e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News Bathukamma festival | బ‌తుక‌మ్మ పండుగ‌ను ఎన‌క‌ట ఎట్ల జ‌రుపుకునేటోళ్లం..

Bathukamma festival | బ‌తుక‌మ్మ పండుగ‌ను ఎన‌క‌ట ఎట్ల జ‌రుపుకునేటోళ్లం..

Bathukamma festival | బతుకమ్మ మన సంస్కృతి. ఇదొక వారసత్వ పండుగ. చరిత్రకు సాక్ష్యమైన పూల జాతర. నేలను ముద్దాడి, గంగను స్పర్శించి, పుట్ట మన్నును పూజించే తెలంగాణ గట్టుపైన.. పూలను కొలిచే అరుదైన సంప్రదాయం .. బతుకమ్మ. ‘బతుకమ్మ సంబురం’లో ఆడబిడ్డ అనురాగం, ఆత్మీయ పలకరింపు కనిపిస్తయి. చీరె.. సారె పెట్టి ఒడిబియ్యం పోసినట్లు తీరొక్క పూలతో అలంకరించగా.. సింగిడి రంగుల్లాంటి ప్రజలను ఒక్కటి చేస్తది బతుకమ్మ. వాడిపోయిన ప్రేమలు బతుకమ్మ వేడుకలో చిగురిస్తయి. బాసిపోయిన బంధాలెన్నో బలపడి నిలబడుతయి. కంచెలను దాటుకొని.. ఏర్లను ఎదుర్కొని ఉరిమే ఉత్సాహంతో ‘ఇచ్చుకుందాం పుచ్చుకుందాం’అని వాయినమియ్యగా.. చీకటి మాటున ఉన్న బతుకులెన్నో నేరుగా వెలుగు వాకిట్లోకి వచ్చి ‘బతుకమ్మా.. బతుకునీయమ్మా’ అని తపిస్తయి! బతుకమ్మ చుట్టూ అల్లుకున్న జనపదుల సంస్కృతి.. సంప్రదాయాలు.. జీవన విధానం గురించి ‘బతుకమ్మ’ ముఖచిత్ర కథనం.

Bathukamma festival | బతుకమ్మ
Bathukamma festival | బతుకమ్మ

బతుకమ్మలో పల్లె వాసుల జీవనశైలి, శ్రామిక రైతుల బతుకుచిత్రం ఇమిడి ఉంటయి. దుక్కి దున్నినప్పుడు నేలను పూజించినట్టు, ఏరు పారినప్పుడు గంగను మొక్కినట్టు, పంట ఇంటికి చేరినప్పుడు మైసమ్మను తలచినట్టు పూలను బతుకమ్మగా పేర్చి పెద్ద పండుగ చేస్తరు. పుడమి పులకింత, ప్రకృతి పరవశం దీనిలో లీనమై ఉంటయి. బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం. వృత్తి, వర్గ, కుల, ప్రాంత, మత, సంప్రదాయ భేదాలకు అతీతంగా ప్రజల్లో సమతాభావాన్ని పెంపొందించే గొప్ప ఉత్సవం ఇది.

Bathukamma festival | బతుకమ్మ
Bathukamma festival | బతుకమ్మ

1995లో.. తెల్లారగట్ల 5 గంటలకు..

