శనివారం 23 జనవరి 2021
Suryapet - Nov 25, 2020 , 01:17:05

కాల్చితే కాలుష్యం..కలియ దున్నితే మంచి దిగుబడులు సాధ్యం

కాల్చితే కాలుష్యం..కలియ దున్నితే మంచి దిగుబడులు సాధ్యం

  • వరికొయ్యలను కాల్చితే పర్యావరణంలో పెనుమార్పులు
  • నేలలో కలియ దున్నితే మంచి దిగుబడులు సాధ్యం

గరిడేపల్లి : వరి పంటను సాగు చేసిన రైతులు ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంకావడంతో యంత్రాలను ఉపయోగించి పంటలను కోయిస్తున్నారు. అయితే దానిని కోసిన తర్వాత మిగిలిన వరి కొయ్యలకు నిప్పుపెట్టి పొలంలో చేరిన కీటకాలు, వ్యాధి కారక సూక్ష్మజీవులు నశింపజేయవచ్చుననేది చాలామంది అభిప్రాయం. కానీ వరి కొయ్యలను కాల్చడం వలన పర్యావరణ కాలుష్యం ఏర్పడడమే కాకుండా భూమి సారాన్ని పెంచే సూక్ష్మజీవులు సైతం నశిస్తాయి. అందుకే రైతులు వరిపంట కోసిన తర్వాత వరికొయ్యలకు నిప్పుపెట్టకుండా వాటిని భూమిలోనే కలియదున్నితే భూసారం పెరిగి మంచి దిగుబడులను సాధించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. వరికొయ్యలను కాల్చడం వలన కలిగే నష్టాలు, వాటిని దుక్కిలోనే కలియ దున్నితే కలిగే లాభాలను గురించి తెలుసుకుందాం..

రైతులు వరి కోతలకు యంత్రాలు ఉపయోగిస్తున్నారు. వరి కోత యంత్రాలు మొక్క మొదలు భాగాన కాకుండా 30 సెం.మీలు ఎత్తులో కోయడం వలన 50శాతం గడ్డి కూడా కొయ్యల రూపంలో పంట అవశేషాలుగా మిగిలిపోతాయి. ఈ విధంగా ఎకరాకు రెండు టన్నుల మేర వరి కొయ్యలు, గడ్డి వ్యర్థాలు మిగిలిపోతాయి.

రైతులు వరి పంట వ్యర్థాలను తగులబెట్టడం వలన పర్యావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయి. ఒక టన్ను వ్యర్థాలు మండిస్తే 60కిలోల కార్బన్‌ మోనాక్సైడ్‌తోపాటు 14వందల కిలోల కార్బన్‌డైయాక్సైడ్‌ గాలిలోకి విడుదలవుతుంది. 

ఇదేకాకుండా సూక్ష్మ ధూళి కణాలు, బూడిద గాలిలో కదలడం వలన వాయుకాలుష్యం పెరుగడంతోపాటు భూసారం తగ్గుతుంది. సూక్ష్మజీవుల సంఖ్య కూడా తగ్గుతుంది. 

నేలపొరల్లో తేమశాతం ఆవిరై దిగుబడులపై ప్రభావం చూపుతుంది. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడానికి కారణమవుతున్న పంట వ్యర్థాలను తగులబెట్టడానికి బదులుగా ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలి.

కలియ దున్నడం వలన లాభాలు..

ప్రతి టన్ను వరిగడ్డి పెరుగడానికి భూమి నుంచి 6.2 కిలోల నత్రజని, 1.1కిలోల భాస్వరం, 18.9కిలోల పొటాష్‌, కొద్ది మోతాదులో సూక్ష్మపోషకాలు అవసరమవుతాయి. అందువలన ఈ కొయ్యలను భూమిలో కలియ దున్నడం వలన ఈ పోషకాలన్నీ తిరిగి నేలను చేరుతాయి. లేదంటే ఈ పంట వ్యర్థాలను ముడి పదార్ధాలుగా వాడుకొని కంపోస్ట్‌ పద్ధతి ద్వారా సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవచ్చు

వరి కోసిన వెంటనే మిగిలిన తేమను ఉపయోగించుకోవడం వలన వరికొయ్యలు మట్టిలో కప్పబడి కుళ్లే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇలాచేయడం వలన వర్షపు నీరు నేలలోకి ఇంకిపోయి నేల కోతను అరికడుతుంది. నాట్లు వేయడానికి ముందు దమ్ము చేసేటప్పుడు ఎకరాకు యాభై కిలోల సూపర్‌ ఫాస్పేట్‌ వేయడం వలన కొయ్యలు తొందరగా కుళ్లి సేంద్రియ పదార్థాలుగా మారుతాయి. వరికొయ్యలను నేలల్లో కలియదున్నడం ద్వారా సేంద్రియ కర్బనశాతం పెరుగడమే కాకుండా దిగుబడి సైతం 8-10శాతం పెరిగినట్లు పరిశోధనల ద్వారా తెలుస్తోంది. 

భూ భౌతిక లక్షణాలు మెరుగుపడి వేసిన పోషకాల లభ్యత పెరుగుతుంది. భూమి వేడెక్కడానికి ప్రధాన కారణమైన కార్బన్‌ డైయాక్సైడ్‌ సాంద్రత తగ్గించాలన్నా, నేలలో కార్బన్‌ శాతం పెరుగాలన్నా వ్యవసాయ వ్యర్థాలను తిరిగి నేలకు చేర్చడమే ఉత్తమ పద్ధతి.

కాల్చొద్దు.. కలియ దున్నుకోవాలి

చాలామంది రైతులు వరిపంటను కోసిన తర్వాత ఆ భూమిలో ఉన్న కీటకాలు, హానికర సూక్ష్మజీవులు చనిపోతాయన్న అపోహతో వరికొయ్యలకు నిప్పుపెడుతున్నారు. ఇది పర్యావరణానికి అత్యంత ముప్పు. నిప్పుపెట్టడం వలన నేల పొరలలో కూడా తేమశాతం తగ్గి పంట దిగుబడులపై ప్రభావం చూపుతుంది. అలాగే కార్బన్‌డైయాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి వాయువులు విడుదలై వాతావరణ కాలుష్యం కలుగుతుంది. ఇవి జీవరాశుల ఆరోగ్యంపైనా ప్రభావాన్ని చూపుతాయి. కావున వరికొయ్యలకు నిప్పు పెట్టకుండా భూమిలో కలియ దున్నుకుంటే అందులో ఉన్న పోషకాలన్నీ తిరిగి భూమినే చేరుతాయి. దీంతో దిగుబడులు బాగా పెరుగుతాయి. వరికొయ్యలను భూమిలోనే కలియదున్నాలి. 

- ఎస్‌.నర్సింహారెడ్డి, సీనియర్‌ సైంటిస్ట్‌, 

హెడ్‌, కేవీకే, గడ్డిపల్లి, 9441703198.


logo