మేడమ్! నాకు 18 ఏండ్లు. నాలుగేండ్ల కిందే.. ఒక 30 ఏండ్ల వ్యక్తికిచ్చి పెండ్లి చేశారు. అప్పుడు నేను తొమ్మిదో తరగతి. ఇంకా చదువుకుంటాననీ, పెండ్లి వద్దని ఎంత ఏడ్చినా.. నా మాట ఎవరూ వినలేదు. నా భర్త శాడిస్టు. రోజూ తాగివచ్చి ఘోరంగా కొట్టేవాడు. రాత్రి పూట శృంగారం పేరుతో క్రూరంగా హింసించేవాడు. భరించలేక పుట్టింటికి వస్తే.. మా వాళ్లు బుజ్జగించి పంపేవారు. ఒకరోజు తీవ్రంగా కొట్టడంతో పారిపోయి మా మేనత్త ఇంటికి వెళ్లాను. ఒంటినిండా గాయాలు, పంటిగాట్లు చూసి.. మా అత్త చాలా ఏడ్చింది. పంచాయతీ పెట్టి, విడాకులు ఇప్పించింది. ఇది జరిగి మూడేండ్లు అవుతున్నా.. ఆ షాక్ నుంచి నేనింకా కోలుకోలేదు. రాత్రిళ్లు ఉలిక్కిపడి లేస్తాను. వాడు గుర్తొచ్చి భయంతో నిద్రలోనే మూత్ర విసర్జన అయిపోతుంది. డాక్టర్ నిద్ర మాత్రలు ఇచ్చారు. అయితే, ఇప్పుడు మా ఇంట్లోవాళ్లు నన్ను భారంగా చూస్తున్నారు. అక్క అయితే నన్ను చూస్తేనే ఈసడించుకుంటుంది. అన్న, నాన్న కూడా కొడతారు. అత్తింట్లో హింస కంటే పుట్టింటి హింస ఎక్కువైంది. నాకు చచ్చిపోవాలని ఉంది. నేనేం చెయ్యాలి మేడం?
చిన్న వయసులోనే ఎంతో హింసను అనుభవించావు. పుట్టుకనుంచీ ఆడపిల్ల భారమనే భావజాలం.. తల్లిదండ్రులను కూడా అమానవీయంగా మార్చేస్తున్నది. భర్త, పెండ్లి అనే సామాజిక లైసెన్సు ఉన్నందున.. ‘ఇక ఉండలేనమ్మా’ అని పుట్టింటికి పారిపోయి వచ్చే ఆడపిల్లల్ని మళ్లీ ఆ కూపం లోకే తోసేస్తున్నారు. భారత వైవాహిక వ్యవస్థలోని అత్యంత అమానవీయమైన కోణం ఇది. నీది బాల్య వివాహం. చట్టరీత్యా నేరం. అదీగాక హింస భరించలేక పారిపోయి వచ్చిన నిన్ను మళ్లీ ఆ నరకంలోనే తోసేయడం మరొక ఘోరమైన నేరం. భర్తను వదిలిపెట్టి ఇంట్లో కూర్చున్న బిడ్డను భారంగా చూస్తూ.. నిన్ను మానసికంగా, శారీరకంగా హింసించడం ఇంకా పెద్ద నేరం. అయినా సరే, నువ్వు ధైర్యంగా ఉండాలి. నీకు నువ్వే ఊపిరి పోసుకోవాలి. స్థానికంగా ఉన్న మహిళా సంఘానికి, పోలీస్ స్టేషన్లోనూ అత్తింటి హింసల పైనే కాదు, పుట్టింట్లో వారి హింసల మీదా ఫిర్యాదు చేయి. లేకుంటే ప్రగతిశీల మహిళా సంఘాలనైనా ఆశ్రయించు. వారు నీ పుట్టింటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటుగా నీకు విద్యాపరంగా, ఆర్థిక, సామాజిక పరంగా అభివృద్ధి చెందడానికి సరైన దారులు వేస్తారు. నీలో ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్నీ పెంచుతారు. చావాల్సింది నువ్వు కాదు, నిన్నీ స్థితిలోకి నెట్టిన పుచ్చిపోయిన పితృస్వామ్య భావజాలం. బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకో.
ఈ మధ్యే నాకు పెళ్లయింది.. రాత్రి అయ్యిందంటే చాలు భయమేస్తోంది.. మా ఆయనతో ఎలా?”