- Advertisement -

‘అమ్మా.. అన్నను నిద్రలేపి తంగెడు పువ్వు తీసుకురమ్మనే. ఇంకా ఆల్సెం అయితే పువ్వు దొర్కదు’.. ‘రాజూ.. లే బిడ్డా ఇయ్యాల ఎంగిలిపూల బతుకమ్మరా.. జల్ది లేసి తంగెడుపువ్వు తీస్కరాపో. పువ్వు దొర్కకపోతే చెల్లె ఏడుస్తది’. ‘అరే.. రామూ తంగెడు పువ్వుకు పోతున్న వస్తవా’.. వంటి హడావిడి ప్రతి ఇంట్లో కనిపించేవి. గునుగు, తంగెడు పూలు తెంపుకొచ్చినప్పటి నుంచి వాటిని చక్కగా ఈలపీటతో కత్తిరించి తీరొక్క రంగులద్ది.. తప్కులో పేర్చి కచ్చీరుకాడ బతుకమ్మ బంతులు తిరిగి వాగులో నిమజ్జనం చేసి.. వాయినాలు ఇచ్చుకునేదాక ప్రతీ చెల్లెతో.. ప్రతీ అక్కతో వాళ్ల అన్నదమ్ములు ఉండేవాళ్లు. బతుకమ్మ ఒక ఆడబిడ్డ పండుగే కాదు.. ఆడబిడ్డకు తోడుగా అన్నదమ్ములు.. అమ్మానాన్నలు చేసుకునే పూల పండుగ. అక్కాచెల్లెండ్లు రాఖీ కట్టిన తర్వాత వచ్చే పండుగ బతుకమ్మ. రాఖీ కట్టి అభయం కోరే ప్రతి సోదరికి తోడుగా నిలుస్తూ అన్నదమ్ములు ఆద్యంతం బతుకమ్మతో ఉండి ఆత్మీయ అనుబంధాల మధ్య పండుగ చేసుకునేవాళ్లు.

Bathukamma festival | బతుకమ్మ
Bathukamma festival | బతుకమ్మ

2005లో..

‘బిడ్డా.. ఇయ్యాల సద్దుల బతుకమ్మ. ఆడబిడ్డల పండుగ. ఇప్పటిదాక నిద్రలేవకపోతే ఎట్లా? లేసి తానంజేసి తయారుగా. తమ్ముడు పొయ్యి తంగెడు పువ్వు తెంపుకొస్తడు’. ‘ఏ.. పో అమ్మా.. నాకు ఎగ్జామ్స్‌ ఉన్నయి. సదువుకోవాలె. ఆ పనేందో నువ్వే చూస్కో’.. ‘శీనూ మా అయ్యగానీ జర తంగెడు పువ్వు తెంపుకరాపో’.. ‘ఎప్పుడేందే నీ లొల్లీ.. నాకు కిర్కెట్‌ మ్యాచ్‌ ఉంది.. నాకు తెల్వద్‌’ అనే పరిస్థితికి వచ్చింది. తప్పు మనది కాదు. మన సంస్కృతిని అణచివేయాలని చూసినవాళ్లది. మన పండుగల్ని.. మన ఆచారాల్ని గౌరవించలేదు. మన బతుకుల్ని.. మన బతుకమ్మనూ గుర్తించలేదు. ‘ఈ పువ్వులేంది.. పూజలేంది.. ఆడుడేంది.. దుంకుడేంది?’ అని అడుగడుగునా బతుకమ్మను అవమానించి మన సంస్కృతికి దూరం చేసే కుట్రలు చేసిండ్రు. మనకు తెలియకుండానే బతుకమ్మ లాంటి పండుగలకు కొద్దికొద్దిగా దూరమవుతూ వచ్చినం.

2015లో..

ఎన్నేండ్లు అణచివేస్తరు? ఎంతకాలం అవమానిస్తరు? తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం మొదలైంది. ఈ పదేండ్లలో ‘తెలంగాణ జాగృతి’ సంస్థ బతుకమ్మతో పాటు మన సంస్కృతీ, సంప్రదాయాల గురించి అవగాహన కల్పించింది. బతుకమ్మ బతికింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక మరింత శోభాయమానంగా బతుకమ్మ ఉత్సవాలు మొదలైనయి. బతుకమ్మ మన రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. ఒకప్పుడు భయంభయంగా జరుపుకొన్న బతుకమ్మను ఇప్పుడు ఘనంగా ఒక ఉత్సవంలా నిర్వహించుకుంటున్నం. ఇప్పుడు ప్రతీ ఇంట్లో ‘అమ్మా.. లేవే నేను.. చెల్లె గునుగు.. తంగెడు పువ్వులకు పోతున్నం. మేమొచ్చే సరికి ఇల్లంతా శుభ్రంజేసి నువ్వు తయారుగుండు’ అనే సంబురం కనిపిస్తున్నది. తెలంగాణ సంస్కృతి పూర్వ వైభవం చాటుకుంటున్నది. బతుకమ్మ పదమే నిషేధం అన్నట్టు చూసిన పరిస్థితి నుంచి బడిపుస్తకాల్లో ‘ఒక్కేసి పువ్వేసి సందమామా’ అనే బతుకమ్మ పాఠాలు చేర్చేదాక వచ్చింది.

