హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతి అడ్డాగా మారాయని, అక్రమ వసూళ్లు తారస్థాయికి చేరాయని ‘తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒక్కో డాక్యుమెంట్‌కు ఒక్కో రేటు ఫిక్స్చేసి రైటర్లు అడ్డగోలుగా నిలువు దోపిడీ చేస్తున్నారని, దీంతో రియల్టర్లతోపాటు సామాన్య ప్రజలు సైతం నానా ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
సబ్రిజిస్ట్రార్ల పేరు చెప్పి ఒక్కో డాక్యుమెంట్ తయారీకి రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు అదనంగా గుంజుతున్నారని, అంతటితో ఆగకుండా డాక్యుమెంట్లలో లోపాలు ఉన్నాయంటూ రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నారని, ఆ తర్వాత మధ్యవర్తుల ద్వారా బేరసారాలు మొదలుపెట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని వాపోయారు.
డాక్యుమెంట్లలో నిజంగానే లోపాలుంటే రాతపూర్వకంగా ఎందుకు తెలియజేయడం లేదని ప్రశ్నించారు. అక్రమంగా వసూలు చేసిన సొమ్ము జిల్లా రిజిస్ట్రార్లు మొదలుకుని ఉన్నతాధికారుల వరకు వాటాలుగా చేరుతున్నదని, దీనిపై సమగ్రమైన స్వతంత్ర విచారణ జరిపించాలని రిజిస్ట్రార్ ఐజీని డిమాండ్ చేశారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల మధ్యవర్తిత్వానికి వెంటనే అడ్డుకట్ట వేయాలని, ప్రజలు నేరుగా అధికారులను సంప్రదించే వాతావరణం కల్పించాలని కోరారు.
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల పట్టికను ప్రతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని, ప్రతి చెల్లింపునకు తప్పనిసరిగా రసీదు ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. స్తిరాస్థి కొనుగోలుదారులు కేవలం ప్రభు త్వం నిర్ణయించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మాత్రమే చెల్లించాలని, ఎవరికీ లంచాలు ఇవ్వొద్దని ప్రవీణ్ కుమార్ సూచించారు.