సీ॥ కమనీయ కామినీ గానంబు కమనీయ
కామినీగానంబు గలిసి మెఱయఁ
జక్రాంగచక్రనిస్వనములు చక్రాంగ
చక్రనిస్వనములు చక్క బెరయ
బహులహర్యాళికార్భటికలు బహుల
హర్యాళికార్భటిక లైక్యంబు నొంద
సారంగరాజఘోషంబులు సారంగ
రాజఘోషములు మిత్రత్వ మూన
తే. గలితవాహినికాకల కలమునిత్య
కలితవాహినికాకలకలము బెరయ
నప్పురపుఁజెల్మిచే బోలె నమరతటిని
చెంత శుచిజీవనస్థితి జెలగు నెపుడు
జటప్రోలు సంస్థానాధీశ్వరులు సురభి మాధవరాయ ప్రభువు రచించిన చంద్రికా పరిణయం అనే పద్య కావ్యం లోనిది ఈ పద్యం. పిల్ల వసుచరిత్రగా పిలిచే ఈ కావ్యంలోని వర్ణనలు, శ్లేషలు వసుచరిత్ర స్థాయిలో ఉండటం దానికి కారణం. కవి క్రీ.శ 1500-1570 మధ్య వాడని పరిశోధకుల అభిప్రాయం. భట్టుమూర్తికి సమకాలికుడు కావచ్చు. సుచంద్రుడు అనే రాజు పాలించే విశాలాపురి అనే రాజధాని నగరం వర్ణన ఇది. అమరతటి అనే గంగానది ఆ పురంతో ఏ విధంగా చెలిమి చేస్తుందో చెప్పడానికి కవి రెండిటికీ ఒకే పద బంధాలను ఉపయోగించాడు. అంటే ఆ నదితో పురప్రజల సంబంధం విడదీయలేనిదని, అంతేకాక పరస్పర అన్యోన్య ఆశ్రితాలు అని చెప్పకనే చెప్పాడు. మొదటి పాదంలో ‘కమనీయ కామినీ గానంబు’ అని రెండుసార్లు యమకాలంకార ప్రయోగం జరిగింది.
మొదటి దానికి స్త్రీల మనోజ్ఞమైన గానం అని అర్థం కాగా, రెండోదానికి మనోజ్ఞమైన చక్రవాకాల (కామినీ) గానం అని అర్థం. ఇవి నీటిలో ఉంటాయి. ఈ రెండు ధ్వనులూ కలిశాయి. అలాగే రెండో పాదంలో.. ‘చక్రాంగ చక్ర నిస్వనములు’ అని రెండుసార్లు ప్రయోగించాడు. మొదటి పదబంధానికి రథ సమూహాల ధ్వనులు కాగా రెండోదానికి హంసల సమూహ ధ్వనులు అని అర్థం (చక్రాంగము అంటే హంస అనే అర్థం). ఈ రెండు కూడా చక్కగా మెరిశాయి. మూడో పాదం ‘బహుల హర్యాళికార్భటికలు’ అనే పదబంధం రెండుసార్లు. మొదటి దానికి గుర్రాల సమూహం హేశలు అని అర్థం కాగా బహు లహర్య అనగా అధికమైన అలల శబ్దాలు అంటూ రెండిటినీ జతచేశాడు. అలాగే నాల్గో పాదంలో ‘సారంగ రాజ ఘోషంబులు’ అని రెండుసార్లు వచ్చింది. మొదటి దానికి గొప్ప ఏనుగుల ఘీంకారాలు అని అర్థం కాగా రెండోదానికి గండు తుమ్మెదల ఝుంకారాలు అని అర్థం. ఇవి రెండూ స్నేహం చేశాయి.
ఇక తేటగీతిలో మొదటి రెండు పాదాల్లో వరుసగా కలిత వాహిని కాకలకలము అని రెండుసార్లు వచ్చింది. మొదటి దాంట్లో వాహిని అంటే సేనా విశేషం. (ఇది 81 రథాలను, 81 ఏనుగులను, 243 గుర్రాలను, 405 కాల్బలం కలిగి ఉంటుంది). ఈ సేనల కోలాహలమని అర్థం కాగా, రెండోది నిత్యం తరంగాలతో కూడుకున్న ప్రవాహధ్వని. ఈ రెండూ కూడగా ఆ విశాలాపురి ప్రజలు ఆ గంగానదిలోని జలాలు ఇద్దరూ శుభ్రమైన జీవనం (జీవనం అంటే నీరు అనే అర్థం కూడా) కొనసాగిస్తున్నారు. నీటితో మానవుని బాంధవ్యం విడదీయలేనిదని కవి ఉద్దేశం కావచ్చు. అన్ని రకాల ధ్వనులు ఏకమైన ఈ పద్యంలో అసలైన ధ్వని నీరు, మనుషులు పరస్పర అన్యోన్యాశ్రితులు అని. ఈ సందేశం ఆధునిక నాగరిక సమాజానికి ఎంతో అవసరం.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