బాక్సింగ్ రింగ్‌లో పంచ్ వీరుల విశ్వరూపంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ స్వర్ణోత్సవం చేసుకుంది. ఇది వరకు ఒక ఎడిషన్‌లో మూడు స్వర్ణాలు మాత్రమే బాక్సింగ్‌లో దేశానికి అత్యుత్తమ ప్రదర్శన అయితే ఈసారి ఏకంగా 7 పసిడి పతకాలతో సరికొత్త చరిత్ర సృష్టించింది. గ్లాస్గోకు వచ్చిన 14 మంది మన బాక్సర్లలో పది మంది పతకాలు కొల్లగొట్టగా, అందులో ఏడు బంగారు పతకాలు, 3 రజతాలు ఉండటం విశేషం. పారా అథ్లెట్ సోమన్ రాణా కూడా పసిడి పతకం అందుకోవడంతో మెగా గేమ్స్‌లో ఒకే రోజు 8 పసిడి పతకాలతో పండగ చేసుకున్న భారత్ పట్టికలో టాప్-5లోకి దూసుకొచ్చింది.

Arundhati Choudhary
గ్లాస్గో: భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బాక్సర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకాల పంట పండిచారు. శనివారం మధ్యాహ్నం ప్రీతి పవార్ ఆరంభించిన గోల్డెన్ పంచ్.. రాత్రి అంకుశ్ పంఘల్ తెచ్చిన ఆఖరి బంగారు పతకం వరకూ కొనసాగింది. జైస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియ ఘంగాస్ , అరుంధతి చౌదరి, సచిన్ సివాచ్ కూడా పసిడి పతకాలకు గురిపెట్టగా.. ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గోహైన్, జాదుమణి సింగ్, నరేందర్ బెర్వాల్ రజతాలు తీసుకొచ్చారు. కామన్వెల్త్ చరిత్రలో భారత బాక్సర్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2010, 2018, 2022 ఎడిషన్లలో మూడేసి స్వర్ణాలే ఇప్పటిదాకా రికార్డు కాగా.. గ్లాస్గోలో బాక్సర్లు ఆల్‌టైమ్ రికార్డు సృష్టించారు.
పవర్ఫుల్ పంచ్‌లు
బాక్సింగ్‌లో ప్రీతి పవార్ భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించింది. మహిళల 54 కేజీ ఫైనల్లో 22 ఏండ్ల ప్రీతి 5-0తో కెనడాకు చెందిన స్కార్లెట్ డెల్గాడోను చిత్తు చేసింది. ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించిన ప్రపంచ మూడో ర్యాంకర్ ప్రీతి, ఏకపక్షంగా బౌట్‌ను గెలుచుకుంది. ప్రపంచ చాంపియన్ జైస్మిన్ (57 కేజీ) 5-0 తేడాతో నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన డిఫెండింగ్ చాంప్ మైకేలా వాల్ష్‌ను ఓడించింది. తొలి రౌండ్లో గట్టి పోటీ ఎదురైనప్పటికీ, రెండో రౌండ్ నుంచి జైస్మిన్ పంచ్‌ల దెబ్బకు ప్రత్యర్థి వద్ద సమాధానం లేకుండా పోయింది. సాక్షి (51 కేజీ) కూడా 5-0తో రూబీ వైట్ (ఇంగ్లండ్)పై తిరుగులేని విజయాన్ని సాధించగా.. ఉత్కంఠగా సాగిన 60 కేజీ ఫైనల్లో ప్రియ 4-1తో మేరీ బాతౌల్ (కెనడా)పై పైచేయి సాధించింది. ఇక, 70కేజీ ఫైనల్లో అరుంధతి 5-0తో ఇంగ్లండ్ బాక్సర్ చాంటెల్లె రీడ్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది.

