సూర్యాపేట టౌన్, నవంబర్ 26 : రాజ్యాంగం అనేది ప్రజలకు ఒక వరమని, దీనిని మనకు ప్రసాదించడానికి ఎంతోమంది మహానుభావులు కృషి చేశారని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం నవంబర్ 26ను పురస్కరించుకుని బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి ఆయన రాజ్యాంగ పీఠికను చదివి రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరం రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుని మహానుభావుల కృషికి గొప్ప ఘనత తేవాలన్నారు. ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం అంటే అది మనకు రాజ్యాంగం ఇచ్చిన వరమన్నారు. పౌరులందరూ రాజ్యాంగానికి, చట్టానికి లోబడి నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు రవి, నరసింహ చారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.