e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home చింతన వామనుడిచ్చిన మూడు వరాలు

వామనుడిచ్చిన మూడు వరాలు

ఈ నెల 17న వామన జయంతి

అడుగుతున్న వాడి అవసరాన్ని తీరుస్తూ వరాలను ఇచ్చేవాడు దేవుడు. అడిగినా, అడగకపోయినా అర్హతను బట్టి కరుణను కురిపించే వాడు దేవుడు. వరాలు, కరుణ పొందేవారు ఇద్దరు. ఇచ్చేవాడు ఒక్కడు. ఆతడు దేవుడు. కలిపి ముగ్గురు..

- Advertisement -

మనిషికి ఆశ ఉండాలి. దురాశ ఉండకూడదు. దురాశ దుర్దశకు దారి తీస్తుంది. పరుల సంపదను దొంగిలించి అనుభవించటమే దురాశ. ఆ పని చేసినవాడు బలి చక్రవర్తి! తన దురాశకు కడగా తానే బలియైన వాడు. అన్ని అహంకారాలలో దానవాహంకారం గర్హనీయమైనది. అది బలి నైజం!ధర్మగ్లాని సంభవించినపుడు దిగివచ్చేది అవతారం. అది అవతరణ. అది దైవగతం. ఒదుగుతూ ఎదగడం ఆరోహణ. అది మానవగతం.శిష్యుడి ఎదుగుదలను ప్రోత్సహించేవాడు గురువు. ఆత్మోన్నతికి అడ్డుపడుతున్నపుడు గురువునైనా ధిక్కరించమంటుంది శాస్త్రం. ఈ నేపథ్యంలో దైవం విష్ణువు, వామన రూపంలో. గురువు శుక్రాచార్యుడు. శిష్యుడు.. దానాహంకారం, దానవాహంకారం కలబోసుకున్న బలి చక్రవర్తి. పరుల సొత్తును పరిగ్రహించిన కుహనా చక్రవర్తి. దొంగిలింపబడిన అమరేంద్ర వైభవాన్ని, పదవిని సాధించి తిరిగి దేవతలకు చెందించటం విష్ణువు మొదటి పని. ఎంతటి దానాహంకారాన్నయినా అణచి, ఆశాపాశం నుంచి తప్పించి బలిని రక్షించటం రెండవ పని. దైవశక్తి అనంతం, అవ్యయం, అచ్యుతం అని లోకాలకు ప్రదర్శన పూర్వకంగా నిదర్శనమయం చేయటం మూడవ పని. ముగ్గురు వ్యక్తులు, మూడు కర్తవ్యాలు వీటి నడుమ మూడడుగుల నేలను పొందటం, ఇదీ వామనావతారం పొడ చూపిన ధార్మిక, నైతిక, దైవిక విధానం!

నిజానికి వామనుడు అడిగినది ఒకటి రెండడుగుల నేల మాత్రమే. కానీ ఒకటి, రెండూ కలిపి అది మూడు అయింది. ఒక అడుగు ఆక్రమించుకున్నది భూలోకం. రెండవ అడుగు పరిక్రమించుకున్నది భువర్లోకం, అంటే భూలోకం, పైన ఆకాశం, దానిని దాటి గ్రహతారకలతో నిండిన ఖగోళం. ఇక మూడవది పాతాళం. నాగులు యోగులై సంచరించే నిశ్శబ్ద లోకం. అది బలి పాలిట అనుగ్రహ లోకం.ఇది పురాణగత విశేషం. ఆధ్యాత్మిక స్థాయిలో భూలోకం ఆశామయం. భువర్లోకం.. ఎదగవలసిన ఎత్తు; అది ఆశయసిద్ధ భూమిక. పాతాళం.. అంతర్ముఖత్వ సాధనాలోకం. ఈ మూడింటినీ సమన్వయం చేసుకుని అర్థవంతంగా, పరోపకారకంగా జీవించటమే జీవితపరమార్థం.