Sachin Siwach
సచిన్ సూపర్
భారత బాక్సర్లు తలపడ్డ ఫైనల్ బౌట్లలో సచిన్ సివాచ్ పోరు హైలైట్‌గా నిలిచింది. ఉత్కంఠగా సాగిన పురుషుల 60 కేజీల ఫైనల్లో సచిన్ 3-2తో నమీబియాకు చెందిన ట్రైఎగైన్ మోర్నింగ్ నడెవెలోపై విజయం సాధించాడు. తొలి రెండు రౌండ్లలో తేలిపోయిన సచిన్ ఆఖరి రౌండ్లో మ్యాజిక్ చేశాడు. తుది మూడు నిమిషాల్లో ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షంతో విరుచుకుపడి స్టాండింగ్ కౌంట్ సాధిస్తూ స్వర్ణాన్ని ముద్దాడాడు. 80 కేజీ ఫైట్‌లో అంకుశ్ 4-1తో షిటు (ఇంగ్లండ్)ను ఓడించాడు. జాదుమణి (55కేజీ)తో పాటు చివర్లో నరేందర్ (+90 కేజీ) ఫైనల్లో ఓడి పతక పంచ్‌లకు ముగింపు పలికాడు.

లవ్లీనాకు షాక్
స్టార్ బాక్సర్, ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గోహైన్‌కు షాక్ తగిలింది. హోరాహోరీగా సాగిన మహిళల 75 కేజీ ఫైనల్ బౌట్లో లవ్లీనా 1-4తో ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్మా సూ చేతిలో ఓడిపోయింది.
ట్రిపుల్ జంప్‌లో డబుల్ ధమాకా
పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో భారత అథ్లెట్లు సంచలన ప్రదర్శన చేశారు. ఆసియా క్రీడల కాంస్య విజేత ప్రవీణ్ చిత్రవేల్ 16.58 మీటర్ల దూరం దూకి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సెల్వ ప్రభు తిరుమారన్ 16.52 మీటర్ల దూరం జంప్ చేసి కాంస్యం దక్కించుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో అతనికిదే తొలి మేజర్ మెడల్. జమైకాకు చెందిన జోర్డాన్ స్కాట్ (16.72 మీటర్లు) స్వర్ణం సాధించాడు.
తేజస్విన్, గుల్వీర్ కొత్త చరిత్ర

మెగా గేమ్స్‌లో భారత అథ్లెట్లు తేజస్విన్ శంకర్, గుల్వీర్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించారు.మోకాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ అసాధారణ పట్టుదలతో పోరాడిన తేజస్విన్ డెకాథ్లాన్ విభాగంలో కాంస్యం నెగ్గి ఈ ఘనత సాధించిన భారత తొలి అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు. రెండు రోజుల పాటు సాగిన అత్యంత కఠినమైన 10 ఈవెంట్ల డెకాథాన్లో తేజస్విన్ మొత్తం 7,976 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. మరోవైపు గుల్వీర్ సింగ్ 5000 మీటర్ల పరుగును 13 నిమిషాల 24.95 సెకండ్లలో
ముగించి కాంస్యం నెగ్గిన భారత తొలి అథ్లెట్‌గా నిలిచాడు. ఈ గేమ్స్‌లో తనకు ఇది రెండో మెడల్. 10 వేల మీటర్ల పరుగులోనూ కంచు పతకం గెలిచాడు.
జూడోలో మరో పతకం
భారత జుడోకాలు అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. మహిళల 63 కేజీల విభాగంలో ఉన్నతి శర్మ కాంస్య పతకాన్ని కొల్లగొట్టింది. కాంస్య పతక పోరులో ఉన్నతి 1 నిమిషం 7 సెకన్లలోనే ఇప్పాన్ (ఉత్తమ స్కోరు) పాయింట్‌తో దక్షిణాఫ్రికాకు చెందిన స్కై నోస్టర్‌ను చిత్తు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. జూడోలో భారత్‌కు ఇది నాలుగో పతకం.పురుషుల 81 కేజీల కాంస్య పతక పోరులో హర్ష్ టోకస్.. ఆస్ట్రేలియాకు చెందిన కీషిన్ ఒచి చేతిలో ఇప్పాన్ ద్వారా ఓటమి పాలై ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
చాంపియన్ సిపాయి
కామన్వెల్త్ పారా షాట్‌పుట్‌లో స్వర్ణం సాధించి, ఈ విభాగంలో దేశానికి తొలి పసిడి అందించిన 43 ఏండ్ల హవిల్దార్ సోమన్ రాణా జీవిత ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. భారత సైన్యంలోని గోర్ఖా రైఫిల్స్‌లో పనిచేస్తూ 2005 జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఐదో స్థానంలో నిలిచిన రాణా.. 2006 డిసెంబర్లో జమ్మూ కశ్మీర్‌లోని ఎల్ఓసీ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడులో ఒక కాలును శాశ్వతంగా కోల్పోయాడు. కాలు పోయినా దేశం కోసం ఏదో ఒకటి సాధించాలనే తపనతో పుణెలోని ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్లో పునరావాసం పొందుతున్న సమయంలో రాణా పారా అథ్లెటిక్స్ వైపు అడుగులు వేశాడు. ఆర్మీ ప్రోత్సాహంతో 2017లో ఆర్మీ పారాలింపిక్ నోడ్‌లో చేరి షాట్‌పుట్‌లో కఠిన శిక్షణ ప్రారంభించాడు. ఒకప్పుడు బాక్సింగ్ రింగ్‌లో విసిరిన పంచ్‌ల శక్తిని ఐరన్ బాల్‌ను దూరంగా విసిరేందుకు ఉపయోగిస్తూ, అంతర్జాతీయ వేదికలపై వరుస విజయాలు సాధించాడు. టోక్యో, పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన రాణా.. 2022 ఆసియా పారా గేమ్స్‌లో రజతం, 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలతో తన సత్తా చాటాడు. దేశ రక్షణలో కాలు కోల్పోయినా, గుండె ధైర్యాన్ని, క్రీడాస్ఫూర్తిని వీడని సోమన్ ఇప్పుడు ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించాడు.
సోమన్‌కు గోల్డ్

