Farmers Protest | సూర్యాపేట జిల్లా: కన్నెపల్లి పంప్ హౌస్‌ను తక్షణమే ప్రారంభించి, ఎండిపోతున్న ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయం వద్ద రైతులు, BRS శ్రేణులు భారీ ఆందోళన నిర్వహించాయి.
మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, సూర్యాపేట జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ నిర్మల శ్రీనివాస్, సూర్యాపేట జెడ్పిటిసి జీడి బిక్షం, బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు నెమ్మాది శ్రావణ్ కుమార్ ముఖ్య నాయకులు నేతృత్వంలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు , రైతులు కలెక్టరేట్ ముందు బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు .
ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు నెమ్మాది శ్రావణ్ కుమాత్తోపాటు ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు ప్రమాదం పొంచి ఉందని.. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఏటా సకాలంలో నీరందించి రైతాంగాన్ని ఆదుకున్నామని గుర్తు చేశారు. కానీ , ప్రస్తుత ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కన్నెపల్లి పంప్ హౌస్ పునరుద్ధరణను నిర్లక్ష్యం చేస్తూ కాళేశ్వరం జలాలను ఆపాలని కుట్ర పన్నుతోందని తీవ్రంగా ఆరోపించారు.
రైతుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలి..
రైతుల పొలాలు ఎండిపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ , కావాలనే కాలయాపన చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు.తక్షణమే కన్నెపల్లి పంప్ హౌస్‌ను యుద్ధప్రాతిపదికన ప్రారంభించి ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని , సాగునీటి విషయంలో రాజకీయం పక్కన బెట్టి , రైతుల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం పనిచేయాలని డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ముట్టడితో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది . అనంతరం బీఆర్ఎస్ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే గోదావరి జలాలను విడుదల చేయకుంటే BRS అధినేత తెలంగాణ జాతిపిత,కెసిఆర్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ల నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా రైతాంగాన్ని ఏకం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
