మాధవుడు ప్రణాళుణ్ని శుద్ధ బౌద్ధ బిక్షువుగా మార్చే ప్రయత్నం ముమ్మరం చేసినాడు. పోటీసుని మీద చంద్రహత్థి మనసు పడ్డదని రాయహత్థి గ్రహించింది. సిరిసత్తి కోడలిని కాపురానికి తీసుకొని వెళ్లడానికి వీలుకాకుండా చేసింది అహయాదేవి. తర్వాత…
“అమ్మ ఎందుకట్లా మాట్లాడింది?” విసుగు, బాధ, దుఃఖం, అయోమయం కలగలిసిన గొంతుతో గుడ్ల నీళ్లు గుక్కుకుంటూ అన్నది రోహ. “అవును! తెలిసీ తెలియకుండా ఏదేదో మాట్లాడింది. పైగా వాళ్ల వార్తాహరుడు వచ్చి మన భటులను కొట్టినాడన్న విషయం చెప్పినప్పుడు నా గుండెలు గుబగుబ లాడినాయి. ఎక్కడ తీగలాగితే బావగారు వచ్చిన విషయం బయట పడుతుందోనని పడలి పోయినాను” గుండె మీద చేయి వేసుకున్నది సీహ. “ఇంతకూ అత్త నన్ను తీసుకెళ్తుందంటావా?” మారని అమాయకత్వానికి మారుపేరు రోహ. ఆశ్చర్యంతో నోట మాట రాలేదు సీహకు. ఒక్క క్షణం తర్వాత… “చంపేస్తా నిన్ను!” అన్నది కోపంతో ఊగిపోతూ. రోహ గొంతు మూగబోయింది. తర్వాత కొన్ని క్షణాలకు కళ్లనిండా నీళ్లతో.. “నిజంగానే చంపేస్తావా?” అన్నది. అక్క బేలతనానికి నవ్వాలో, ఏడవాలో తెలియలేదు. చివరకు… “నిన్ను ఎవరూ చంపనవసరం లేదే. నీ అమాయకత, నీ అజ్ఞానమే నీకు శత్రువులు. అవే నిన్ను ఎప్పుడో ఒకప్పుడు చంపేస్తాయి!” తనలో తాను అనుకున్నట్లే పైకి అనేసింది సీహ. “ఏంటీ? నాకు తెలియకుండానే నా చుట్టూ శత్రువులు ఉన్నారా?” నిజంగానే భయపడ్డది రోహ. అక్క అమాయకత్వానికి తల బాదుకున్నది సీహ.
“నిన్ను మాటిమాటికీ ఇట్లా విసిగించకూడదనే… నేను మావారి దగ్గరకు వెళ్లాలనుకుంటున్నాను. అత్త చెప్పినట్లు అమ్మ విని ఉంటే, ఈపాటికి పోదన నగరంలో ఉండేదాన్ని!” బుంగమూతి పెట్టుకున్నది రోహ. అంత కోపంలోనూ నవ్వాపుకోవడం కష్టమైంది సీహకు. “ఏడ్చినవ్ తియ్! నీ పసితనం వదలకపోతే నీవెక్కడున్నా ఏడుస్తూనే ఉంటావు!” అన్నది, అక్క ముఖంలో మారే రంగులను పరిశీలిస్తూ. అంతలో పరిచారిక వచ్చి చెప్పింది.. “అయ్యవారు వచ్చినారు. లక్ష్మీ వ్రతం కోసమై సిద్ధమై రమ్మన్నారు” అని. ఆ మాటలతో ఇద్దరూ అలంకరించుకొని పూజా మందిరం వద్దకు చేరినారు. అయ్యవారి మంత్రాలకు అనుగుణంగా చేయవలసిన పూజావిధులు పూర్తి చేసింది రోహ. అందుకు సహకరించింది సీహ. పూజానంతరం రోహ, సీహ ఏది జరగకూడదని కోరుకున్నారో అదే జరిగింది. పూజా విధులలో ఏర్పాట్ల పర్యవేక్షణలో, పూజా సమయంలో అహయాదేవికి మాట్లాడే సమయం చిక్కలేదు. ‘పూజ తర్వాత ఆమె ఎక్కడ మాట్లాడుతుందో! మాట్లాడితే ఏమేం బయట పెడుతుందో!!’ అని.. సీహ వెంటనే భోజనాలకు ఏర్పాట్లు చేయమని కోరింది. “ఆగండి! ఏమా తొందర? మన పురోహితులు భూత భవిష్యత్ వర్తమాన జ్ఞాన సంపన్నులు. ఆయనను అడిగి మన రోహ జీవితం ఎట్లుండబోతుందో తెలుసుకుందాం!” అన్నది కుతూహలంగా అహయాదేవి. “వదినా! జరిగిన కాలంలో ఏమేం ఉన్నాయో వారికంటే మనకే బాగా తెలుసు. జరుగుతున్నది మన అనుభవంలో ఉన్నదే. భవిష్యత్తు గురించి తెలుసుకోవడం వల్ల ఆనందం కంటే ఆందోళన అధికం!” అహయాదేవి మాటలను ఖండిస్తూ అన్నది సిరిసత్తి.
