టెక్నాలజీ రంగంలో ఆయన ఓ సీఈవోనే కాదు… ప్రపంచ ఏఐ దిశను మార్చిన వ్యూహకర్త. చాట్ జీపీటీ, జెమినీ, క్లాడ్, డీప్‌సీక్… ఇలా ఏ ఏఐ మాడల్ గురించి మాట్లాడినా, ఎవరిని అడిగినా వాటి వెనుక ఉన్నది ఎన్విడియా చిప్సే అని టక్కున చెప్తారు. కృత్రిమ మేధ (ఏఐ) గురించి మాట్లాడినప్పుడల్లా కొన్ని పేర్లు తప్పక వినిపిస్తాయి. వాటిలో ప్రత్యేకంగా వినిపించే పేరు ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు, సీఈవో జెన్సెన్ హువాంగ్. ఒకప్పుడు గేమింగ్ గ్రాఫిక్స్ కంపెనీగా పేరున్న ఎన్విడియాను, నేడు ఏఐ ప్రపంచానికి బ్యాక్‌బోన్‌గా నిలిచే సంస్థగా తీర్చిదిద్దిన నాయకుడు ఆయనే. ‘ఏఐ యుగానికి సారథి’గా పేరొందిన జెన్సెన్ హువాంగ్ ప్రస్థానం ఓ గెలుపు పాఠం.
ప్పుడు హువాంగ్ వయసు 15 ఏండ్లు. తన చదువు కొనసాగించడానికి డబ్బులు కావాలి. వాటిని సంపాదించడం కోసం ఓ హోటల్లో పనికి కుదిరాడు. కప్పులు కడుగుతూ, ఫ్లోర్ ఊడుస్తూ, టేబుల్స్ శుభ్రం చేస్తూ.. అలా వచ్చిన డబ్బుతో ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. ఈ పని తనకు వృత్తిపై నిబద్ధత, శ్రద్ధను అలవాటు చేసిందని ఇప్పటికీ పలు వేదికలపై ప్రస్తావిస్తుంటాడు హువాంగ్. 1992 చివర్లో సిలికాన్ వ్యాలీలో సహచరులుగా పనిచేస్తున్న కుర్టీస్ ప్రేమ్, క్రిస్ మాలాచౌస్కీతో కలిసేందుకు డెన్సీస్ డైనర్‌ను ఎంచుకున్నాడు. అక్కడే కాఫీ టేబుల్‌పై ఉన్న టిష్యూ పేపర్‌పైన బ్లూప్రింట్తో మొదలైన వారి ఎన్విడియా ప్రస్థానం నేడు నాలుగు ట్రిలియన్ల డాలర్స్ విలువతో దూసుకుపోతున్నది.

1963లో తైవాన్‌లో జన్మించిన హువాంగ్ చిన్న వయసులోనే అమెరికాకు వెళ్లాడు. ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాడు. ఎల్ఎస్ఐ లాజిక్, అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ (ఏఎండీ) వంటి సంస్థల్లో పనిచేసిన అనుభవంతో 1993లో ఇద్దరు సహచరులతో కలిసి ‘ఎన్విడియా’ను స్థాపించాడు. మొదట వీడియో గేమ్స్ కోసం గ్రాఫిక్స్ ప్రాసెసర్లను తయారుచేసిన సంస్థ, ఈరోజు ఏఐ చిప్స్, సూపర్ కంప్యూటింగ్, డాటా సెంటర్ల రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఎదిగింది.
హువాంగ్ వ్యక్తిత్వంలో కనిపించే గొప్ప లక్షణం… భవిష్యత్తును ముందుగానే ఊహించే దూరదృష్టి. తక్షణ లాభాల కంటే పదేండ్ల తర్వాత ప్రపంచానికి ఏ సాంకేతికత అవసరమో దానిపైనే ఆయన దృష్టి ఉంటుంది. ఉద్యోగులతో నేరుగా మాట్లాడటం, క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా వివరించడం, నిరంతరం నేర్చుకోవాలని ప్రోత్సహించడం ఆయన నాయకత్వ శైలికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. హువాంగ్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో జీపీయూలను కేవలం గేమింగ్‌కే పరిమితం చేయకుండా ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, అటానమస్ డ్రైవింగ్ వంటి రంగాలకు విస్తరించడం ముఖ్యమైనది. నేడు ప్రపంచంలోని ప్రముఖ ఏఐ మాడల్స్‌లో చాలా వరకు ఎన్విడియా హార్డ్‌వేర్‌పైనే ట్రైనింగ్ తీసుకుంటున్నాయి. దీంతో హువాంగ్ను చాలామంది ‘గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ హార్డ్‌వేర్’ అని కూడా పిలుచుకుంటారు.
హువాంగ్ దృష్టి ఇప్పుడు ‘జెనరేటివ్ AI’ నుంచి ‘ఫిజికల్ ఏఐ’ వైపు మళ్లింది. వృద్ధ జనాభా, కార్మికుల కొరత వంటి ప్రధాన సమస్యలకు ఏఐ ఆధారిత రోబోలే పరిష్కారం అవుతాయని జపాన్‌లో జరిగిన కార్యక్రమంలో తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ‘ఫిజికల్ ఏఐ’ భవిష్యత్తుకు జపాన్ కేంద్రంగా మారుతుందని, మనుషులతో కలిసి పనిచేసే రోబోలు, ఆటోమేషన్ ఇండస్ట్రీస్, ఏఐ ఆధారిత పరిశ్రమలు భవిష్యత్ సాంకేతిక విప్లవమని హువాంగ్ నమ్మకం. కంప్యూటర్లను మార్చిన నేటి జీపీయూలు.. రేపు ప్రపంచాన్ని మార్చే రోబోలకు మెదడుగా మారాలన్నదే ఆయన లక్ష్యం.
నేడు లక్షల కోట్లు విలువ చేసే తన సంస్థ ఇక్కడే పురుడుపోసుకున్నదంటూ.. 30 ఏండ్ల తరువాత 2023లో డెన్నీస్ డైనర్కు చేరుకున్న హువాంగ్ పాత స్మృతులను నెమరు వేసుకున్నాడు. పాత రోజుల్లో డైనర్లో ఎలా సెర్వ్ చేసేవాడో అలానే సెర్వింగ్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ‘ఇది మా డైనర్’ అంటూ డెన్నిస్ డైనర్‌ను సంబోధించి ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. సంపద పరంగా, ఆశయాల పరంగానే కాకుండా విలువల్లోనూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు హువాంగ్.
ఇటీవల ఫుజిట్సూ, ఫనుక్, యస్కావా వంటి ప్రముఖ సంస్థలతో కలిసి బెస్ట్ పారిశ్రామిక రోబోట్ల అభివృద్ధికి భాగస్వామ్యాన్ని ప్రకటించాడు హువాంగ్. అదే సమయంలో ఆయన ఎప్పుడూ ధరించే బ్లాక్ ‘టామ్ ఫోర్డ్ లెదర్ జాకెట్స్’లో ఒకటి సోథెబీస్ నిర్వహించిన ఛారిటీ వేలంలో 9.6 లక్షల డాలర్లకు (సుమారు రూ.8 కోట్లకు పైగా) అమ్ముడైంది. ఏఐ యుగానికి ప్రతీకగా మారిన హువాంగ్ వ్యక్తిత్వానికి ఇది మరో ఉదాహరణగా నిలిచింది. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని యువ శాస్త్రవేత్తలు, సాంకేతిక ఆవిష్కర్తల ప్రోత్సాహానికి వినియోగించనున్నారు.