జరిగిన కథ: ఆనందుణ్ని తాను ఎందుకు ఆదరిస్తున్నదో ఆహవకు అర్థమయ్యేటట్లు చెబుతుంది కమలసత్తి. రోహా బతికే ఉన్నదన్న విషయం ఆమె తల్లిదండ్రులకు నమ్మకంగా చెబుతాడు పరమేశ్వర శాస్త్రి. సాధనానందుని వెతకడానికి మాధవుణ్ని అనుమతి అడుగుతాడు నిర్మలానందుడు. తర్వాత…
నిర్మలానందుణ్ని వెంటబెట్టుకొని మాధవుడు నాగావళి నది వైపు వెళుతూ, ఆ నదిలో కలుస్తున్న చిన్న సెలయేటి ఒడ్డున నడుస్తున్నాడు. అతని దృష్టి ఆ సెలయేటిలో కొట్టుకొని పోతున్న ఒక పొడుగాటి కట్టె మీద పడింది. “నిర్మలానందా! అటు చూడు!” అంటూ దాన్ని చూయించినాడు మాధవుడు.
ఆచార్యులు చూపిన దృశ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు నిర్మలానంద. “మన శ్రమణకుల జీవితాలు కూడా ఇట్లాగే తయారైనాయి నాయనా!” అన్నాడు మాధవుడు. నిర్మలానందునికి విషయం సరిగ్గా అర్థం కాలేదని గ్రహించి, ఇట్లా వివరించినాడు…
పొడుగు కట్టె చూడు! పోలేక కడదాక
నడుమ నడుమ వాగు వడిని నిలుచు!
అట్లె మనసు గమ్య మందుకొనక ఆగు
నపుడు కాల్తు రెవరొ అందుకొనియు
(అదిగో చూడు వేగంగా వెళుతున్న చిన్న వాగులోని ఆ పొడుగాటి కట్టె నడుమ నడుమ ఆగిపోతున్నది. అది చూసినవాడు ఎవడో దాన్ని పట్టుకొని కాల్చేస్తారు. మన మనసు కూడా గమ్యస్థానం చేరుకోలేక మధ్యమధ్య ఆగిపోతుంటే ఎవరో ఒకరు దాని ఉనికిని కోల్పోయేటట్లు చేస్తారు).
సరైన క్రమశిక్షణ, నియంత్రణ లేక మనసు చిన్న సెలయేటిలో ముందుకు సాగలేని పొడుగాటి కర్రలాగా అవాంతరాల మధ్యన ఇరుక్కొని పోతుంది. అట్లా ఆగిపోతూ, ఆగిపోతూ బలహీన పడిపోయి ఎవరి ప్రభావానికో, ఏ ప్రలోభానికో లొంగిపోయి గమ్యం చేరుకోకుండానే తనను తాను
కోల్పోతుంది” అన్నాడు.
అప్పుడు నిర్మలానందుడు.. “ఆచార్యా! ఇట్లా ఎందుకు జరుగుతున్నది? తథాగతుని ప్రతిపాదనలే సామాన్యులకు అనుసరణీయాలుగా లేకపోవడం కారణమని మనవాళ్లే అనుకుంటూండగా విన్నాను” అంటూ ఆచార్యుల జవాబు కోసం చూసినాడు. మాధవుడొక చిరునవ్వు నవ్వి.. “భరత ధాత్రిలో పుట్టిన ఈ ధర్మం ఇక్కడి కంటే ప్రపంచంలోని ఇతర రాజ్యాల్లో అత్యధిక ప్రచారంలో ఉండటం ఆశ్చర్యకరం!”
“ఎందుకట్లా ఆచార్యా!”
“ఇక్కడ వ్యక్తి స్వేచ్ఛ అధికం. విభిన్న మతాలు, ధర్మాలు వేళ్లూనుకొని పోయి ఉన్నాయి. ఒక విశ్వాసాన్ని, అలవాటును ఎవరూ అంత తేలికగా మార్చుకోవడం సాధ్యమయ్యే పని కాదు. దానికి అనేక రకాల అనుమానాలు, అవరోధాలు ఎదురవుతాయి. అన్నిటికంటే ముఖ్యమైనది మనిషి తేలికగా ఆనందాన్ని సుఖాన్ని కోరుకోవడం. ఇవన్నీ మతం మీద, మనిషి మీద ప్రభావం చూపిస్తాయి. ఈ యుగంలో మరో విశేషం శీలశూన్యత. నియమ బద్ధమైన జీవితాన్ని, నీతిమంతమైన నడవడిని అనుసరించడానికి చాలామంది ఇష్టపడటం లేదు.
