పిల్లలు దైవంతో సమానం అని మన ప్రగాఢ నమ్మకం. అందుకే ‘పిల్లలూ దేవుడూ చల్లనివారే’ అని పాటలల్లేస్తాం. పిల్లలు తప్పు చేస్తే వారికి పెద్దల్లాగా తీవ్రమైన శిక్షలు విధించం. అటు శాస్ర్తాలు, ఇటు చట్టాలు కూడా పిల్లల నేరం వెనుక పరిసరాల లోపమే కారణమని నమ్ముతాయి. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు.. తమలో ఏర్పడే ఈర్ష్య, ద్వేషం, కోపం, ఉక్రోషం లాంటి ప్రతికూలమైన ఉద్వేగాలను అదుపు చేసుకునే పరిణతి వారిలో ఉండకపోవచ్చు. ఆ భావనలు తీవ్రమైన చర్యలుగా మారిపోవచ్చు. అందుకు పాఠశాలే ప్రయోగశాల అవుతుంది.
తనకంటే బాగా చదివే పిల్లల పుస్తకాలు దాచేయడం, గోడల మీద రాతలు, టీచర్లని సైతం వేధించడం… లాంటి ఉదాహరణలు సవాలక్ష కనిపిస్తాయి. కానీ, ప్రతి బడిలోనూ, ప్రతి తరగతిలోనూ ఆ మాటకు వస్తే ప్రతీ విద్యార్థి జీవితంలో ఏదో ఒక దశలో కనిపించే సమస్య బుల్లీయింగ్! కాస్త మెతగ్గానో, బలహీనంగానో, చదువులో వెనుకబాటుగానో ఉన్న విద్యార్థిని లక్ష్యంగా చేసుకుని అదే పనిగా వేధించడం. దురదృష్టం ఏమిటంటే…
చాలామంది వీటిని ‘పిల్ల చేష్టలు’గా కొట్టి పారేస్తుంటారు. ఎవరికన్నా చెబితే వేధింపులు పెరుగుతాయేమో అన్న భయంతో పిల్లలు ఆగిపోతారు, ఆ భయాన్ని దాటి పెద్దలకి చెప్పినా కొట్టి పారేయడమో ‘పట్టించుకోవద్దు..
వాడి జోలికి వెళ్లొద్దు’ లాంటి సూచనలే వినిపిస్తాయి, టీచర్లు కూడా వేధించే ఆకతాయిలను ఏం చేయాలో తోచక అయోమయంలో పడిపోతుంటారు. కానీ, బుల్లీయింగ్ పిల్లల వ్యక్తిత్వం, భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని పరిశోధనలు వాపోతున్నాయి. దాన్ని ఎలా ఎదుర్కోవాలో స్పష్టత లేకపోతే అప్పటికప్పుడే విద్యార్థి జీవితం నాశనం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి.

2025 నవంబర్ 1. అది జైపూర్‌లోని ప్రతిష్ఠాత్మక నీర్జా మోదీ స్కూల్. ఎప్పటిలాగే ఆ స్కూల్‌కి బయల్దేరింది తొమ్మిదేళ్ల అమైరా మీనా. తను చదివేది నాలుగో క్లాస్. చదువులో ఫస్ట్. ఆటపాటల్లోనూ చురుగ్గానే ఉండేది. కానీ ఒకటే వెలితి. ఓ ఏడాదిన్నరగా తనను తోటి పిల్లలు బాగా ఏడిపిస్తున్నారు. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లూ స్కూల్‌కి వెళ్లినప్పుడల్లా టీచర్లకు చెప్పేవారు. కానీ, వాళ్లకు తిరిగి వచ్చిన సలహా ఒక్కటే! సర్దుకుపోయేందుకు ప్రయత్నించమని. కానీ, ఆ రోజు తన వల్ల కాలేదు. తన ముందున్న పిల్లాడు డిజిటల్ స్లేట్ మీద ఏదో గీసి తనకి చూపించాడు. అది అశ్లీలమో, తిట్టో.. చూసిన అమైరా షాకైపోయింది. అది అక్కడితో ఆగలేదు. తను మాటలతో ఏడిపించడం మొదలుపెట్టాడు. మరోదారి లేని అమైరా టీచర్ దగ్గరికి వెళ్లింది. టీచర్ తనకు ఎప్పటిలాగే సర్దిచెప్పే ప్రయత్నం చేసింది.