వామనావతార కథాకథనాన్ని దాటి, లోతులను అర్థం చేసుకోగలిగితే, ఎన్నో జీవన న్యాయ సూత్రాలతో, ధర్మనిరతితో, ధర్మ పరిరక్షణలతో మనిషి జీవితాన్ని సఫలం చేసుకోవచ్చు. తేజోమూర్తిగా, వటువుగా, వామన రూపంలో వచ్చిన మహా విష్ణువు, అర్థి! ఎవరు దేనిని అడిగినా, అడిగినదానికి పదింతలు ఇచ్చే దాన కుతుక సాంద్రుడు, బలి!కుల, వంశ, సంపదలను బలి చక్రవర్తికి ఉన్న బలంగా భావించి, బలిని కేవలం భౌతిక అవస్థలో నిలిపే ప్రయత్నం చేస్తున్నవాడు శుక్రాచార్యుడు! కనుకనే “వచ్చినవాడు విష్ణువు! అన్నీ ఇవ్వగలిగిన వాడే నిన్ను దానం అడుగుతున్నాడు. వంశ నాశనం, సంపదహరణం ఈ దానంతో జరిగిపోతయ్‌. కనుక దానం ఇవ్వకు” అని శుక్రాచార్యుడు బోధించాడు. అందుకు, “ఏదైనా ఇవ్వగలిగిన విష్ణువే నా ముందు నిలబడి, చేయి చాపి దానం కోరుతుంటే, నేను ఇవ్వకపోతే నా దాన గుణానికి కళంకం రాదా? పైగా నాకంటే ముందు ఎందరో రాజులు వచ్చారు, వెళ్ళారు. ఈ సంపదలు శాశ్వతం కాదు” అని వైరాగ్య స్పర్శను అనుభవిస్తున్నది, ఆ క్షణాన బలి చక్రవర్తి! దీనినంతా వీక్షిస్తున్న, పర్యవేక్షిస్తున్న, ధర్మ సంరక్షణా దీక్షాదక్షుడు హరి! ఎంతటి మనోహర దృశ్యం! గురువును ధిక్కరించి, గుర్వాజ్ఞను ఉల్లంఘించి, దానవ్రతం పూర్ణం చేసుకుని, అడిగిన రెండడుగుల నేలను ఇచ్చి, మూడవ లోకం తెలియక తికమక పడుతున్న బలి ఆ క్షణాన అహంకారం నశించిన నిస్సహాయుడు. కానీ భగవంతుడు కరుణామూర్తి. కనుకనే బలితలపై ఉన్న బ్రహ్మరంధ్రంపై, తన అరికాలిన ఉన్న అగస్త్య అనుగ్రహ రేఖలను తాకించి పాతాళంలోకి నడిపించాడు. అది తపోలోకం. యోగభూమిక. ఇంద్ర పదవి, ఆపై బ్రహ్మపదం లభించే వరకు అక్కడే ఉండమని, బలికి తోడుగా ఆతడి తాత ప్రహ్లాదుడు ఉంటాడని, తానే స్వయంగా తేజోమయంగా పరిభ్రమిస్తూ, సమయం వచ్చే వరకు కాచుకొని ఉంటానని కరుణ కురిపించి, తన గుణాతీత స్థితిని లోకానికి తెలియపరిచినది, హరి. శిష్యుడిని సన్మార్గంలో నడిపించాల్సిన గురువు కర్తవ్యాన్ని విస్మరించినపుడు ఆతడి అజ్ఞాన దృష్టిని పొడిచి, జ్ఞాన దృష్టిని నిలిపి శుక్రాచార్యుణ్నీ అనుగ్రహించాడు, అడగకుండానే! కథ వామనం! మూర్తి వామనం! సందర్భం వామనం! కానీ, విచారణ చేస్తే.. ఎవరైనా, దేనినైనా తన కోసం ఎవరి ముందైనా చేయి చాపితే ఎంతటివాడైనా వామనుడు అవుతాడు.అదే పరుల కోసం అర్థిస్తే, వామనుడు సైతం త్రివిక్రముడు అవుతాడు.అతి విచిత్ర సందర్భం ఇది. అన్నీ ఇవ్వగలిగిన వాడు అర్థి కావటం, దేనినైనా దానం చేసి, అహంకారాన్ని తృప్తి పరుచుకోగలిగిన వాడు, ఇవ్వలేని నిస్సహాయుడు కావడం ఈ కథలో దాగిన వైచిత్రి!కాల, కార్య, కారణ, కర్తవ్య నిబద్ధులు జీవి అయినా, దైవమైనా!! హరి కోరిన కోర్కెలలో మొదటి అడుగు ఏమంటే అనిత్యమైన లోక సంపదపై ఆశలను తుంచుకోవటం.రెండవ అడుగు నిరంతరమూ ఎరుగుతూ, ఎదుగుతూ అందుకోవలసినది అందుకోవటం. మూడవది మనిషి అంతర్ముఖుడై, నిత్య, సత్య, శాశ్వతమైన యోగభూమికలో నిలకడ చెందటం. ఇదే వామనావతార పరమార్థం.

“ఏదైనా ఇవ్వగలిగిన విష్ణువే నా ముందు నిలబడి, చేయి చాపి దానం కోరుతుంటే, నేను ఇవ్వకపోతే నా దాన గుణానికి కళంకం రాదా? పైగా నాకంటే ముందు ఎందరో రాజులు వచ్చారు, వెళ్ళారు. ఈ సంపదలు శాశ్వతం కాదు” అని వైరాగ్య స్పర్శను అనుభవిస్తున్నది, ఆ క్షణాన బలి చక్రవర్తి! దీనినంతా వీక్షిస్తున్న, పర్యవేక్షిస్తున్న, ధర్మ సంరక్షణా దీక్షాదక్షుడు హరి! ఎంతటి మనోహర దృశ్యం!గురువును ధిక్కరించి, గుర్వాజ్ఞను ఉల్లంఘించి, దానవ్రతం పూర్ణం చేసుకుని, అడిగిన రెండడుగుల నేలను ఇచ్చి, మూడవ లోకం తెలియక తికమక పడుతున్న బలిఆ క్షణాన అహంకారం నశించిన నిస్సహాయుడు. కానీ భగవంతుడు కరుణామూర్తి. కనుకనే బలితలపై ఉన్న బ్రహ్మరంధ్రంపై, తన అరికాలిన ఉన్న అగస్త్య అనుగ్రహ రేఖలను తాకించి పాతాళంలోకి నడిపించాడు.

వి.యస్‌.ఆర్‌.మూర్తి
ఆధ్మాత్మిక శాస్త్రవేత్త
moortyvsr@yahoo.co.in

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana