సుంకిశాల ప్రాజెక్టుకు సంబంధించి 11.6.2021న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగింది. 2022లో పనులు మొదలుపెట్టారు. జూలై 2, 2023 నాడు ఆ వాల్ నిర్మాణం జరిగింది. కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. సాగర్‌లోకి నీళ్లొచ్చాయట.. కూలిందట! సాగర్‌లోకి నీళ్లు రాకుంటే ఏమొస్తయ్!.. సాగర్ కట్టిందే నీళ్ల కోసం! ఆ నీళ్ల నుంచే కదా పంపుహౌస్ ద్వారా నీళ్లు తెచ్చుకుందామని కట్టుకున్నది. అవన్నీ దృష్టిలో పెట్టుకొనే కదా కట్టాల్సింది. డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీనిద్వారా అర్థమవుతున్నది. మీ పాలన, మీ పర్యవేక్షణ ఎలా ఉన్నాయో తెలుస్తున్నది.
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీస్ స్టేషన్లో ఖాకీల దౌర్జన్యం ఘటన అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పుడే జరిగింది. కానీ వారం రోజులపాటు ప్రభుత్వం బయటపెట్టలేదు. దాని గురించి మాట మాట్లాడలేదు. సుంకిశాల ప్రమాదం కూడా ఆగస్టు 1నే జరిగింది. దీన్నీ ప్రభుత్వం వెల్లడించలేదు. అంటే సభలో తమకు ఇబ్బంది కలుగుతుందని అనుకున్న అంశాలను దాచేయడానికి ప్రయత్నించింది. తర్వాత అవి బయటపడటంతో ఉక్కిరిబిక్కిరై సాకులు వెతికే పనిలో పడింది.
సకల పాపాలకు కారణం అతడే అన్నట్టుగా ఉన్నది బీఆర్ఎస్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. ఏదైనా తప్పు జరిగిందా… అది బీఆర్ఎస్ పదేండ్ల పాలన పాపం! పదేండ్లలో ఏదైనా మంచి జరిగిందా.. అది పదేండ్ల కిందున్న కాంగ్రెస్ లేదా చంద్రబాబు ప్రభుత్వాల గొప్పతనం లేదా ఇప్పటి రేవంత్ సర్కార్ ఘనత.
పైనుంచి లెక్కలు అందుబాటులో ఉన్నా, కృష్ణానదిలో ప్రవాహాన్ని ఊహించలేక, సాగర్‌లో వరదను అంచనా వేయలేక, గేటుకు టైబీమ్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయో లేదో చూసుకునే పర్యవేక్షణ లేక, పట్టించుకునే నాథుడులేక, సొరంగాన్ని ఎప్పుడు తెరవాలన్న తెలివిలేక, తప్పు మీద తప్పు చేసి, ఆ తప్పు ఎక్కడ అసెంబ్లీ దృష్టికి వస్తుందో అని వారంరోజులు దాచేసి, మసిబూసి మారేడుకాయ చేసిన రేవంత్ ప్రభుత్వం.. అసలు విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తేగానే తత్తరపడి, బిత్తరపోయి ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్లే అనే పాతపాట అందుకున్నది.
సుంకిశాల కూలిపోవడం బీఆర్ఎస్ సర్కారు పాపమే అయితే వారం రోజులపాటు ఈ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదు? సుంకిశాల తప్పుడు డిజైనే అయితే 8 నెలలుగా పరిపాలన చేసినవారు, దానిమీద సమీక్ష జరిపి పనులెందుకు ఆపలేదు? సుంకిశాల పనులు నాసిరకమే అయితే గత సీజన్లో వచ్చిన సాగర్ వరదకు ఎందుకు కొట్టుకుపోలేదు? సుంకిశాల కూలిపోవడం బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకమే అయితే కాళేశ్వరానికి తీసుకుపోయినట్టు వారానికో మీడియా బృందాన్ని ఎందుకు తీసుకుపోలేదు? హెలికాప్టర్లో రాహుల్ గాంధీని ఎందుకు రప్పించలేదు? ఇవన్నీ చేయకుండా ఆ వీడియో ఎవరుతీశారు? ఎవరు నమస్తే తెలంగాణకు ఇచ్చారని బెదిరింపులకు ఎందుకు దిగుతున్నట్టు? వీటన్నిటిని బట్టి చూస్తే అర్థమవుతున్నది ఏమిటి? సుంకిశాల పాపం కచ్చితంగా కాంగ్రెస్ సర్కారుదే.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కొందరు సీనియర్ ఇంజినీర్లు వద్దని వారించినప్పటికీ జలమండలి ఇంజినీర్లు వినకుండా హడావుడిగా టన్నెల్ ఓపెన్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సొరంగంలో తవ్వని భాగాన్ని తొలగించేందుకు యంత్రం లేకున్నా హడావుడిగా కర్నూల్ నుంచి తెప్పించి మరీ ఓపెన్ చేసినట్టు తెలిసింది. దీంతో నాగార్జునసాగర్‌లోకి వచ్చే భారీ
వరదతో నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ఎలాంటి ఆధారంలేని గేటును తన్నుకుంటూ జలాలు రిటెయినింగ్ వాల్‌ను నిలువునా కుప్పకూల్చాయి. అయితే, ఈ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టి వేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయత్నించినప్పటికీ, కొన్ని గంటల వ్యవధిలో జలమండలి అధికారికంగా ఇచ్చిన వివరణతో అసలు నిజం ఏంటనేది తేలిపోయింది. ఈ నేపథ్యంలో వాస్తవంగా ఏం జరిగింది? సుంకిశాల లోగుట్టు ఏందని ఓసారి పరిశీలిస్తే..
