రుద్రంపూర్, జూన్ 01 : ఎటువంటి ఆదేశాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) కింద నెలసరి చందా ముందస్తుగా ఉద్యోగుల జీతాల నుండి మినహాయించడం చట్ట విరుద్ధమని, వాటిని వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్(మేవా) కొత్తగూడెం జిల్లా చైర్మన్ సయ్యద్ సయ్యద్ అలీ, కో-ఛైర్మన్ మహ్మద్ ఉస్మాన్ రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం పత్రికా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా, డి డి వో లు మినహాయింపు బిల్లులు సమర్పించకుండా, రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఉద్యోగుల జీతం నుండి ఒకటిన్నర శాతం జీతం చందా కింద మినహాయించడం దుర్మార్గమైన చర్య అన్నారు.
ఈ దుందుడుకు చర్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రతిబింపజేస్తుందని వారు విమర్శించారు. ఉద్యోగులకు ఆరోగ్య సంరక్షణ పథకం అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధి అని, దానిని పాటించకుండా కేవలం కొందరు నేతలు తమ సొంత లాభం కోసం ఇచ్చిన మాటను, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు, పరిణామాలు ఏమిటో తెలుసుకోకుండా తొందరగా పాటుగా వ్యవహరించడం అశాస్త్రీయమని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే మినహాయింపు చేసిన చెందాను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని, లేని పక్షంలో న్యాయ స్థానంలో సవాల్ చేస్తామని వారు హెచ్చరించారు.