Gold Rate | బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. నిన్న ఒకే రోజు భారీగా పెరిగిన ధర.. తాజాగా మరోసారి ఢిల్లీలో పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో లాభాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గించనుందన్న అంచనాల మధ్య బుధవారం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు రెండువారాల గరిష్టస్థాయికి చేరుకున్నాయి. 24 క్యారెట్ల పసిడిపై రూ.1200 పెరిగి తులానికి రూ.1,30,100కి పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,29,500కి చేరింది. యూఎస్ ఫైనాన్స్ డేటా బలహీనంగా ఉన్న నేపథ్యంలో వడ్డీ రేటు తగ్గింపు అవకాశం పెరిగిందని, దాంతో బంగారం ధరలు పెరిగాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.81శాతం పెరిగి ఔన్స్‌కు 4,164.30 డాలర్లకు చేరుకుంది.
వెండి ధరలు సైతం మరోసారి పెరిగాయి. రూ.2,300 పెరిగి రూ.1,63,100 కిలోకు చేరుకుంది. విదేశీ మార్కెట్లో వెండి స్పాట్ ధరలు 1.71శాతం పెరిగి ఔన్సుకు 52.37 డాలర్లకు చేరుకుంది. రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల అంచనాలు లాభాలను పరిమితం చేశాయని కమోడిటీ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికారుల వ్యాఖ్యలు, బలహీనంగా ఉన్న ఆర్థిక డేటా గ్లోబల్ మార్కెట్లో బంగారం డిమాండ్‌ను పెంచాయని విశ్లేషకులు తెలిపారు. యూఎస్ లేబర్ డేటా విడుదల కాక ముందే పెట్టుబడిదారులు బంగారం వైపు దృష్టి సారించారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఫెడ్ గవర్నర్ మీరాన్, వాలర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వడ్డీ రేటు తగ్గింపు అవకాశాలను బలపరిచాయని.. దాంతో బంగారం ధర పెరుగుదలకు దారి తీసినట్లుగా కోటక్ సెక్యూరిటీస్‌కు చెందిన కైనాట్ చైన్వాలా తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై ఆశాభావ దృక్పథం కారణంగా వెండిపై లాభాలను పరిమితం చేశాయని నిపుణులు పేర్కొంటున్నారు.