ఎదులాపురం, అక్టోబర్ 18 : ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదును పగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదు, క్రాప్ బుకింగ్, పంట నష్టం అంచనాలపై మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు కలుగకుండా వ్యవసాయ కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు ప్రతి మండల స్థాయిలో సమన్వయం పెంచాలని సూచించారు.
కపాస్ కిసాన్ స్లాట్ బుకింగ్ ప్రక్రియను సమయానికి పూర్తి చేసి, రైతుల సౌకర్యం కోసం అవసరమైన సాంకేతిక సహకారం అందించాలని ఆదేశించారు. కౌలు రైతుల నమోదులో నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా పర్యవేక్షణను బలోపేతం చేయాలని, అర్హులైన ప్రతి రైతు వివరాలు కచ్ఛితంగా నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్యామలదేవి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్, ఏడీ మారెటింగ్ అధికారి గజానంద్, తదితరులు పాల్గొన్నారు.