భువనగిరికలెక్టరేట్, మార్చి 9 : మృత్యువు డీసీఎం రూపంలో వచ్చి ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కుమారులను కబళించిన సంఘటన మండలంలోని వడపర్తి సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బీఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన డొంకెన కేతమ్మ(50) తన ఇద్దరు కుమారులు నరేష్(30), సురేష్(27)తో కలిసి ఆటోలో భువనగిరికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో వడపర్తి సమీపంలో జగదేవ్పూర్ నుంచి అతి వేగంగా వచ్చిన డీసీం ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న డొంకెన నరేష్ (30) అక్కడికక్కడే మృతిచెందాడు. రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం భువనగిరి దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ డొంకెన సురేష్(27) మృతి చెందగా డొంకెన కేతమ్మ (50)ను హైదరాబాద్కు చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మృతి చెందింది.
ప్రమాద విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో బీఎన్ తిమ్మాపురంలో విషాద ఛాయలు అలుముకున్నారు. ప్రమాదంలో తమ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో బీఎన్ తిమ్మాపురం గ్రామస్తులను కలచివేసింది. నిరుపేద గీత కార్మిక కుటుంబానికి చెందిన వారిని డీసీఎం రూపంలో మృత్యువు కబళించడంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.
ఇంటి వద్ద ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి దుకాణానికి అవసరమైన కొద్దిపాటి సరుకులను తీసుకవచ్చేందుకు తన కుమారులతో కలిసి ఆటోలో వెళ్ళిన కేతమ్మ భువనగిరిలో సరుకులు తీసుకుని ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా అదే సమయంలో డీసీఎం వెనుకనే వస్తున్న మరో డీసీఎం ముందున్న డీసీఎంను ఢీకొట్టడంతో ముందున్న డీసీఎం ఆటోను మరోమారు బలంగా ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ముగ్గురూ మృతి చెందారని స్థానికులు తెలిపారు. మరికొద్ది సేపటిలో ఇంటికి చేరుకుంటారనుకున్న సమయంలో ఇటువంటి ఘోర ప్రమాదం జరగడం తమను కలచి వేసిందని గ్రామస్తులు రోదిస్తూ తెలిపారు. తిమ్మాపురంలో విషాద ఛాయలు.. గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలోని ముగ్గురూ ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.