హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ నేల స్వభావం, స్థానిక భాషా సౌందర్యం, ఇకడి సంసృతిని సహజసిద్ధంగా ప్రతిబింబిస్తూ తెరకెకిన అద్భుతమైన దృశ్యరూపం ‘ది ప్యారడైజ్’ సినిమా అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ‘ది ప్యారడైజ్’ సినిమాను వీక్షించారు. అనంతరం థియేటర్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఏ సమాజంలోనైనా తీవ్రమైన అణచివేత ఎదురైనప్పుడు ఆ ప్రజలు తమ అస్తిత్వం, ఆత్మగౌరవం, న్యాయం కోసం ఏ విధంగా గళమెత్తి పోరాడుతారో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అత్యంత ప్రభావవంతంగా వెండితెరపై ఆవిషరించారని కేటీఆర్ కొనియాడారు. అణగారిన వర్గాల పక్షాన నిజమైన నాయకుడు నిలబడి, వారిని చైతన్యపరిచి ఎలా ముందుండి నడిపించాడో చకటి కథాంశంతో కండ్లకు కట్టినట్టు చూపించారని పేరొన్నారు. తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటానికి ఇంతటి బలమైన దృశ్యరూపం ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతిభను ప్రత్యేకంగా కొనియాడారు. విలక్షణ నటనతో పాత్రకు ప్రాణం పోసిన నటుడు నానితో పాటు, చిత్ర నిర్మాణ బృందానికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ యాస, భాషల సొగసుతో సహజ వాతావరణంలో సాగిన ఈ చిత్రం ఒక గొప్ప కావ్యంలా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే సమాజానికి బలమైన సందేశాన్నిచ్చిందని కేటీఆర్ ప్రశంసించారు. ఈ సినిమా నేపథ్యం, అందులో కనిపించిన పోరాటానికి అసలైన ప్రేరణ ఎవరో ప్రత్యేకంగా తాను చెప్పాల్సిన అవసరం లేదని, అది ఇప్పటికే ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైపోయిందని చమతరించారు. తెలంగాణ నేల చారిత్రక పోరాట స్ఫూర్తిని, ప్రజల ఆత్మగౌరవ ప్రతీకను ఘనంగా చాటిన ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని ప్రతి ఒకరూ ఆదరించాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నాయకులు జగదీశ్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, అనిల్‌జాదవ్, వద్దిరాజు రవిచంద్ర తదితరులున్నారు.