Bathukamma festival | బతుకమ్మ
Bathukamma festival | బతుకమ్మ

సల్లంగా బతకాలె

తీరొక్క పూలు తెస్తం. తీరు తీరుగ అలంకరిస్తం. పూలగోపురం పేర్చినట్టు పేరుస్తం.బతుకమ్మ అంటేనే ఒకర్ని ఒకరు ఓర్చుకొని. ఒకర్ని ఒకరు అర్థం చేసుకునే పండుగ. ప్రకృతిలో పూసే రకరకాల పూల వలె అందరూ కలిసి మెలిసి బతకాలనే సందేశం బతుకమ్మ పండుగ ఇస్తుంది. ఎవరి జీవితమూ శాశ్వతం కాదు, ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలె అని చెప్పకనే చెప్తుంది బతుకమ్మ. తొమ్మిదిరోజులు పూజలందుకొని ఊరువాడ ఒక్కటికాంగ వీడ్కోలు తీసుకొని బతుకమ్మ ఎలా వెళ్లిపోతుందో, మనిషి కూడా ఉన్నన్ని రోజులు సల్లంగా బతికి.. నలుగురికి ఆదర్శంగా నిలిచిపోవాలి అనే అంతరార్థాన్ని మనకు తెలియజేస్తుంది. పితృ దేవతలను తలుచుకునే పెత్తరమాసను పురస్కరించుకొని బతుకమ్మయి ప్రతి ఇంటికీ నవ్వుల వెన్నెలలు తెస్తుంది. ‘రామరామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాల.. పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తరామాస ఉయ్యాల.. బాలలకు వచ్చిందీ ఉయ్యాలో బతుకమ్మ పండుగా ఉయ్యాల’ అంటూ ఊరూరా సందడిచేయనీకె వస్తుంది.

Bathukamma festival | బతుకమ్మ
Bathukamma festival | బతుకమ్మ

అనుబంధాల కలయిక

తెలంగాణ సాంస్కృతిక ప్రతీకల్లో బతుకమ్మ శిఖర సమానమైనది. ఏదో పది రోజులపాటు వచ్చింది.. పండగ చేసుకున్నం.. తర్వాత మర్చిపోతం అన్నట్టు ఉండదు ఈ పండుగ ప్రభావం. సాంస్కృతిక వేడుకలు జరిగిన ప్రతీసారీ, ప్రతీచోట బతుకమ్మలు ఊరేగుతయి. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ చదివే స్టూడెంట్స్‌ యాన్యువల్‌ డే, కల్చరల్‌ డేస్‌ సందర్భంగా ప్రతీ కాలేజీలో ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా నిలిచేది బతుకమ్మనే. అబ్బాయిలంతా పువ్వులు సేకరించడం బాధ్యతగా తీసుకుంటే, చీరకట్టులో అందంగా ముస్తాబైన అమ్మాయిలు బతుకమ్మలను పేర్చి చూడముచ్చటగా ఆడిపాడుతరు. ‘ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పోడాయె ఉయ్యాల’ అంటూ అన్నలను కీర్తిస్తూ పాటలు పాడుతరు. అన్ననో, తమ్ముడో తమకు తోడుగా ఉంటే బాధలు చెప్పుకొని మనసు బరువు దింపుకోవచ్చనే ఆకాంక్ష బతుకమ్మలో ఉంటుంది. అందుకే బతుకమ్మ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నది. ప్రతీ సంవత్సరం అందరికీ కొత్త అనుబంధాలను కలిగిస్తుంది.

