హైదరాబాద్, అక్టోబర్18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్త బీసీ బంద్ విజయవంతమైంది. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలతో నిర్బంధించారు. నడిరోడ్లపైనే ధూంధాం నిర్వహించారు. అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రాజధాని నగరం నుంచి మారుమూల పల్లె ప్రజల దాకాసంపూర్ణంగా పాటించారు. వెనకబడిన వర్గాలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల జేఏసీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ‘బంద్ ఫర్ జస్టిస్’ నిర్వహించింది. బీఆర్ఎస్ సహా అఖిలపక్ష పార్టీలు, కుల, ప్రజాసంఘాలతోపాటు సబ్బండవర్ణాలు బంద్‌లో పాల్గొన్నాయి. బీసీ సంఘాల నేతలు ఎక్కడికక్కడ భారీ ర్యాలీలను నిర్వహించి, జాతీయ రహదారులను నిర్బంధించారు. బీజేపీకి వ్యతిరేకంగా పలుచోట్ల దిష్టిబొమ్మలను దగ్ధంచేశారు. మేమెంతో మాకంత, జై బీసీ జైజై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధిద్దాం’ అన్న నినాదాలు రాష్ట్రమంతటా మిన్నంటాయి.బంద్ కేవలం ఆరంభం మాత్రమేనని, బీసీలకు రిజర్వేషన్లను కల్పించేవరకూ విశ్రమించేది లేదని ఎక్కడికక్కడ ప్రతిజ్ఞ పూనారు. అప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్, బీసీ నేతలు హెచ్చరించారు.
బీసీ బంద్‌లో కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ తదితర పార్టీల ప్రతినిధులూ పాల్గొన్నారు. ప్రధానంగా బీసీ, కుల, బీసీ ఉద్యోగ, విద్యార్థి సంఘాలు కదంతొక్కాయి. జేఏసీ పిలుపునందుకుని ఓయూ ఐక్య విద్యార్థి సంఘం, పీడీఎస్‌యూ, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం, ముదిరాజ్, సర్దార్ సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడసంఘం, ముదిరాజ్, బీసీ మహిళా, బీసీ విద్యార్థి, యువజన సంఘాలు, లంబాడీ హకుల పోరాట సమితి, బీసీ యువజన సంఘాలు, ముస్లిం దూదేకుల సంక్షేమ సంఘం, పద్మశాలి సంఘం, ఎమ్మార్పీఎస్ తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. బంద్‌లో సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇరావత్ అనిల్, ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ, సీపీఐ నేత నారాయణ, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేశ్, లంబాడ సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్‌నాయక్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి రమ, శ్రీనివాసులు పాల్గొన్నారు.
బంద్‌లో భాగంగా బీసీ జేఏసీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించారు. హైదరాబాద్‌లో ఎంజీబీఎస్ బస్‌స్టేషన్ వద్ద బీసీ జేఏసీ వరింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బీసీ ధూంధాం నిర్వహించారు. రోడ్డుపైనే గంగిరెద్దుల విన్యాసాలు, బీసీ కళాకారుల ఉద్యమ గీతాలు, ఆటాపాటలతో హోరెత్తించారు. అనంతరం ఎంజీబీఎస్ బస్‌స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉప్పల్ ఆర్టీసీ డిపో ఎదుట బీసీ జేఏసీ కో చైర్మన్ రాజారామ్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆరాంఘర్ జాతీయ రహదారిని నిర్బంధించారు. బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ గేటు నుంచి 40 కులసంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. బీసీ బంద్‌కు ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
బీసీ జేఏసీ బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ బాసటగా నిలిచింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణులు బంద్‌లో మమేకయ్యారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ బీసీ ధర్నాలో శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాస్యం వినయ్‌భాస్కర్, ఆంజనేయులుగౌడ్, తుల ఉమ, బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉపేంద్ర, కిశోర్‌గౌడ్, నేతలు తుంగ బాలు, సుమిత్రా ఆనంద్, కీర్తిలత తదితరులు పాల్గొన్నారు. బీసీలకు రిజర్వేషన్లను కల్పించాల్సిందేనని, 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లను చేర్చి రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
బీసీ బంద్‌లో మంత్రులు, పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ట్యాంక్‌బండ్ అంబేదర్ విగ్రహం వద్ద మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీతక, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఇతర ముఖ్య నేతలు బైఠాయించారు. రాజ్యాంగంలో జనాభా ప్రాతిపదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ తక్షణమే చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
బీసీ బంద్‌లో భాగంగా రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద పలు దుకాణాలు తెరిచి ఉంచడంతో బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. షాపులపై దాడులకు దిగారు. బలవంతంగా మూయించారు. నల్లగొండలో సైతం కొందరు చిరువ్యాపారాలపై దాడులు చేశారు. షాపులను చెల్లాచెదురు చేశారు. హైదరాబాద్ నల్లకుంట, ఫీవర్ హాస్పిటల్ ఏరియాలోనూ వివిధ వ్యాపార సముదాయాలు, పెట్రోల్ బంక్‌పై దాడులు చేశారు. కొన్నిచోట్ల బీసీ బంద్‌లో పాల్గొన్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.