చిన్నశంకరంపేట, జూలై 28: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలో 59.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలోని రోడ్డుకు అడ్డంగా భారీ చెట్టు విరిగిపడింది. ఖాజాపూర్లో వర్షానికి ఇల్లు కూలింది. పంట పొలాలకు భారీగా వరద చేరింది. మండలంలోని వివిధ గ్రామాల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. వ్యవసాయ పనుల్లో అన్నదాతలు బిజీబిజీగా మారారు.
భారీ వర్షం.. ఇబ్బందుల పాలైన బాలికలు
మెదక్ మున్సిపాలిటీ, జూలై 28: మెదక్ పట్టణంలోని పలు డ్రైనేజీలు సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పొంగి ప్రవహించాయి. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ముందున్న మురుగు కాల్వలో వర్షపు నీరు ప్రవహించడంతో మంగళవారం కళాశాలకు వెళ్లే బాలికలకు ఇక్కట్లు తప్పలేదు. ఈ విషయం తెలుసుకున్న కౌన్సిలర్ జుబేర్ అహ్మద్ వెంటనే మున్సిపల్ నుంచి జేసీబీ తెప్పించి మురుగు కాల్వను శుభ్రం చేయించారు. పట్టణంలోని పలు ప్రాంతాలను మున్సిపల్ చైర్పర్సన్ రాధికాభూపతిరాజు సందర్శించారు.
స్తంభించిన జనజీవనం
రామాయంపేట, జూలై28: రామాయంపేట మండలంతోపాటు పట్టణంలో భారీ వర్షం పడింది. దీంతో జనజీవనం స్తంభించింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. పట్టణంలోని అక్కల బస్తీ మొత్తం నీట మునిగింది. తెల్లవార్లు బస్తీవాసులు నిద్రలేకుండా ఉన్నారు. మండలంలోని పర్వతాపూర్ బాపనయ్య గిరిజనతండాను ఆనుకుని ఉన్న పుష్పాలవాగు పొంగిపొర్లింది. చెక్డ్యామ్లన్నీ నిండుకుండలా మారాయి. వ్యవసాయ పంట పొలాల్లో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ అధికారులు అక్కడికి చేరుకుని చర్యలు చేపట్టారు. సుమారు 43మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు అంచనా వేశారు.