న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ఎన్నికల సంఘం, ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు సంబంధించిన ఆందోళనలతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు ఈనెల 30న ఢిల్లీలో సమావేశమయ్యే అవకాశం ఉందని సంబంధిత పార్టీలు తెలిపాయి. ఎన్నికల సంఘంవ్యవహారాలపై ప్రతిపక్ష పార్టీల మ ధ్య సమన్వయం పెరుగుతున్న తరుణంలో ఈ సమావేశం జరగనున్నది. ఈ అంశంపై సంబంధిత పక్షాలు పరస్పరం సంప్రదింపులు జరుపుతున్నాయని ఉమ్మడి స్పందనపై చర్చిస్తున్నాయని వర్గాలు తెలిపాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని, సర్ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్ పార్టీలు డిమాం డ్ చేయగా, కాంగ్రెస్ కూడా జ్ఞానేశ్ కుమార్‌పై తన విమర్శలను తీవ్రతరం చేసింది. ఈ వ్యవహారంపై తన వ్యూహాన్ని చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఈనెల 29న సమావేశం కానున్నది. ఈ పరిణామాలు పశ్చిమ బెంగాల్లో ప్రత్యర్థులైన టీఎంసీ, సీపీఐ-సీపీఎంలను ఒక తాటిపైకి తీసుకువచ్చాయి. తాజా పరిణామాలపై సమావేశం కోరుతూ సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఇండియా కూటమికి, ప్రతిపక్ష నాయకులకు లేఖ రాశారు. అనంతరం ఆయన మమతతో మాట్లాడగా ప్రస్తుత పరిస్థితిపై సమన్వయ చర్య అవసరమని ఆమె అంగీకరించారు.