KTR | తడిగుడ్డతో గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. వరంగల్, హన్మకొండ జిల్లాల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నవంబర్ 29 దీక్షా దివస్ కార్యక్రమంపై సన్నాహక సమావేశం జరగ్గా.. కేటీఆర్ హాజరై బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అలర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో తెలంగాణ సమాజాన్ని కదిలించిన రోజు నవంబర్ 29 అని.. ఆ రోజు కేసీఆర్‌ను ఖమ్మం జిల్లాకు తరలించిన రోజు నా మనసులో ఇంకా తిరుగుతూనే ఉందన్నారు. కేయూ దగ్గర విద్యార్థుల రాస్తారోకోలో తాను పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు కేటీఆర్.
తమను వరంగల్ సెంట్రల్ జైలులో పెట్టారని.. 30గంటల తర్వాత నన్ను విడుదల చేస్తే ఖమ్మం వెళ్లానన్నారు. యుద్ధ భూమిని తలపించే విధంగా తెలంగాణ కదిలిందని.. శ్రీకాంతా చారి మరణంతో మలి దశ ఉద్యమం జరిగిందన్నారు. ఈ తరం పిల్లలకు దీక్షా దివస్ గురించి తెలియదని.. తెలంగాణను రాచి రంపాన పెడుతున్న అంశాలను గుర్తు చేసుకుని పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. ప్రతి ఏటా 11 రోజుల పాటు వినయ్ భాస్కర్ కార్యక్రమాలు చేస్తారని.. ఏ దీక్షతో తెలంగాణ మలుపు తిరిగిందో ఆ దీక్షను గుర్తు చేసుకోవాలని.. నాయకుడు కేసీఆర్‌కు అండగా నిలువాలన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అర్థమయ్యిందని.. కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారన్నారు. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని.. బాధపడేది లేదు.. భయపడేది అంత కన్నా లేదన్నారు.

పరిపాలన చేతకాక అక్రమ కేసులు పెడుతున్నారని.. ఉద్యమంలో ఎలా ముందు ఉన్నారో.. ఇప్పుడు కూడా న్యాయవాదులు ముందు ఉంటున్నారన్నారని.. వాళ్లకు ధన్యవాదాలు చెప్పానన్నారు. కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును నిర్మించారని.. ఆజాంజాహి మిల్లు మూతపడి బతుకుదెరువు కోసం వెళ్లిన వారు తిరిగి వరంగల్‌కు రావాలని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ని నిర్మించారన్న కేటీఆర్.. కంపెనీలు వచ్చి ఇక్కడి యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించారని.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పిస్తాం అని బీసీ ఓట్లను దండుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ విషయంలో ఐదు రకాలుగా మాట్లాడుతున్నారని.. 42 శాతం రిజర్వేషన్ల కోసం 160 కోట్లు ఖర్చుపెట్టారు.. బీహార్ లో రాహుల్ గాంధీ డబ్బా కొట్టారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 24 శాతాన్ని 17 శాతానికి తగ్గించారని.. బీసీలను మోసం చేసిన రేవంత్ సర్కార్ ను ఏం చేయాలో నిర్ణయించుకోవాలన్నారు.
నర్మెట్ట మండలంలో 17 గ్రామాలు ఉంటే ఒక్కటే సీటు బీసీలకు కేటాయించారని.. కుల గణన చేసి బీసీల సంఖ్య తగ్గించారు .. రిజర్వేషన్లు తగ్గించారన్నారు. తడిగుడ్డతో గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎంను గల్లీ గల్లీలో ఉరికించామని.. కేసీఆర్ పోరాట స్ఫూర్తితో దీక్షా దివస్ స్పూర్తిగా కదం తొక్కుదామన్నారు. కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ రాజచిహ్నంలో తొలగిస్తున్న వరంగల్ నుంచే కాంగ్రెస్ సర్కార్‌పై పోరాటంతో కదం తొక్కుదామన్నారు. కేసీఆర్ 11 రోజులు అన్న హారాలు మాని తెలంగాణ ప్రజల కోసం చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారని.. ఏ ఎలక్షన్ వచ్చినా కేసీఆర్ ఇచ్చిన పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదామన్నారు. పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.