భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 26 : గ్రామ పంచాయతీ ఎన్నికలకు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల కోడ్ ఉండదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం ఐడిఓసి లో గ్రామ పంచాయతీ ఎన్నికలపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడత ఎన్నికలకు గురువారం నుండి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. మూడు విడతలుగా జరిగే ఎన్నికల్లో మొదటి విడత 11వ తేదీన పోలింగ్ జరుగుతుందని అదే రోజు కౌంటింగ్ చేసి ఫలితాలు వెల్లడిస్తారన్నారు.
నిన్నటి నుండి కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉందని, రాజకీయ నాయకులు సమావేశాలు, సభలు నిర్వహించకూడదన్నారు. ముఖ్యమంత్రి పర్యటన యధావిధిగా ఉంటుందన్నారు. యూనివర్సిటీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నందున దాని ప్రారంభోత్సవానికి అభ్యంతరం ఉండదని తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారాలు చేసుకునే ముందు తప్పనిసరిగా సమాచారం ఇచ్చి ప్రచురణ చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ అనూష, సుధీర్, జిల్లా పంచాయతీ కార్యాలయం రమణ, డీపీఆర్ఓ హస్గర్ పాల్గొన్నారు.