Bathukamma festival | బతుకమ్మ
Bathukamma festival | బతుకమ్మ

వ్యవసాయ సంస్కృతి

బతుకమ్మను తెలంగాణ వ్యవసాయ సంస్కృతి నుంచి ఆవిర్భవించిన అపురూపమైన ఉత్సవంగా చెప్పుకుంటరు. అటు ప్రకృతితో, ఇటు మనిషితో గాఢమైన నిరంతర సంబంధాన్ని ప్రదర్శించే పండుగ ఇది. మట్టి, చెట్టు, పూలు, నీరు ప్రకృతి సంబంధాలను ప్రకటిస్తే.. ఊరు, కుటుంబం, అన్న, చెల్లె, వదిన, అమ్మగారిల్లు, అత్తగారిల్లు మానవ సంబంధాలను అద్భుతంగా పెనవేసుకొని ప్రదర్శించే కళారూపంగా బతుకమ్మను కీర్తిస్తుంటారు. అందుకే దసరాకు పుట్టింటికి రాకపోయినా బతుకమ్మకు వస్తానంటది ఆడబిడ్డ. ఏ పండుగకైనా కొత్త చీర కడుతుందో లేదో తెలియదుగానీ సద్దుల బతుకమ్మనాడు పుట్టింటి పట్టుచీర కట్టి తన చిన్ననాటి స్నేహితురాళ్లను కలుసుకొని మంచీ చెడ్డలు అర్సుకుంటరు. ‘రాగీ బిందెదీస్క రమణీ నీళ్లాకువోతె.. రాములోరు ఎదురాయెనమ్మో ఈ వాడలోన.. వెండీ బిందెదీస్క వెలదీ నీళ్లాకువోతే వెంకటేశుడెదురాయెనమ్మో ఈ వాడలోన’ అంటూ పాటను తమకు అన్వయించుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటరు. వానొస్తే బావులు, చెరువులు నిండుతయి. చేనూ, చెలకా పచ్చగైతయి. అట్లనే బతుకమ్మ వొస్తే పెండ్లయిన ఆడబిడ్డలు చీరె, సారె పొందుతరు. పుట్టింటి మమకారాన్ని, ఆ గడపతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకుంటరు.

Bathukamma festival | బతుకమ్మ

జానపదుల జీవన విధానం

బతుకమ్మ పండుగ ఒక ఉత్సవమే కాదు. జనపదుల ఉద్వేగం కూడా. ఈ పండుగ ఆద్యంతం జానపదుల జీవన విధానం కనిపిస్తుంది. గౌరీదేవిని జానపదులు బతుకమ్మ పండుగలో గౌరమ్మగా కొలుస్తరు. ఈ గౌరమ్మను పసుపుతో తయారుచేస్తరు. పసుపు జనపదుల చైతన్యానికి ప్రతీకగా చెప్పుకుంటరు. ఒగ్గుకథల్లో పసుపు బండారిగా పేర్కొంటరు. బతుకమ్మ పాటలు కూడా జనపదుల సంతోషాల నుంచే వొచ్చినయిగా చెప్తరు. బతుకమ్మ పండుగ నాటికి వ్యవసాయ పనులేవీ పెద్దగా ఉండవు. తీర్వాటుగా ఉంటరు. పంటలు, చెట్లు, పూలతో నేలంతా అలంకరించినట్లు కనిపిస్తది. ఈ దొరికిన సమయంలో బతుకమ్మ, ఇతర జానపద ఆటలు ఆడుతరు. అందుకే ఈ పండుగ బొడ్డెమ్మతో మొదలై బతుకమ్మగా రూపుదిద్దుకుంటుంది. బతుకమ్మ రూపమైన ఆ పూలు సఫలతకు నిదర్శనం. నీరు ప్రాణశక్తికి, పంటకు మూలాధారం. నీటికి సఫలతా శక్తి ఉందని జనపదుల విశ్వాసం. ఇలా మట్టిరూపం నుంచి పూలరూపం పొంది నీళ్లలో కలిసిపోయే తంతు మొత్తం జనపదుల సంస్కృతిలో భాగంగా పేర్కొంటరు. ‘తంగేడు చెట్టుకింద ఆట సిలకాలాల.. పాట సిలకాలాల.. కలికి సిలకాలాల.. కందుమ్మ గడ్డలూ రానువోనడుగులూ.. తీరుద్దరాక్షలు.. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మా ’ అంటూ ప్రతీ వస్తువును పండుగలో భాగస్వామ్యం చేస్తరు.

