బోధన్ రూరల్/సారంగాపూర్, ఫిబ్రవరి 26 : యూరియా కోసం నిజామాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. యాప్ విధానంలో కాకుండా పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని నిజామాబాద్ రూరల్ ముత్తకుంట సొసైటీ ఎదుట గురువారం అన్నదాతలు ఆందోళనకు దిగారు. యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్-వర్ని రహదారిపై ఏడు గ్రామాలకు చెందిన కర్షకులు రాస్తారోకో చేశారు. యాప్ బుకింగ్ ద్వారా సమయానికి ఎరువులు అందక కష్టాల పాలవుతున్నామని వాపోయారు.
యాప్ ద్వారా బుక్ చేసుకున్నా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో యూరియా అందించడం లేదని రైతులు బోధన్ మండలం ఎరాజ్పల్లిలోని గోదాం వద్ద నిరసన తెలిపారు. చాలామంది రైతులకు యాప్ గురించి అవగాహన లేదని, వాటిని ఎలా ఉపయోగించాలో అర్థం కావడం లేదని అన్నారు. ప్రభుత్వం పాత పద్ధతిలోనే సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.