“అయ్యో! అదేంటి వదినా! అట్లా అంటారు? తెలుసుకుంటే భవిష్యత్తులో ఏమైనా విపత్తులు ఉంటే భద్రంగా ఉండటానికి కావలసిన చర్యలు, పరిష్కారాలు వెతుక్కుంటాం కదా!” పురోహితుల వారి ప్రతిభ వియ్యంకురాలికి ఎలాగైనా తెలియజేయాలన్న పట్టుదలతో అహయాదేవి అంది. “అమ్మా! అత్త వద్దంటున్నారు కదా! ఎందుకంత పట్టుపడతావ్?” చిరు కోపంతో అన్నది సీహ. “నీవు చిన్నపిల్లవు. నీకేం తెలవదు. నోరు మూసుకో!” అని సీహను మందలించి, వియ్యపురాలితో.. “వదినా…” అని ఏదో చెప్పబోయింది. ఆమెను పూర్తిగా మాట్లాడనీయకుండానే అడ్డుకున్నది సిరిసత్తి. “నాకు అన్నీ తెలుసు. జ్యోతిషాలు, సాముద్రికాలు ఇప్పుడు అవసరం లేదు”.. అంతే పట్టుదలగా అంటూ.. “ముందు భోజనాలు చేద్దాం పదండి. ఆకలిగా ఉంది…” ఆ విషయానికి చుక్క పెట్టమన్నట్లు అన్నది. “సరే వదినా! మీకు ఇష్టం లేకపోతే పోనీ, మా అమ్మాయి రోహ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం…” అన్నది అహయ. తగ్గలేదు సిరిసత్తి.
“ఇంతవరకు రోహ నీ కూతురు. ఇప్పుడు తను నా ఇంటి కోడలు. మాకు ఇటువంటివి ఏమీ అవసరం లేదు!” అని ఖండితంగా చెబుతూ.. “రా! రోహ! మనం భోజనశాలకు వెళ్దాం!” అంటూ రోహను తీసుకొని అటువైపు అడుగులు వేసింది. “సీహా! అయితే మనమే తెలుసుకుందాం. నేను ఈ స్వామివారితో అన్ని విషయాలూ తెలుసుకుంటూ ఉంటాను. వారు చెప్పినవన్నీ జరిగి తీరుతాయి. ఇంతవరకు ఏది తప్పలేదు!” సిరిసత్తికి తెలియాలని గొంతు పెంచి అన్నది సీహతో అహయ. “వద్దులే అమ్మా! మనం ఇంకొకసారి ఆచార్యుల వారిని పిలిపించుకొని ఇవన్నీ తెలుసుకుందాం గానీ…” తల్లి పద్ధతి నచ్చక, ఇది ఇంతటితో ఆపేయాలన్నట్లు అన్నది సీహ. “అవసరం లేదు! నేను వాళ్ల ముఖ కవళికలు చూసి భవిష్యత్తును గ్రహించినాను. ఆవిడగారి భవితవ్యం అంతా ఆందోళన భరితం!” అన్నాడు ఇదంతా చూస్తున్న పురోహితుడు. ఈ మాటలు సిరిసత్తి విన్నదో లేదో చెప్పడం కష్టం. విననట్లే ముందుకు కదిలిపోయింది. “అవునా….!” ఆశ్చర్యం, భయం కలగలిసిన గొంతుతో.. “మరి నా కూతురు… అదే ఆమె కోడలు రోహ సంగతి?” అహయ మాట పూర్తి కాకుండానే, “ఆమె పరిస్థితి మరీ దారుణం! నా మాట విని నీ కూతురును ఆమె వెంట పంపకండి!” హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు పురోహితుడు. ఈ మాటలు మాత్రం రోహ చెవిన పడ్డాయి.
* * *
పోటీసుడు కళ్లు తెరిచి చూసినాడు. అతనికేమీ అర్థం కావడం లేదు. ఏదో కొత్త ప్రదేశంలో ఒక గుడిసెలో ఉన్నాడు. అది తమ ఇంటి లాంటిదే కానీ తమ ఇల్లు కాదు. పక్కనే ఉన్న ఇద్దరు మనుషులను చూసినాడు. వాళ్లు ఎవరో తెలిసినట్లే ఉన్నారు కానీ ఎవరో గుర్తుకు రావడం లేదు. బలవంతంగా లేవడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. వీపులో ఏదో గునపం గుచ్చుకున్నంత బాధగా ఉంది. బాధను పంటి బిగువున తట్టుకున్నా, కన్నీటిని కట్టిపడేయలేక పోయినాడు. “తమ్ముడూ! నీకేమీ కాదు. మన గూడెంలోన ఎంతటి గాయాన్ని అయినా మాయం చేసే వెజ్జు ఉన్నాడు. నీవు మా కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వీరుడవు. మాకు దేవుడవు!” రెండు చేతులూ జోడించినాడు రాయవగ్గు. కన్నీళ్లతో దండం పెట్టింది రాయహత్థి.
జరిగిన సంఘటన లీలగా గుర్తుకు రాసాగింది పోటిసుడికి… గట్టిగా కళ్లు మూసుకున్నాడు… అడవి దొంగలను వెంబడించి ఆడవాళ్లను కాపాడటానికి పోవడం; అక్కడ దొంగలతో పోరాడటం; ఎవరో తనను వెన్నులో పొడవటం… అంతవరకే గుర్తున్నది. మరోమారు కళ్లు తెరిచి ఆ దంపతులను చూసినాడు. నిజమే! ఆ మహావీరుడు ఇతడే. ఈమె అతని భార్య! పోల్చుకున్నాడు. “నాయనా! మాట్లాడగలవా?” వాత్సల్యం నిండిన గొంతుతో పలకరించింది రాయహత్థి. నిజంగా వాళ్లది తల్లీకొడుకుల బంధమే! తన చనుబాలు తాగిన బిడ్డ అతడు. వయసులో ఇంచుమించు తన ఈడు వాడే కానీ, వరసకు కొడుకు అయినాడు. “ఇది ఏ ఊరు? నేను ఇక్కడికి ఎట్లా వచ్చినాను?” పోటిసుడు గొంతు పెకలించుకున్నాడు. “ఇది చెంచుగూడెం. దొంగల నుండి ఆడోళ్లను కాపాడటానికి నేను పోతుంటే, నీవు నాకు తెలియకుండా నా వెంట వచ్చినావు. దొంగలు దొంగ దెబ్బతో నిన్ను గాయపరిచినారు.!” అని జరిగిన సంఘటన వివరించినాడు. మళ్లీ కళ్లు మూసుకున్నాడు పోటిసుడు. అతని రెండు చెంపలపై నుండి కన్నీటి బొట్లు జారినాయి. “బాధపడకు బిడ్డా! నీవెవరు? ఎక్కడినుండి వచ్చినావు? ఎక్కడికి పోతున్నావు? అన్ని సంగతులూ చెప్పు! నా మొగడు మీ వాళ్లను కలిసి, కావలసిన మేలు చేస్తాడు. నీకు మంచి వైద్యం ఇప్పిస్తాం” ధైర్యం చెప్పింది రాయహత్థి.
“ఏంటీ? నాకు తెలియకుండానే నా చుట్టూ శత్రువులు ఉన్నారా?” నిజంగానే భయపడ్డది రోహ. అక్క అమాయకత్వానికి తల బాదుకున్నది సీహ. “నిన్ను మాటిమాటికీ ఇట్లా విసిగించకూడదనే… నేను మావారి దగ్గరకు వెళ్లాలనుకుంటున్నాను. అత్త చెప్పినట్లు అమ్మ విని ఉంటే, ఈపాటికి పోదన నగరంలో ఉండేదాన్ని!” బుంగమూతి పెట్టుకున్నది రోహ.అంత కోపంలోనూ నవ్వాపుకోవడం కష్టమైంది సీహకు. “ఏడ్చినవ్ తియ్! నీ పసితనం వదలకపోతే నీవెక్కడున్నా ఏడుస్తూనే ఉంటావు!” అన్నది, అక్క ముఖంలో మారే రంగులను పరిశీలిస్తూ.
రాయహత్థి చెవిలో ఏదో చెప్పి, అక్కడి నుండి గభాలున లేచి వెళ్లినాడు రాయవగ్గు. కళ్లు మూసుకుని తన గురించి చెప్పినాడు పోటిసుడు… “నా పేరు పోటిసుడు. మాది పోదన నగరం. నా యజమాని జయసేనుడు అప్పగించిన ఒక ముఖ్యమైన పనిమీద కళింగపట్నం వెళుతున్నాను…” “భార్యాపిల్లల గురించి అడుగు…” హఠాత్తుగా తన చెవి వద్ద వినబడిన గుసగుసకు ఉలిక్కిపడి తలతిప్పింది రాయహత్థి. పక్కనే చంద్రహత్థి. “నీవెప్పుడు వచ్చినావే….” భయాన్ని దిగమింగి, ఆశ్చర్యం ప్రకటించింది రాయహత్థి. “పోతే కదా… రావడానికి” తలవంచుకునే అన్నది చంద్రహత్థి. మరోమారు ఉలిక్కిపడ్డది రాయహత్థి. “అవును. నిజమే అక్కా! ఆయనను అట్లా వదిలిపెట్టి పోలేక, ఉండే మార్గం తెలియక… ఇంటికి పోయి నాయనకు చెప్పిన. ‘మా ప్రాణాలు కాపాడిన మహావీరుడు ఆపదలో ఉన్నాడు. అతన్ని చూసుకోవడానికి రాయహత్థి అక్కకు తోడుగా నేనుంటా’ అని. సరేనన్నాడు. “మరి, ఇంతసేపు ఎక్కడున్నావే?!” మరింత ఆశ్చర్యంగా అడిగింది రాయహత్థి. “నేరుగా ఇక్కడికి వచ్చి కూర్చోలేక, ఎదురింటి వసారాలో కూర్చొని, తడిక సందులో నుంచి అన్నీ చూస్తున్నాను” అసలు సంగతి చెప్పింది. “అంటే… రాత్రంతా…” అనుమానంగా చూసింది. “ఎదురింటిలో మేల్కొనే ఉన్నా అక్కా!” .. దాని కళ్లు అబద్ధం చెప్పడం లేదు. అంతలో వైద్యున్ని వెంటబెట్టుకుని వచ్చినాడు రాయవగ్గు.
(సశేషం)