మానసిక పరివర్తన కలుగని నాడు ఏ ఆచారమూ, వ్యవస్థా నిలవదు. ఏకేశ్వరోపాసకులు, వివిధ దేవతారాధకులు ఇద్దరూ తమను తాము దేవుని సేవకులుగానే భావిస్తారు కానీ, ఒకరినొకరు విభేదిస్తారు. వైదికులు యజ్ఞయాగాలు చేయాలంటారు. సామాన్యులు బలులు, ఉత్సవాల వైపు మొగ్గు చూపిస్తారు. పాలకులను బట్టి ప్రజలు జీవన మార్గాలను సవరించుకుంటూ ఉంటారు. సంప్రదాయ, సంస్కారాలలో మార్పులు చేసుకుంటారు. అందుకే ‘యథారాజా తథా ప్రజ’ అన్న సామెత లోకవ్యాప్తమైంది.
బుద్ధుని మనసు భోగభాగ్యాలను వ్యతిరేకించింది. రాచరికాన్ని నిరాకరించి, సదాచారం వైపు మొగ్గుచూపింది. అంధవిశ్వాసాన్ని అధిగమించి, నిజమైన ఆనందానికి దారులు తెరిచింది. బుద్ధ ధర్మంలోని రత్న త్రయాన్ని ఎప్పుడూ మరచిపోకూడదు. అదే శీలం – సమాధి – ప్రజ్ఞ! ఉత్తమ గుణాలను అనుసరించడం వల్ల ఈ దేహం పవిత్రమవుతుంది అదే శీలం; యోగ సమాధి వల్ల మనసు పవిత్రమవుతుంది అదే సమాధి; సంయమనం ద్వారా నిజమైన జ్ఞానం లభిస్తుంది
అదే ప్రజ్ఞ. జ్ఞానపూర్ణులై మానవజాతికి ఉత్తమ మార్గాన్ని చూపించే ఆచరణ శీలురు బౌద్ధాచార్యులు. ఆచరించి తన మార్గంలో శిష్యులను నడిచేటట్లు చేయగలవారే కదా ఆచార్యులు. అయితే ‘ధన మూలం ఇదం జగత్!’ అన్నట్లు ఏ పని జరగాలన్న ద్రవ్యం అవసరమవుతుంది. అందుకే రాజుల ఆదరణతోనే మన బౌద్ధం విశ్వవ్యాప్తమైంది. సుమారు 50 దేశాల ప్రజలు బౌద్ధ ధర్మాన్ని అనుసరిస్తున్నారంటే అంతకంటే ఈ ధర్మం గొప్పతనానికి ప్రామాణికత ఏముంటుంది చెప్పు!” అంటూ నిర్మలానందుడు వింటున్నాడా, లేదా? అని గమనించినాడు మాధవుడు. మాధవుడు క్షణకాలం విరామం ఇవ్వడంతో ప్రశ్నించే అవకాశం దొరికింది నిర్మలానందకు.
“రాజులు బౌద్ధ ధర్మ వ్యాప్తికి ఏ రకమైన సహకారం అందించినారు ఆచార్యా?” అన్నాడు ఆసక్తిగా. “మగధరాజు బింబిసారుడు, అజాతశత్రువు బుద్ధుని సంపూర్ణ మనస్కులై అనుసరించినారు ఎంతో ఆర్థిక సహకారం అందించినారు. కోసల రాజు ప్రసేనజిత్తు బౌద్ధ ధర్మ వ్యాప్తికి విశేష కృషి చేసినాడు. బౌద్ధ సంఘానికి ఆరామాలను నిర్మించినాడు. అతని రాణులు బౌద్ధుల కోసం అనేక దానధర్మాలు చేసినారు. శ్రావస్తి వ్యాపారి అనాథపిండకుడు బుద్ధుని యెడల ఎనలేని భక్తి ప్రపత్తులు గలవాడు. ఆయన భక్తి శ్రద్ధలకు గుర్తుగా బౌద్ధులకు జేతవనం దానం చేసినాడు.