Bathukamma festival | బతుకమ్మ
Bathukamma festival | బతుకమ్మ

బతుకునిచ్చే దేవత

బోనాలు, బొడ్రాయి పండుగ, సమ్మక్క పండుగ ఇవన్నీ గ్రామ దేవతల శక్తి స్వరూపాల పండుగలు. వ్యాధులు, కరువు, వరదలు, ప్రకృతి ప్రళయాల నుంచి కాపాడమని గ్రామదేవతలను కోరుకుంటం. గ్రామదేవతల శాంతి కోసం జంతు బలులు ఇస్తం. కానీ బతుకమ్మకు అలా చెయ్యం. వ్యాధులు, విలయాల నుంచి కాపాడమని కాకుండా మాకు చల్లటి బతుకునీయమ్మా అని కోరుకుంటం. సద్దులే నైవేద్యంగా సమర్పిస్తం. మంత్రతంత్రాలు లేకుండా పూజిస్తం. స్త్రీ జీవితంలో మాతృత్వానికున్న మౌలిక విలువలను బతుకమ్మ పండుగలో చూస్తరు. అందుకే ఒంటి బతుకమ్మను పేర్చరు. పెద్ద బతుకమ్మ పక్కన చిన్న బతుకమ్మను పెట్టి తల్లీ బిడ్డల అనుబంధానికి చిహ్నంగా బతుకమ్మను అలంకరిస్తరు. నేటితరానికి తెలియని విషయం ఏంటంటే బతుకమ్మ, బొడ్డెమ్మ వేర్వేరు పండుగలు. ఒకరకంగా జంట పండుగలు. బొడ్డెమ్మ పెండ్లికాని పిల్లలకు సంబంధించింది. బొడ్డెమ్మపైనున్న కలశంలో ధాన్యాన్ని పోస్తరు. బొడ్డెమ్మను వాకిట్లో పెట్టి ముగ్గులు వేసి పిల్లలు ‘సింతసెట్టు మీద సిలుకలారో సిలుకలారో సింతపండు తిని పలుకరేమే పలుకరేమే.. అన్న కొప్పు పైన డేగలారో డేగలార వదిన కొప్పుపైన వాలరేమె వాలరేమె’ అని ఆడితే.. బతుకమ్మ చుట్టూ పెద్దవాళ్లు ‘నల్లనల్లయి గుళ్లు ఉయ్యాలో.. నల్లయమ్మా గుళ్లు ఉయ్యాల.. నల్లయి నల్లగొండ ఉయ్యాలో నారసింహ గుళ్లు ఉయ్యాల’ అని ఆడుతరు.

Bathukamma festival | బతుకమ్మ

ఫ్లోరల్‌ టు గ్లోబల్‌

బతుకమ్మ ఇప్పుడు తెలంగాణ సరిహద్దు దాటి ప్రపంచమంతా విస్తరించింది. తెలంగాణ ప్రజలు ఉన్న ప్రతీ దేశంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నయి. విశ్వవ్యాపితమైన బతుకమ్మ ఒక చరిత్ర అయితే హైదరాబాద్‌ నడిబొడ్డున 2016లో గిన్నిస్‌ రికార్డు సాధించి మరో చరిత్ర సృష్టించింది. ఎట్లుండె బతుకమ్మ ఎట్లయింది? ఎన్ని జోస్యాలు? ఎన్ని జోకులు బతుకమ్మపై? తలలో పెట్టుకోవాల్సిన పూలను బతుకమ్మ అని పూజించడమేంటని నవ్వినోళ్లే ఇప్పుడు ఖండాంతరాలు దాటిన బతుకమ్మ ఖ్యాతిని చూసి అవాక్కవుతున్నరు. బతుకమ్మ చుట్టూ నాలుగు అడుగులు బంతి తిరుగమంటే నామోషీగా భావించినోళ్లే ఇప్పుడు ఉత్సవాలు నిర్వహించే స్థాయికి బతుకమ్మ చేరుకున్నది. ఈ మార్పు వెనక తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జాగృతి, భాషా సాంస్కృతిక శాఖ కృషి ఎంతగానో ఉంది. బతుకమ్మ పండగొస్తే ఒకప్పుడు ఊర్లలోనే సంబురాలు చేసుకునేది. ఇప్పుడు ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో అట్టహాసంగా ఆడి పాడుతున్నరు. అంతా కార్పొరేట్‌ కల్చర్‌ కనిపించే గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌లాంటి సంస్థల్లో కూడా ‘బతుకమ్మ సెలబ్రేషన్స్‌’ జరుపుతున్నరు అంటే బతుకమ్మ ఎట్లా నిలిచి గెలిచిందో అర్థం చేసుకోవచ్చు.

