KTR | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఆయన అన్నదమ్ములు, అనుయాయులతో కలిసి ఓ అవినీతి అనకొండ మాదిరిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన హెచ్ఐఎల్టీపీ పాలసీపై ఆయన నిప్పులు చెరిగారు. పరిసర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనపై తీవ్రంగా స్పందించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘మాజీ సీఎం కేసీఆర్ హయాంలో పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా మార్చడం జరిగింది. అదే విధంగా కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త పురపాలికలు ఏర్పాటు చేశారు. తాండాలను అప్‌గ్రేడ్ చేసి 8,800 గ్రామ పంచాయతీలను 12,800కు పెంచడం జరిగింది. అధికారాన్ని వికేంద్రీకరించి, ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది’ అన్నారు.
‘ఈ విషయంలో ప్రభుత్వం ఎవరితో చర్చించిందో తెలియదు. ఎందుకంటే, మున్సిపాలిటీల్లో ఎలాంటి తీర్మానాలు జరగలేదు. ఏ ఒక్క మున్సిపాలిటీ నుంచి కూడా కనీసం తీర్మానం తీసుకోలేదు. మున్సిపాలిటీలు కొలువు తీరి లేవు కాబట్టి ప్రజలతో నేరుగా అభిప్రాయ సేకరణ చేశారా ? అంటే అదీ చేయలేదు. అఖిలపక్ష సమావేశం పెట్టి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నారా ? శాసనసభ పెట్టి సభ్యుల అభిప్రాయం తీసుకున్నారా అంటే అదీ లేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి ఎజెండా కోసం, ఎవరి శాశ్వత దీర్ఘకాలిక ఆలోచనల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందో మాకైతే తెలియడం లేదు. ఏ కారణం చేత ఈ ప్రతిపాదనను తెచ్చారో కూడా స్పష్టంగా లేదు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారుల ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది’ అన్నారు.
‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (HILTP) పేరుతో కొత్త పాలసీని తీసుకువచ్చారు. పరిశ్రమలకు కేటాయించిన భూములు అపార్ట్మెంట్లకు ఇస్తున్నారు. గతంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు ప్రజలను ఒప్పించి, ఉపాధి అవకాశాల కోసం భూములను సేకరించిన తీరుగానే, గత ప్రభుత్వాలు హైదరాబాద్ నగరంలో 9,300 ఎకరాల భూమిని పరిశ్రమలకు కేటాయించాయి. కానీ, ప్రస్తుతం ఆ భూముల్లో అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకి భూములు తీసుకొని, వారికి తక్కువ ధర ఇచ్చి, సబ్సిడీపై పరిశ్రమలకు భూములిచ్చిన తర్వాత పరిశ్రమలు నడవాలి. ఉపాధి దొరకాలి. యువతకు ఉద్యోగాలు రావాలి. రాష్ట్ర ఆదాయం పెరగాలని మేము ఆశిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి వైఖరి ఇందుకు విరుద్ధంగా ఉంది. హైదరాబాద్‌లోని పరిశ్రమల యజమానులు వచ్చి,అపార్ట్మెంట్లు కట్టుకుంటాం, మాల్స్ కట్టుకుంటాం అంటే.. వారికి అడ్దికి పావుశేరు చొప్పున మార్కెట్ రిజిస్ట్రేషన్ ధరకు కాకుండా కేవలం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూలో 30శాతం మాత్రమే చెల్లించి, భూమిని కన్వర్ట్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి అనుమతిస్తున్నాడు’ అని ఆరోపించారు.
‘హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో పార్కులకు, పార్కింగ్‌లకు, బొందలగడ్డలకు, ఇల్లు కట్టుకోవడానికి జాగా లేదు. వీటికి జాగాలు వద్దట. కానీ, పారిశ్రామికవేత్తలు అడ్డికి పావుశేరుకు కొనుక్కున్న, ప్రభుత్వం ఇచ్చిన భూములను వారు ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటే మాత్రం రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపుతున్నారు. 9,300 ఎకరాల భూమి దాదాపు రూ.5లక్షల కోట్ల విలువైన ఆస్తి. దేశంలోని ఇతర రాష్ట్రాలు (ఉదాహరణకు ముంబయి) మిల్స్ కోసం ఇచ్చిన భూములను 50శాతం వెనక్కి తీసుకొని, ప్రజల అవసరాల కోసం వినియోగిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ‘అవినీతి అనకొండ’ అని.. రేవంత్ రెడ్డి, ఆయన అన్నదమ్ములు, ఆయన అనుయాయులతో కలిసి ఒక అవినీతి అనకొండ మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆ అవినీతి అనకొండ విశ్వరూపం ఏమిటంటే..రూ.5 లక్షల కోట్లు విలువైన తెలంగాణ ప్రజల ఆస్తిని దోచుకుపోవడానికి, ఉద్దేశపూర్వకంగా గత ప్రభుత్వాలు పరిశ్రమలకు ఇచ్చిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారు’ అంటూ ధ్వజమెత్తారు.