బుద్ధుడు తన ధర్మ కార్య నిర్వహణ కోసమే సంఘాన్ని స్థాపించినాడు. ఇది రాజనీతిని అనుసరించిన లోకతంత్రమే. వినయపిటకం ద్వారా బౌద్ధ బిక్షువులు పాటించవలసిన అనేక విషయాలను వివరించినారు. బుద్ధుణ్ని, ధర్మాన్ని, సంఘాన్ని అనుసరించడమే లోక కల్యాణ హేతువు అన్నాడు. అవే బుద్ధం శరణం గచ్ఛామి! ధర్మం శరణం గచ్చామి!! సంఘం శరణం గచ్చామి!!! అనే త్రి సూత్రాలు. బుద్ధుడు క్రీస్తుపూర్వం 215లో నిర్యాణం అయిన తర్వాత బౌద్ధ ధర్మ వ్యాప్తి మరింత ముమ్మరమైంది. ఆయన శిష్యులు ఐదు ముఖ్యమైన సంగీతిలు నిర్వహించినారు”
“సంగీతులు అంటే…” ఆచార్యుని వైపు ఆసక్తిగా చూస్తూ అడిగినాడు నిర్మలానంద. “బౌద్ధ ధర్మంలో సంగీతి అంటే సమ్మేళనం. ఈ మధ్యకాలంలో మనం మునిపల్లెలో నిర్వహించినాము కదా! అటువంటివి. మగధలో మొట్ట మొదటి సంగీతి జరిగింది. రెండవ సంగీతి అశోక చక్రవర్తి జరిపించినాడు. భయంకరమైన కళింగ యుద్ధం తర్వాత అతనిలో పూర్తిగా పరివర్తన కలిగింది. బౌద్ధ ధర్మం మూల సూత్రాలు లోకానికి స్పష్టంగా చెప్పడం కోసమే ఈ సంగీతిని అశోకుడు నిర్వహించినాడు. ఇతర దేశాలలో బౌద్ధ ధర్మ వ్యాప్తికి ఎంతగానో కృషి చేసినాడు. మహాస్థవిర మొగ్గిలి తిస్స అధ్యక్షతన పాటలీపుత్రంలో మూడవ సంగీతి జరిగింది. నాలుగవ సంగీతి కుషాణ వంశ మహారాజు కనిష్కుడు నిర్వహించినాడు. తర్వాత కాశ్మీర దేశంలో ఐదవ సంగీతి జరిగింది”
“ఒక ఉద్యమంలా ప్రపంచమంతటా బౌద్ధ ధర్మం విస్తరిస్తున్నా… ఈ కుట్రలు, కుతంత్రాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, హింస, యుద్ధం ఇంకా జరుగుతూనే ఉన్నాయి కదా ఆచార్యా! ఎందుకు ఇట్లా జరుగుతుంది?” అన్నాడు నిర్మలానందుడు.
“సమస్యలు ఎదురైనప్పుడు, ఆశలు నెరవేరనప్పుడు, నిస్సహాయత ఆవరించినప్పుడు మనిషి పలాయన వాదిగా మారుతాడు. అంటే సమస్యల నుండి పారిపోవాలని చూస్తాడు. స్వార్థం అంతరించని చోట, ఆశలు ఆకాశమంటినచోట బౌద్ధ ధర్మ నిర్వహణ సాగదు. బౌద్ధ ధర్మాన్ని వ్యతిరేకించే వైదిక మతస్తులు పనిగట్టుకొని ఈ ధర్మం పట్ల దుష్ప్రచారం చేయడమే గాక, అటువంటి రాజులపైన కయ్యానికి కాలుదువ్వి అనవసర ప్రాణ నష్టం కలిగిస్తున్నారు.