Bathukamma festival | బతుకమ్మ

స్త్రీ శక్తి బతుకమ్మ

బతుకమ్మ పండుగ త్యాగాల నేపథ్యం నుంచి పుట్టింది. అందుకే బతుకమ్మ పాటలు చాలావరకు త్యాగానికి సంబంధించినవే ఉంటయి. ప్రాచుర్యంలో ఉన్న ప్రతీ కథలోనూ బతుకమ్మ ఆత్మబలిదానం చేసుకుంటుంది. చెరువు గండి పూడ్చడం, ఊరిని కాపాడటం.. ఇలా ప్రతి కథ నేపథ్యంలోనూ ఆడబిడ్డల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నమే ఉంటుంది. అందుకే బతుకమ్మను మహాలక్ష్మి అవతారంగా చెప్తుంటరు. బతుకమ్మ అంటే స్త్రీ శక్తిగా కొనియాడుతరు. అందుకేనేమో ఎప్పుడూ లేనంత సంతోషంగా, ఎన్నడూ చూడనంత శోభాయమానంగా ఆడబిడ్డల మొఖాలు బతుకమ్మనాడు కనిపిస్తుంటయి. అప్పుడు, ఆ క్షణాన వాళ్ల పాటల్లో స్వచ్ఛమైన హృదయం ప్రతిబింబిస్తది. ఇప్పుడు ప్రారంభమే బతుకమ్మతో చేస్తున్నంగానీ పూర్వం పూజ బొడ్డెమ్మతో పండుగను మొదలుపెట్టేటోళ్లు. పుట్టమన్ను తెచ్చి బొడ్డెమ్మను చేసి పెత్తరమాసనాడు బతుకమ్మ పండుగను మొదలుపెట్టి తొమ్మిదిరోజుల తర్వాత ‘ఘనమైన పొన్నపువ్వే గౌరమ్మా.. గజ్జెలా వడ్డాణమే గౌరమ్మా’ అని ఘనంగా సాగనంపే సంస్కృతి ఈ పండుగకు ఉంది.

మళ్లీ ప్రాణం పోసుకుంది:

Bathukamma festival | బతుకమ్మ మామిడి హరికృష్ణ

సాంస్కృతిక పునరుజ్జీవనం పొందడంలో ముందు నిలిచింది బతుకమ్మ. ధ్వంసమైన మన సంస్కృతి, సంప్రదాయాలకు తిరిగి ప్రాణం పోయడంలో తెలంగాణ ప్రభుత్వం కృషి ఎప్పటికీ మరవలేనిది. మన భాష, మన సంస్కృతిని బతికించుకొని భావితరాలకు అందించాలని సీఎం కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారు. తెలంగాణ జాగృతి సహకారంతో, భాషా-సాంస్కృతిక శాఖ తరపున ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పుడు బతుకమ్మను రాష్ట్ర పండుగగా జరుపుకొంటున్నామంటే బతుకమ్మకు ఉన్న గొప్పదనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ వేదికలల్లో బతుకమ్మ ఒక ఐకాన్‌గా నిలుస్తూ తెలంగాణ చరిత్రను చాటుతున్నది.

– మామిడి హరికృష్ణ, తెలంగాణ భాషా-సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

న‌వ‌రాత్రుల్లో అమ్మ‌వారిని రోజుకో వ‌స్త్రంలో ఎందుకు ద‌ర్శించుకోవాలి?

బ‌తుక‌మ్మ పండుగ అమావాస్య రోజే ఎందుకు మొద‌ల‌వుతుంది?

ఫిబ్రవరి 2 నుంచి రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు : చినజీయ స్వామి

పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొడితే ఏమవుతుంది?

వామనుడిచ్చిన మూడు వరాలు

ఉగ్రం.. శాంతం.. మహాశక్తిమ్‌!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement