ఎన్నిమార్లు విన్నా.. ఎన్నిసార్లు కన్నా.. తనివితీరని పుణ్యగాధ ‘రామాయణం’. అది మన దేశ సంపద. మన అస్తిత్వానికి ప్రతీక. అందుకే.. ఎన్నిసార్లు తెరకెక్కినా ఈ దృశ్యకావ్యాన్ని చూసేందుకు జనం సిద్ధంగానే ఉంటారు. ప్రస్తుతం బాలీవుడ్లో దాదాపు 3వేల కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో రెండు భాగాలుగా ‘రామాయణం’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నితీశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈచిత్రంలో సీతారాములుగా సాయిపల్లవి, రణబీర్‌కపూర్ నటిస్తుండగా, రావణబ్రహ్మగా ‘కేజీఎఫ్’ఫేం యశ్ కనిపించనున్నారు. తొలి భాగం దీపావళి కానుకగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈసినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ వేగవంతం చేశారు.
ఆదివారం ఈ సినిమా నుంచి రెండు పోస్టర్లను విడుదల చేశారు. అందులో తొలి పోస్టర్ సీతారామలక్ష్మణులది కాగా, రెండో పోస్టర్ రావణబ్రహ్మది. వనవాసకాలంలో సీతాలక్ష్మణ సమేతంగా ధనుర్బాణాలతో కనిపిస్తున్న రామచంద్రమూర్తిని తొలిపోస్టర్లో చూడొచ్చు. రాముడిగా రణబీర్‌కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. ఇక సర్వాలంకారభూషితుడైన రావణబ్రహ్మగా యశ్ని రెండో పోస్టర్లో చూడొచ్చు. మహాశక్తివంతుడు, బ్రహ్మజ్ఞాని, లంకాధీశుడైన రావణుడ్ని ఈ పోస్టర్లో అద్భుతంగా ఆవిష్కరించారు. ఇందులో రావణపత్ని మండోదరిగా కాజల్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్న విషయం తెలిసిందే.