-కొడిశాల రాము, జీడికల్
మీరు ఉంటున్న ఇంటికి రెండు దుకాణాలు ఉన్నాయి. అందులో ఒకటి పడమర దిక్కుకు డౌన్లో ఉండగా, రెండోది తూర్పు దిక్కుకు ఎత్తుగా ఉందని అర్థం అవుతుంది. ఈ నిర్మాణం సరైనది కాదు. పడమర దిశ పల్లం అయినప్పుడు ఇంటి సంతానమైనవాళ్లు ఇబ్బంది పడతారు. ఇంట్లోని స్త్రీలు అనారోగ్యానికి గురవుతుంటారు. పురుషులు నిత్యం చికాకు పడుతుంటారు. సంతానహీనులుగా మిగిలిపోతారు. ప్రస్తుతం మీరు నివసించే ఇంటిని తక్షణమే పడమరకు మార్చండి లేదంటే రెండింటిని తొలగించి ఒకే ఇల్లుగా చేయండి. దాంట్లోనే గృహంతో పాటు దుకాణాలు వచ్చేలా ప్లాన్ చేసుకోండి. దక్షిణం వైపు రోడ్డు ఉంది కాబట్టి కలిపి కట్టుకోవడం మంచిది. పడమరవైపు ఉన్న దుకాణం స్థలం ఫ్లోరింగ్ పెంచి దానికి తగినట్టుగా షెట్టర్ సవరించండి. లేదంటే మరో ఇంటికి మారండి.
– కావురి కిషన్, మేడ్చల్
మన అవసరాల కోసం ఎన్ని పడక గదులైనా నిర్మించుకోవచ్చు. ప్రధానంగా ఎక్కువ గదులు అవసరమైనప్పుడు డూప్లెక్స్ ఇల్లు కట్టుకుంటే ఉత్తమం. ముఖ్యంగా ఇంట్లోని కింది భాగంలో కానీ, పై భాగంలో కానీ ఈశాన్యం దిశలో అందరు వెళ్లగలిగే విధంగా హాల్‌కు కలిసి ఉండేవిధంగా గదులు ఉండాలి. ప్రతి గదికీ అటాచ్డ్ టాయిలెట్ పెట్టుకోవచ్చు. అయితే ఈశాన్యం, తూర్పు, ఉత్తర దిక్కులు కాకుండా దక్షిణం, వాయవ్యం, ఆగ్నేయంలో పడక గదులు కట్టి అందులో అటాచ్డ్ టాయిలెట్లు నిర్మించుకోవాలి. తూర్పు, ఉత్తరం దిక్కుల వైపు ఉన్న గదుల్లో టాయిలెట్లను పెట్టే విషయంలో తూర్పు ఉత్తరాలు అక్రమించకుండా జాగ్రత్త పడాలి.
-తలారి శ్రీను, కొత్తకోట
పశ్చిమ నైరుతిలో, దక్షిణ నైరుతిలో మెట్లు వేసుకోవాలా? వద్దా? అనే అనుమానం చాలామందికీ వస్తుంటుంది. ఎలాంటి సందేహం లేకుండా మెట్లు వేసుకోవచ్చనే విషయం అందరూ గ్రహించాలి. కానీ, అదే దిశల్లో ఇంటి లోపల మాత్రం మెట్లు వేయొద్దు. మీరు నైరుతి మెట్ల కింద ఉన్న టాయిలెట్‌ను తక్షణమే తొలగించండి లేదంటే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఇంటి పడమరలోని ప్రహరీని ఆనుకోకుండా నైరుతిలో మెట్ల నిర్మాణం చేయండి. అలాగే ఆ మెట్ల కింద టాయిలెట్లు కట్టడం కూడా చాలా పెద్ద దోషం. వెంటనే దాన్ని సవరించండి.
– సిరివేలు పద్మ, చేర్యాల
ఇంటిమీద స్విమ్మింగ్ పూల్ పెట్టాలని గట్టిగా తీర్మానించుకున్నట్లున్నారు. దానిని మోయడం కోసం చేసే ఖర్చులో మూడో వంతు భాగంలో నేలమీద తయారు చేసుకోవచ్చు. ఇంటిలో ఆగ్నేయం, వాయవ్యాలను వదిలి తూర్పు-ఈశాన్యంలో, ఉత్తర- ఈశాన్యంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించుకోవాలి. కనీసం పన్నెండు అడుగుల వెడల్పు, 24 అడుగుల పొడవుతో తొట్టి ఆకారంలో ఉండే విధంగా కట్టాలి. నాలుగున్నర అడుగుల లోతు కోసం సంకెన్ స్లాబ్ వేయాలి. పటిష్ఠమైన ఫాల్ సీలింగ్‌లతో కింది స్లాబ్‌లను నిర్మించడం అత్యంత ముఖ్యం. లేదంటే అధిక బరువు పడుతుంది. ‘గురుత్వాకర్షణ శక్తిలో హెచ్చుతగ్గులొచ్చి అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోని నిర్మించండి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143