రాచరికం బౌద్ధానికి ఎంత మేలు చేసిందో అంత నష్టం కూడా కలుగజేసింది. శాంతి మార్గంలో సాగే బౌద్ధ మతానుయాయులైన రాజులు కూడా తప్పనిసరై హింసా మార్గాన్ని తొక్కినారు. దాని వల్ల ‘ఈ ధర్మం ఎవరికి మేలు చేస్తుంది?’ అనే ప్రశ్న ఉదయించి, రాజులు యుద్ధం చేయక తప్పని పరిస్థితిని కల్పించి, అహింసా వాదానికి తూట్లు పొడిచింది. ప్రస్తుతం మన కళింగరాజు కళింగాదిత్యుడు శాంతికాముకుడై ప్రజలను సంతోషంగా పాలించాలనుకున్నాడు కానీ, అతని సమీప బంధువు ఈసాణుడు అది అలుసుగా తీసుకొని రాజ్యంలో అరాచకాలు మొదలుపెట్టినాడు…”
“మరి మిగతా రాజులు కళింగాదిత్యునికి అండగా నిలబడవచ్చు కదా!” ఆలోచిస్తూ అన్నాడు నిర్మలానంద.
“ఇది అంతర్గత విషయం కావడంతో ఎవ్వరూ చొరవ చూపించలేక పోతున్నారు. అదే వానికి అదనపు బలమైంది. అయినా ఇది ఎంతో కాలం సాగదు! ఎవరో ఒకరు ఓ మంచి ముహూర్తాన వాని ఆట కట్టిస్తారు” అన్నాడు. ఆ వెంటనే…
“ప్రణాలుడు… అదే… సాధనానందుని విషయం మొదటి నుండి నాకు అస్పష్టంగానే ఉంది. మీరు మిత్రులు కదా! ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసి ఉంటుంది. అతని ఆలోచనా విధానం గురించి నీకు ఏమనిపిస్తుంది?” అని అడిగినాడు. ఆచార్య మాధవుడు అడిగిన ప్రశ్నకు ఆలోచిస్తూ నిర్మలానంద ఈ విధంగా సమాధానం చెప్పినాడు…
“వ్యక్తిగతంగా సాధనానంద మంచివాడే! అంతకుమించి మీ పట్ల అపారమైన గౌరవాభిమానాలు ఉన్నవాడు. మిమ్ములను ప్రాణదాతగా భావిస్తాడు. జీవితంలో ఎదురైన అనుభవాలు అతనిలో వైరాగ్య భావాలను నింపినాయి. బౌద్ధ ధర్మం పట్ల ఆకర్షితుడిని చేసినాయి కానీ, ఐహిక ఆకర్షణల నుండి పూర్తిగా బయటపడ్డ తర్వాత శ్రమణకుడిగా మన బౌద్ధ సంఘానికి అంకితం కావాలనుకున్నాడు. ఈ పర్యటన తర్వాత అతను పరిణతి చెంది శ్రమణకుడిగా మారతాడని నాకు నమ్మకం కలిగింది. నిజానికి నాకంటే ముందుగానే తన పర్యటన పూర్తిచేసుకుని, శ్రీకూర్మానికి చేరవలసిన వాడు. అతను రాకపోవడానికి గల కారణాలు మీరేమనుకుంటున్నారు ఆచార్యా!”
“అతను రాలేకపోవడానికి రెండే కారణాలు. మొదటిది అతణ్ని ఎవరైనా గాయపరచడం; రెండవది ఏదో బలమైన కారణం చేత మన ధర్మ మార్గాన్ని తప్పడం. మొదటి కారణమే నిజమైతే మరికొన్ని రోజుల్లోనైనా అతడు మనలను కలుస్తాడు. రెండోది నిజమైతే ఇంక ఎప్పటికీ మన దారిలోకి రాడు!” దృఢంగా అన్నాడు మాధవుడు.
“మొదటి కారణమే అతని రాకకు అవాంతరం కలిగించి ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం ఆచార్యా!” నమ్మకంగా అన్నాడు నిర్మలానంద. ఆ వెంటనే..
“నేను వెంటనే బయలుదేరుతాను. అతను జంగిటి నుండి శ్రీకూర్మం చేరే దారిలో తప్పకుండా వస్తుంటాడు. నేను వ్యతిరేక దిశలో వెళ్లి తొందరలోనే అతణ్ని కలుస్తాను” అన్నాడు ఆనందంగా నిర్మలానంద. “నేనూ అదే కోరుకుంటున్నాను నిర్మలానందా! రేపు ఉదయమే బయలుదేరు!”.