పారా షాట్ పుట్లో భారత అథ్లెట్లు సోమన్ రాణా, శుభమ్ జుయాల్ స్వర్ణ, రజతాలో మెరిశారు. పురుషుల ఎఫ్57 విభాగంలో ఆసియా పారా గేమ్స్ రజత విజేత సోమన్ రాణా ఐరన్ గుండును 13.40 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. సీజన్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన సోమన్ కామన్వెల్త్ పారా షాట్‌పుట్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. జుయాల్ (13.28 మీటర్లు) రజతం గెలుచుకోగా, కెమరూన్‌కు చెందిన సెడ్రిక్ అజామ్జీ (12.57 మీటర్లు) కాంస్యం దక్కించుకున్నాడు. దాంతో పారా స్పోర్ట్స్‌ను భారత్ అత్యుత్తమంగా స్వర్ణాలు సహా ఏడు పతకాలతో ముగించింది.
నీరజ్‌కు రజతం.. యశ్వీర్కు కాంస్యం

Neeraj
గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన ఒలింపిక్, వరల్డ్ చాంపియన్ నీరజ్ చోప్రా రజతంతో మెరిశాడు. శుక్రవారం అర్ధరాత్రి తీవ్రమైన చలి, ఈదురుగాలుల మధ్య జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించగా, యువ అథ్లెట్ యశ్వీర్ సింగ్ కాంస్య పతకంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 28 ఏండ్ల నీరజ్ తన రెండో ప్రయత్నంలో 85.83 మీటర్ల దూరం విసిరి సీజన్ ఉత్తమ ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచాడు. ఐదో రౌండ్ వరకు ఏడో స్థానంలో ఉన్న 24 ఏండ్ల యశ్వీర్ తన ఆరో, చివరి ప్రయత్నంలో ఏకంగా 85.41 మీటర్ల దూరం విసిరి కెరీర్ అత్యుత్తమ ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. శ్రీలంక అథ్లెట్ రుమేష్ తారంగ రత్ననాయకే (89.75 మీటర్లు) స్వర్ణం నెగ్గాడు.
టాప్-5లోకి భారత్..నేటితో పోటీలకు ముగింపు
భారత బాక్సర్ల పతక వర్షంతో పోటీలు ముగియడానికి ఒక రోజు ముందు భారత్ టాప్-5లోకి వచ్చింది. శనివారం రాత్రి కడపటి వార్తలందే సమయానికి టీమిండియా 13 స్వర్ణాలు సహా 39 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. అథ్లెటిక్స్‌లో మరికొన్ని పతక ఈవెంట్లతో పాటు ఆఖరి రోజు జూడో, ట్రాక్ ైస్లెకింగ్లో మూడేసి ఈవెంట్లలో భారత్ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.


1ghanghas





Ankush Panghal