సుంకిశాల పథకంలో భాగంగా నాగార్జునసాగర్ జలాశయం ఫోర్‌షోర్ నుంచి పంపుహౌజ్ వరకు మూడు సొరంగ మార్గాలను నిర్మించారు. నాగార్జునసాగర్ నీటిమట్టాన్ని ప్రామాణికంగా తీసుకొని వీటిని తవ్వారు. ఇందులో కింది భాగంలోని సొరంగం 137 మీటర్ల వద్ద ఏర్పాటు చేశారు. దాని వ్యాసం 8 మీటర్లు అయినందున సొరంగం 137-145 మీటర్ల వరకు ఉంటుంది. అదేవిధంగా మధ్యస్థ సొరంగాన్ని 157 మీటర్ల వద్ద ప్రారంభించారు. దీని వ్యాసం కూడా 8 మీటర్లు అయినందున ఇది 157-165 మీటర్ల వరకు ఉంటుంది. దీనిపై మరో సొరంగాన్ని నిర్మించారు. నాగార్జునసాగర్‌లో నీటిమట్టం ఆధారంగా ఆయా సొరంగాలను ఓపెన్ చేసి, నీటిని పంపుహౌజ్‌లోకి తరలిస్తారు. అయితే నిర్మాణ సమయంలో మాత్రం సొరంగ మార్గాలను పూర్తిస్థాయిలో తవ్వరు.
పంపుహౌజ్ నుంచి నాగార్జునసాగర్ జలాశయం వరకు ఉండే సొరంగ మార్గంలో జలాశయం వైపు మాత్రం కొంత భాగాన్ని తవ్వకుండా అలాగే ఉంచుతారు. దీని వల్లనే సాగర్‌లోని నీళ్లు సొరంగంలోకి రాకుండా ఉంటాయి. అన్ని పనులు పూర్తయిన తర్వాత, పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన తర్వాతనే ఈ సొరంగాన్ని ఓపెన్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో నీళ్లలోనే పేలుళ్ల ద్వారా (వాటర్ బ్లాస్టింగ్) సొరంగంలో తవ్వని భాగాన్ని ఓపెన్ చేస్తారు. ముఖ్యంగా సొరంగంలో గేట్లు ఏర్పాటు చేసి, పంపుహౌజ్ స్లాబ్ వేసి.. ఆ స్లాబ్ నుంచి టైబీమ్స్ను గేటు వరకు ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా నీటి ఒత్తిడికి గేటు కదలకుండా టైబీమ్స్ అదిమి పడతాయి. అదేవిధంగా నాగార్జునసాగర్‌లో నీటిమట్టం అనుకూలంగా ఉన్నపుడు ఈ సొరంగ మార్గాలను ఓపెన్ చేయాలి.
పంపుహౌజ్‌లో మోటార్లు ఏర్పాటు చేసేందుకు కొన్నిరోజుల క్రితమే సివిల్ పనులు మొదలపెట్టారు. అందుకోసం భారీ క్రేన్‌తో పాటు వంద మందికిపైగా కార్మికులు పంపుహౌజ్‌లో నిత్యం పని చేస్తున్నారు. పంపుహౌజ్ స్లాబ్ పనులు పురోగతిలో ఉన్నాయి. గత నెలలో మధ్యస్థ సొరంగంలో గేటు అమర్చినప్పటికీ స్లాబ్ నుంచి టైబీమ్ ఇంకా నిర్మించలేదు.
మరోవైపు నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి లక్షల క్యూసెక్కుల వరద మొదలైంది. ఈ సమయంలో సొరంగాన్ని ఓపెన్ చేయడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. మొత్తంగా చెప్పాలంటే ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవడం, కృష్ణా ప్రవాహంపై తప్పుడు అంచనాలు, ప్రొటోకాల్ పాటించకపోవడం వంటి కారణాలతోనే సుంకిశాల ఘటన సంభవించిందని తేటతెల్లమైంది.