మణికొండ, సెప్టెంబర్ 26 : మాస్టర్‌ప్లాన్‌లో రోడ్లు సాధారణంగా జనావాసాలకు దూరంగా ఉంటాయి. లేదా ఉన్న రోడ్లను విస్తరించేలా ప్లాన్ చేస్తారు. కానీ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సామాన్యుల ఇండ్లు, అపార్ట్మెంట్లను లక్ష్యంగా చేసుకొని మాస్టర్‌ప్లాన్ రోడ్లు మార్చుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇదో కొత్త తరహా దందా అని వెస్ట్రన్ మిడోస్ కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నార్సింగి సర్కిల్-45, గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని నార్సింగి గ్రామ సర్వే నంబర్లు 102, 104, 112, 115/పి, 116, 122, 123, 124/పి, 168లోని సుమారు 22 ఎకరాల్లో 2003-04 సంవత్సరంలో పంచాయతీ అనుమతులతో లే అవుట్ వేశారు. చాలామంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు పైసాపైసా కూడబెట్టి, అక్కడ ప్లాట్లను కొనుగోలు చేశారు. ఇండ్లు నిర్మించుకున్నారు. అన్ని రకాల అనుమతులతో ఐదంతస్తుల వరకు అపార్టుమెంట్లు నిర్మాణాలు జరిగాయి. మూడేండ్లలో ఈ లే అవుట్‌కు చుట్టుపక్కల బహుళ అంతస్తుల భవనాల పుట్టుకొచ్చాయి. దీనిని వెస్ట్రన్ మిడోస్కాలనీగా పిలుస్తున్నారు.
ఈ కాలనీ ఎగువన గతంలోనే వంద అడుగుల రహదారులను హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. వాటి ఆధారంగానే అనుమతులు పొంది, ఆ భారీ భవనాలు నిర్మితం అయ్యాయి. అయితే ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం హడావిడిగా ఒక గెజిట్‌ను విడుదల చేసింది. కొత్త మాస్టర్‌ప్లాన్‌ను అమలులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం వెస్ట్రన్ మిడోస్కాలనీలోని 60 అడుగుల ప్రధాన రహదారిని వంద అడుగులకు విస్తరించనున్నది. రోడ్డుకు ఇరువైపులా వెలసిన అపార్ట్మెంట్లు, ఇండ్లను ఇందులో కలిపారు. ఈ మేరకు మార్కింగ్ కూడా చేశారని స్థానికులు చెప్తున్నారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా 9 మీటర్ల విస్తీర్ణంలో ఇండ్లు కోల్పోతామంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిన్నమొన్నటివరకు హెచ్ఎండీఏ అనుమతులు పొంది, ఇండ్లు నిర్మించుకున్నామని, ఇప్పుడు కూల్చివేస్తామని చెప్పడం ఏమిటని మండిపడుతున్నారు. గెజిట్ విడుదల సమయంలో హెచ్ఎండీఏ అధికారులను సంప్రదించగా, ‘సర్వే నంబర్లు మాత్రమే ప్రకటనలో చూపాం, మీ ఇండ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తబోవు’ అని చెప్పారని, తీరా చూస్తే మా ఇండ్లకే ఎసరు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బడాబాబుల ప్రయోజనం కోసమే ఇలా రోడ్డును మార్చి సామాన్యుల ఇండ్ల మధ్యలో నుంచి వెళ్లేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెరవెనుక పెద్ద మాయాజాలమే జరుగుతున్నదని ఆరోపిస్తున్నారు. కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారని మండిపడుతున్నారు. గతంలో ఉన్న మాస్టర్‌ప్లాన్ ప్రకారం రోడ్డును నిర్మిస్తే బడాబాబులకు చెందిన భూములు పోతున్నాయని, అందుకే తమపై పడ్డారంటూ ఆరోపిస్తున్నారు.