ఆచార్యుల అనుమతి లభించడం నిర్మలానందుని ఆనందాన్ని రెట్టింపు చేసింది.
విష్ణుముఖ మహారాజుతో ఆ సాయంత్రం సమావేశమైనాడు మేఘచంద్రుడు. సాధారణ పౌరులకు రాజదర్శనం అంత సులభం కాకపోవచ్చు. మేఘచంద్రుడు సంపన్నుడు మాత్రమే కాదు, సద్గుణ సంపన్నుడు. దానగుణాగ్రేసరుడు; ధర్మవర్తనుడు; ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు రాజుగారికి సముచిత సహకారం అందించే ఉదార హృదయుడు; సహృదయుడు. కుశల ప్రశ్నల తర్వాత విష్ణుముఖు డడిగినాడు…
“మేఘచంద్రా! చాలారోజుల క్రితం మీ అమ్మాయికి ఏదో ప్రమాదం జరిగిందని చెప్పినావు కదా! ఆ విషయంలో సరైన విచారణ జరిపించి సహకరించవలసిందిగా అస్మక మహారాజుల వద్దకు మేము వార్తాహరుని కూడా పంపినాము” అని గుర్తు చేసుకుంటూ.. “ఆ విషయం లో మీకు ఏమైనా సమాచారం దొరికిందా?” అంటూ అడిగినాడు. తన విషయాన్ని మహారాజు గారు అంత బాగా గుర్తు పెట్టుకోవడం సంతోషాన్ని కలిగించింది మేఘచంద్రునికి.
“మహారాజా! మీకు నా పట్ల గల ఆదరాభిమానాలకు ఇంతకంటే రుజువులు అవసరం లేదు. ప్రభూ! ప్రస్తుతం ఆమె విషయమే మాట్లాడటానికి వచ్చినాను..” అంటుంటే అతని కళ్లు చెమ్మగిల్లినాయి.
“ఔనా! మేము ఏదో పని ఒత్తిడిలో ఉండి ఆ సంగతినే విస్మరించినాము. మీరైనా గుర్తు చేయవలసింది. ఇప్పుడు మీ వద్ద ఉన్న సమాచారం ఏమిటి? మేము ఏ విధంగా సాయపడగలమో చెప్పండి. అస్మక మహారాజు సౌరిసంబ వారు ఏదో గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు తెలిసింది…” గుర్తు చేసుకుంటూ అన్నాడు రాజు.
“నా బిడ్డ బతికే ఉన్నదని నమ్మకంగా తెలిసింది ప్రభూ!” అన్నాడు సంతోషంగా మేఘచంద్ర. “ఎంత తీయటి వార్త! అయితే ఎక్కడున్నదో కూడా తెలిసిందా? వెళ్లి కలవలేకపోయినారా? అందుకు మా సహాయమేమైనా అవసరమేమో చెప్పండి. తప్పకుండా చేస్తాం!” అన్నాడు.
“అవును ప్రభూ! ఆమె బతికి ఉన్న మాట నిజం. ఎక్కడ ఉందో మాత్రం తెలవదు. ఇది అస్మకరాజ్యంలో వ్యవహారం కాబట్టి వాళ్ల సహకారంతోనే మనం ఏమైనా చేయగలం…” మేఘచంద్రుని మాట పూర్తికాలేదు.“మరెందుకు ఆలస్యం? ఇప్పుడే బయలుదేరుదాం! నేను స్వయంగా మీ వెంట వస్తాను పదండి!” అన్నాడు విష్ణుముఖుడు. ఆనందంతో నోట మాట రాలేదు మేఘచంద్రునికి. మరుక్షణం వార్తాహరుని పిలిచి, సౌరిసంబ మహారాజును కలవడానికి తాము బయలుదేరిన సమాచారం ఇవ్వుమని పంపినాడు.మరో రెండు ఘడియల్లో ఇరువురూ రెండు ఉత్తమాశ్వాలను అధిరోహించి, అస్మక రాజధాని పోదన వైపు బయలుదేరినారు.
(సశేషం)
– దోరవేటి ,
89788 71961.