్ణా జలాలను కూడా తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. సర్కార్ తీరుపై ఉమ్మడి పాలమూరు తీవ్ర ఆగ్రహంతో ఉన్నదని తెలిపారు.
కృష్ణా నదికి వస్తున్న వరదను విద్యుదుత్పత్తి పేరుతో ఏకంగా 30 వేల క్యూసెక్కుల నీటిని వాడుతూ దిగువకు వదులుతున్నారు. గత 36 గంటల నుంచి జూరాలకు వస్తున్న వరదను వచ్చినట్టే దిగువకు వదులుతూ ఏపీ ప్రాజెక్టులకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. అధికారిక అంచనాల ప్రకారం ఇప్పటివరకు జూరాలకు సుమారు 5 టీఎంసీల వరకు నీళ్లు రాగా, ఇందులో 3 టీఎంసీలను నిల్వ ఉంచుకొని, 2 టీఎంసీలను దిగువకు వదిలారు. ఏపీకి ప్రయోజనం చేకూర్చేందుకే విద్యుదుత్పత్తి పేరుతో నీటిని దిగువకు వదులుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జూరాల ప్రాజెక్టు ఆధారంగా నిర్మితమైన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం సాకులు చూపుతున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా అధికారులు సైతం తమపై ఒత్తిడి తెస్తే తామేమీ చేయలేమని.. సర్కార్ ఆదేశాలు రాలేవంటూ తప్పించుకొంటున్నారు. జూరాలలో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువలో ఉన్నదని, పైనుంచి వరద పెరిగే అవకాశం ఉన్నందున నీటిని దిగువకు వదులుతున్నామని అధికారులు అంటున్నారు.


