నమస్తే మేడమ్! నాది బాల్య వివాహం. 12 ఏండ్లకే పెండ్లి చేశారు. 14 ఏండ్ల వయసులో కూతురు పుట్టింది. ప్రస్తుతం నాకు 45 సంవత్సరాలు. అయితే, కొన్ని రోజులుగా కలయిక తర్వాత యోని నుంచి రక్తస్రావం అవుతున్నది. నా బిడ్డ నర్స్. తనకు చెబితే.. వాళ్ల డాక్టర్‌తో మాట్లాడింది. ఇలాంటి సమస్య.. క్యాన్సర్‌కు దారితీస్తుందని డాక్టర్ చెప్పిందట. అప్పటి నుంచి భయం పట్టుకుంది. ఆ డాక్టర్ చెప్పింది నిజమేనా?
– ఓ పాఠకురాలు.
45 సంవత్సరాలు దాటిన వాళ్లలో కలయిక తరువాత యోని నుంచి రక్తస్రావం కావడం అరుదు. ఇలా జరగడం.. క్యాన్సర్‌తోపాటు, ఇతర తీవ్ర వ్యాధులకు సంకేతం. మీరు చెప్పిన విషయాలను బట్టి చూస్తే.. మీ సమస్య ‘సర్వైకల్ డిస్ప్లేసియా’గా అనిపిస్తున్నది. ఇది గర్భాశయ ముఖద్వారాన్ని కప్పి ఉంచే ఎపిథీలియల్ కణాలలో క్యాన్సర్‌కు ముందు వచ్చే మార్పులను సూచించే స్థితి. ఈ సమస్య ఎక్కువగా బాల్య వివాహాలు చేసుకున్నవారు, 13 ఏండ్ల వయసు నుంచే శృంగారంలో పాల్గొన్న వారిలో కనిపిస్తుంది. 14 – 15 ఏండ్లకే బిడ్డను కనాల్సి రావడం కూడా ఒక కారణమే. మరీ ముఖ్యంగా బాల్యంలోనే వ్యభిచార కూపంలోకి దిగినవారు, ఎక్కువమందితో శృంగారంలో పాల్గొనేవారు కూడా ఈ స్థితికి గురవుతారు. సుఖరోగాలకు చికిత్స తీసుకోకపోయినా.. ఈ సమస్య వస్తుంది.
అయితే, కొందరు.. కలిస్తేనే రక్తస్రావం అవుతుంది కాబట్టి, కలవకుండా ఉంటారు. డాక్టరుకు చూపించుకోవడానికి కూడా ఇష్టపడరు. దీంతో చాలామంది వ్యాధిని ముదర గొట్టుకుంటున్నారు. లోపల సమస్య ఉంది కాబట్టే.. కలయిక తర్వాత రక్తస్రావం అవుతుంది. వ్యాధి ఎప్పట్నుంచో ఉండి, కొన్ని దశలు దాటిన తర్వాత కనిపించే ప్రమాదకర లక్షణం అది. దీనికి చికిత్సగా గర్భాశయ ముఖద్వారపు ద్రవాలను పాప్ స్మియర్, బయాప్సీల ద్వారా పరీక్షిస్తారు. ప్రీ క్యాన్సర్ కణాలున్నంత మేరా కోనైజేషన్ అనే ఆపరేషన్ ద్వారా, క్రయో సర్జరీ ద్వారా ఈ కణజాలాన్ని నిర్మూలించవచ్చు. కాబట్టి, వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించడం మంచిది. మరికొందరిలో ఫైబ్రాయిడ్ ట్యూమర్స్ వల్ల కూడా కలయిక తర్వాత రక్తస్రావం కనిపిస్తుంది. గర్భాశయంలో వచ్చే ప్రమాదరహిత కణుతులు, క్యాన్సర్‌గా మారే అవకాశం తక్కువ. మెనోపాజ్‌కు చేరిన చాలామంది స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఈ కణుతులు గర్భాశయ గోడల్లోకి ముడుచుకుపోయి అదృశ్యమవుతాయి. కలయిక తర్వాత రక్తస్రావం గమనిస్తే.. గైనకాలజిస్టును సంప్రదించాలి.
డా. భారతి (ఎమ్మెస్), మారిటల్ కౌన్సిలర్, సైకోథెరపిస్ట్,
జయా హాస్పిటల్, బీ.ఎన్. రెడ్డి నగర్ క్రాస్‌రోడ్, హైదరాబాద్
bharathid506@gmail.com, 7989227504
నా భర్తతో కలయిక అంటేనే చెమటలు పట్టి స్పృహ తప్పినంత పని అవుతున్నది”