మేడ్చల్, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలకు ఇంటి నెంబర్ల కేటాంపులపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 16 శివారు మున్సిపాలిటీలలోని ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలకు ఇంటి నెంబర్లు కేటాయించడంపై విజిలెన్స్ అధికారులు వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బోడుప్పల్, జవహర్‌నగర్, పీర్జాదిగూడ, నిజాంపేట్లు కార్పొరేషన్లు కాగా మేడ్చల్, గుండ్లపోచంపల్లి, తూకుంట, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, దుండిగల్, కొంపల్లి, మూడుచింతలపల్లి, అలీయాబాద్, ఎల్లంపేట్ మున్సిపాలిటీలుగా ఉన్నాయి.
అయితే కొన్ని మున్సిపాలిటీలైన బోడుప్పల్, పీర్జాదిగూడ, పోచారం, గుండ్లపోచంపల్లి, జవహర్‌నగర్, దుండిగల్ మేడ్చల్, తూంకుంట మున్సిపాలిటీల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములలో కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్న క్రమంలో వాటికి కొందరు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు లోపాయికారిగా ఇంటి నెంబర్లు ఇస్తున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలను చట్టబద్దం చేసేందుకు కబ్జాదారుల వద్ద లంచాలు తీసుకుని అధికారులు ఇంటి నెంబర్లను కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో స్థానిక ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఇంటి నెంబర్లను సక్రమంగా ఇస్తున్నారా లేక కబ్జాదారులతో కుమ్ముకై నెంబర్లను కేటాయిస్తున్నారా? అనే విషయంపై విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.
నకిలీ పట్టాలు సృష్టించి&
గతంలో ప్రభుత్వ భూములలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ ఇచ్చిన పట్టాల మాదిరిగానే వివిధ మున్సిపాలిటీలలో ప్రభుత్వ భూములు ఉన్న సర్వే నెంబర్లలో నకిలీ పట్టాలను కబ్జాదారులు సృష్టించి అక్రమ నిర్మాణాలు చేస్తూ ఇంటి నెంబర్లను తీసుకుంటున్నారు. అధికారులు కబ్జాదారులతో కుమ్ముక్కై ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు పూర్తి చేసి నిరుపేదలకు లక్షల్లో విక్రయించి కబ్జాదారులు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో జిల్లాలోని శివారు ప్రాంతాల్లో గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాల వివరాలను స్థానిక తహశీల్దారు కార్యాలయాలలో విజిలెన్స్ అధికారులు సేకరించినట్లు సమాచారం. అయితే నకిలీ పట్టాలతో నిర్మించిన అక్రమ నిర్మాణాలకు ఇంటి నెంబర్లు కేటాయించిన టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారుల వివరాలు సేకరించి నివేదికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కబ్జాదారులు చేస్తున్న అక్రమలకు అసలైన నిరుపేదలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గతంలో నిరుపేదలు పొందిన ఇళ్ల స్థలాల పట్టాలపై అధికారులు అంక్షలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అంతా పర్యవేక్షణ లోపమే&
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న నేపథ్యంలో పర్యవేక్షణ లోపం కారణంగా కబ్జాదారులు ఇదే అదనుగా భావిస్తూ అక్రమాలను సక్రమంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఇంచార్జిలుగానే ఉన్న క్రమంలో అసలు పర్యవేక్షణే లేకుండా పోయింది. దీంతో ఇష్టారీతిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. కలెక్టరేట్‌కు ఫిర్యాదులు వస్తే తప్పా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ భూములలో ప్రైవేట్ వ్యక్తులు రోడ్లు వేస్తున్నా మున్సిపాలిటీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కీసర మండలం రాంపల్లి దయారాలో సర్వే నెంబర్ 618 ప్రభుత్వ భూమిలో సీసీ రోడ్డు నిర్మించినా కనీసం అటువైపు కూడా అధికారులు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేక అధికారుల పాలనలో మున్సిపాలిటీల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.