ఇది చూసిన ఆకతాయి ఇంకా రెచ్చిపోయాడు. తను కూడా టీచర్ దగ్గరికి వెళ్లి కంప్లయింట్ చేశాడు. ఒకరి మీద ఆరోపణ కాస్తా ఇద్దరి మధ్య గొడవగా మార్చే తెలివైన ప్రయత్నమది. వేధింపులు పెరిగాయి. మిగతా ఆకతాయిలూ తోడయ్యారు. అమైరా ఒకసారి, రెండుసార్లు కాదు.. ఏకంగా అయిదుసార్లు టీచర్ దగ్గరికి వెళ్లింది. తను అలా వెళ్లే ప్రతిసారీ తనకు వ్యతిరేకంగా మరింతమంది టీచర్ దగ్గరికి వెళ్లారు. ఇప్పుడు తను ఒంటరిది. చేతులు జోడించి మరీ టీచర్ని వేడుకుంది. కానీ, ఆ పెద్దావిడకి అంత సహనం లేకపోయింది. ఈ రభస మొత్తానికీ కారణం అమైరానే అన్న చిరాకుతో తన మీదే విరుచుకుపడింది. పాపం ఆ పసిపిల్లకి నమ్మకం పోయింది. నెలల తరబడి భరిస్తున్నా తనకు ఎవరూ అండగా నిలబడలేకపోయారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు ఎవరి ముందు చేతులు జోడించినా సాయం దక్కలేదు. ఇలాంటి మనుషుల మధ్య ఎలా ఉండగలననే ప్రశ్న తనని నిలువనీయలేదు. గబగబా క్లాస్‌లోంచి బయటికి వచ్చింది. నాలుగో అంతస్తుకి చేరుకుని..!
అమైరా అంటే అందం, నాయకత్వం లాంటి అర్థాలతో పాటు అమరత్వం అనే భావన కూడా ఉంది. కానీ, తన జీవితాన్ని అర్ధంతరంగా ముగించిందీ వ్యవస్థ. ఆ వయసు పిల్లలకు ఆత్మహత్య అన్న ఆలోచన రావడం దురదృష్టకరమే. కానీ, అందుకు బాధ్యత సమాజానిదే. అధికారులు మాత్రం స్కూల్ గుర్తింపు రద్దు చేసి చేతులు దులిపేసుకున్నారు. అమైరా తల్లిదండ్రులు ఎంతలా పోరాడుతున్నా బలమైన స్కూల్ యాజమాన్యం ముందు నిలువలేకపోతున్నది. అమైరా తీసుకున్న ఆ నిర్ణయంతో ఇది ఓ సంచలన వార్తగా నిలిచి ఉండవచ్చు. కానీ, ప్రతి తరగతిలోనూ తనలాంటి వాళ్లు ఉన్నారు. ప్రతి స్కూల్లోనూ ఆకతాయిలు కనిపిస్తారు. వేర్వేరు అంచనాల ప్రకారం 34 నుంచి 42 శాతం వరకూ విద్యార్థులు ఈ బుల్లీయింగ్ని ఎదుర్కొంటున్నారు. చిన్న తరగతులలో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తున్నది!


పిల్లల్లో కనిపించే లక్షణాలు అసహజంగా ఉన్నప్పుడు వాటి వెనుక వేధింపులు ఉన్నాయేమో గమనించి తీరాలి. బాగా చదివే పిల్లవాడు ఒక్కసారిగా చదువన్నా, బడి అన్నా అయిష్టత చూపడం, తన వస్తువులను పోగొట్టుకునో పాడుచేసుకునో రావడం, ఇంట్లో వాళ్లకీ, స్నేహితులకీ కూడా దూరంగా ఉండటం, వేళకి తినకపోవడం, స్తబ్దుగా ఉండిపోవడం, స్కూలు గురించి మాట్లాడేందుకు ఇష్టపడకపోవడం, ఆడుకోకపోవడం.. అన్నీ కూడా ఆరా తీయాల్సిన పరిస్థితులే. వీటిని పసిగట్టకపోతే.. అవి బలమైన గాయాలుగా మారిపోతాయి. మనుషుల మీద నమ్మకం కోల్పోవడం, చొరవ లేకపోవడం, మత్తు పదార్థాలకి అలవాటు పడటం, బంధాలను నిభాయించుకోలేకపోవడం, ఆఫీసులో నలుగురితో కలిసి పని చేయలేకపోవడం… ఇలా వ్యక్తిత్వాన్ని, జీవితాన్నే మార్చేసే స్థాయిలో బుల్లీయింగ్ ప్రభావం ఉండవచ్చు. JAMA Pediatrics జర్నల్ పరిశోధన ప్రకారం.. మిగతావారితో పోలిస్తే, వేధింపులకు గురైన విద్యార్థులలో ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన 2.5 రెట్లు అధికంగా ఉందట.

ఆదిలోనే:ఎవరి ప్రవర్తన అన్నా అభ్యంతరకరంగా ఉంటే… మొదట్లోనే నిరసన వ్యక్తం చేయాలి. తను దాడికి కవ్విస్తుంటే పట్టించుకోకుండా వెళ్లిపోవాలి.
నమ్మకస్తులతో: తను వేధింపులకి లక్ష్యంగా మారాను అన్న అనుమానం కలిగిన వెంటనే ఎవరికన్నా పెద్దలకి చెప్పాలి. సమస్య తీరుతుందన్న నమ్మకాన్ని బట్టి టీచర్, క్లాస్ మెంటార్, ఇంట్లో పెద్దలు.. ఇలా ఎవరికన్నా చెప్పి తీరాలి.
నలుగురితో ఉంటే: బుల్లీయింగ్ చేసేవాళ్లు ఎక్కువగా ఒంటరి వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుంటారు. అది వాళ్లకు తేలిక. అందుకే ఎవరన్నా వేధిస్తుంటే, స్నేహితులతో పంచుకోవాలి. కొన్నాళ్లపాటు వారితోపాటే ఉండే ప్రయత్నం చేయాలి.
న్యూనతతో పనిలేదు: ఎవరన్నా ప్రత్యేకించి మనల్నే వేధిస్తున్నప్పుడు ‘నేనే ఎందుకు?’, ‘నాకే ఎందుకిలా?’ ‘నాలోనే లోపం ఉందేమో!’ లాంటి ఆలోచనలు మన విశ్వాసాన్ని మసిచేసేస్తాయి. అది మన తప్పు కాదు, ఎదుటివాడిలో లోపం అని గుర్తించాలి. ఆకతాయి మన మనసులో మరీ చొరబడుతుంటే.. ఆ ఆలోచనలని తరిమికొట్టేసేందుకు ఆటలు, చదువు, క్లబ్ యాక్టివిటీస్, మార్షల్ ఆర్ట్స్ లాంటి వ్యాపకాల్లో మరింతగా మునిగితేలితే సరి. వాటితో విశ్వాసం మెరుగవడంతో పాటు.. కొత్త స్నేహితులు కూడా పరిచయమవుతారు.
సాక్ష్యాలు భద్రం: అమైరాని వేధించిన ఆకతాయి… మర్నాటి నుంచి బడికి సెలవు పెట్టేశాడు. తర్వాత ఎవరో ‘అమైరా తెలుసా?’ అని అడిగితే.. ‘అసలు ఆ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు, ఆ రోజు ఆ తరగతిలో నేను లేను’ అనేశాడు. పరిస్థితి చేజారినప్పుడు బుకాయించడం ఆకతాయిల వ్యూహం. అందుకే వేధింపుల గురుతులు పకడ్బందీగా ఉండాలి. తరగతి గదిలో సీసీటీవీ కనుచూపుమేరలో ఉండేలా చూసుకోవాలి. సైబర్ బుల్లీయింగ్ అయితే సందేశాలనీ, స్క్రీన్ షాట్లనీ సేవ్ చేసుకోవాలి.
రకరకాల మార్గాలు:వేధింపులను తట్టుకునే మానసిక ైస్థెర్యం కోసం రకరకాల మార్గాలున్నాయి. ఉదాహరణకు Empty Chair Technique అనే పద్ధతిలో ఓ ఖాళీ కుర్చీని ఆకతాయిగా ఊహించుకుని తనతో ధైర్యంగా మాట్లాడుతున్నట్టు ప్రాక్టీస్ చేయవచ్చు. ‘Kavach’ లాంటి యాప్స్ బుల్లీయింగ్ ఎదుర్కోవడంలో అండగా నిలుస్తాయి. ఎప్పటికప్పుడు ఈ సంఘటనలు రాసి పెట్టుకోవడం కూడా మనసులో భారం తగ్గించుకునేందుకు, సమయం వచ్చినప్పుడు వాస్తవాలు వివరించేందుకు ఉపయోగపడుతుంది.
ఫీజులే ధ్యేయంగా ఉన్న పాఠశాలలు ఆకతాయిల మీద మరీ కఠినంగా ఉండటం లేదనే ఆరోపణ ఉంది. కానీ, ఆ అలసత్వమే ఓ విపరీత పరిణామానికి దారితీసి ఏకంగా బడి మూసే పరిస్థితి వస్తుందని గుర్తించాలి. బుల్లీయింగ్‌కి సంబంధించి CBSE, జాతీయ బాలల హక్కుల కమిషన్, విద్యాచట్టం ఎన్నో నిబంధనలు, మార్గదర్శకాలు నిర్దేశించాయి. యాజమాన్యానికి వాటి గురించి కచ్చితమైన అవగాహన ఉండటమే కాకుండా… సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వాలి.

దాదాపుగా అమైరా చనిపోయిన సమయంలో మరో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ మూడింట్లోనూ ఒక సారూప్యత ఉంది. ముగ్గురూ కూడా పై తరగతులు చదివేవారే. ముగ్గురూ కూడా తమ టీచర్ల వేధింపులను తట్టుకోలేకపోతున్నాం అని రాసి పెట్టి చనిపోయారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన ఈ ముగ్గురి ఆరోపణ కూడా… కొందరు టీచర్లే తనే లక్ష్యంగా మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని! బుల్లీయింగ్ అనేది కేవలం సాటి విద్యార్థుల నుంచే కాదు ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ నుంచి కూడా రావచ్చని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి.
కొచ్చికి చెందిన 9వ తరగతి విద్యార్థి మిహిర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన రంగు కారణంగా మిహిర్‌ను చిన్నప్పటి నుంచే వేధించేవారు. ఓ రోజు అది మరీ శ్రుతి మించింది. తన తలని టాయిలెట్లో పెట్టి ఫ్లష్ చేశారు. ఆ అవమానం తట్టుకోలేక చనిపోతే… విషయం తెలిసిన ఆకతాయిలు బాధపడలేదు సరికదా, తన చావుని కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. మిహిర్ మేనమామ ఐడి ఫుడ్స్ సీఈఓ అయినా కూడా..
వేధింపులను ఆపలేకపోయాయి. స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ సైతం ఆకతాయిలకే మద్దతు పలికారనే ఆరోపణలు ఉన్నాయి.
ఖరీదైన బోర్డింగ్ స్కూల్ అనగానే కంటికిరెప్పలా చూసుకుంటారనుకుంటాం. కానీ! డెహ్రాడూన్‌లో ఓ 12 ఏళ్ల పిల్లాడిని తోటి విద్యార్థులు విపరీతంగా కొట్టారు. ఆ దెబ్బలతో పిల్లాడు చనిపోతే.. స్కూల్ యాజమాన్యమే శవాన్ని మాయం చేయడంలో సహకరించింది.
ఇలాంటి వివరాలన్నీ చాలా కలవరపరిచేవే. కానీ, వేధింపుల సమస్యని అంత తేలికగా తీసుకోకూడదనే హెచ్చరిక కోసం వీటిని చెప్పుకోవాల్సి వస్తున్నది.
– కె.ఎల్.సూర్య