నా వయసు ఇరవై నాలుగు. రెండేండ్ల కింద వివాహమైంది. భర్తతో శృంగారం అంటేనే భయమేస్తున్నది. చెమటలు పట్టి స్పృహ తప్పినంత పని అవుతున్నది. పెండ్లయిన కొత్తలో భయంతో వాంతులు, విరేచనాలు కూడా అయ్యేవి. ఇప్పటికీ దాదాపు అదే పరిస్థితి. దీంతో నా భర్త నన్ను ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నాడు. ఇప్పటివరకూ మా మధ్య కలయిక జరగలేదు. అత్తామామలు విడాకుల ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఎంతో గొప్పగా ఊహించుకున్న నా వైవాహిక జీవితం.. ఇలా ఎందుకు మారింది. దీనికి పరిష్కారం ఏమిటి?
– వీహెచ్, మెదక్
నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి ‘సెక్సువల్ అవర్షన్’. అంటే.. శృంగారంపై తీవ్రస్థాయిలో విముఖత ఉండటం. ఇలాంటి వారిలో శృంగారం పట్ల భయాందోళనలతో కూడిన ప్రతికూలత ఉంటుంది. ఈ పరిస్థితి పెండ్లికి ముందు, తర్వాతా కలగవచ్చు. ఎక్కువగా స్త్రీలలో.. అదీ 40 ఏండ్లలోపు వారిలోనే ఉంటుంది. బాల్యం నుంచీ శృంగారం, లైంగిక అవయవాలు, వాటి పనితీరు గురించి ప్రతికూల భావనలు ఉండటం ఇందుకు కారణం. యవ్వనంలో శరీరంలో ఏవైనా లోపాలుంటే జీవిత భాగస్వామిని ఆకర్షించలేమనో.. అనాదరణకు గురవుతామేమోనన్న ముందస్తు భయాలు కూడా ఈ రకమైన ఆలోచనలను పెంచుతాయి. అలాగే, బాల్యంలోనే అత్యాచారాలకు బలికావడం, పెళ్లి తర్వాత భర్త లైంగిక దాడిని ఎదుర్కోవడం.. ఇలాంటివన్నీ శృంగారం పట్ల భయాందోళనలు కలగడానికి కారణం. ఇలాంటి వారు శృంగారంలో అయిష్టంగా పాల్గొంటారు. చిన్న చిన్న స్పర్శలు – ముద్దులకు కూడా తీవ్రంగా భయపడతారు. చాలామందికి భర్త ముట్టుకోగానే.. భయం, గుండె దడ, చెమటలు పట్టడం, వికారం కలుగుతాయి. వీరిలో ఆందోళన, భయం తగ్గే వరకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మానసిక చికిత్స తప్పకపోవచ్చు. ఇక శృంగారం అంటేనే స్పృహ తప్పేంత భయం ఉంటే.. ట్రైసైక్లిక్ మందులు ఒక రెండు వారాలు మాత్రమే వాడి.. తర్వాత మానసిక చికిత్స సెక్స్ థెరపీకి వెళ్లాలి. ఆందోళన, భయాన్ని కలిగించని శృంగార చర్యల కోసం దంపతులిద్దరూ చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా శృంగారం పట్ల విముఖతను తగ్గించవచ్చు. సైకోథెరపీలో డీపర్ రిలాక్సేషన్ టెక్నిక్స్, బీఎంటీల ద్వారా భయాందోళనలు తగ్గించి, శృంగారంపట్ల పాజిటివ్ ధోరణిని పెంపొందించవచ్చు. అర్థంలేని భయాలతో ఆలూమగలు శృంగార జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. అవసరమైతే నిపుణుల సహకారం తీసుకోవాలి.
డా. భారతి (ఎమ్మెస్), మారిటల్ కౌన్సిలర్, సైకోథెరపిస్ట్,
జయా హాస్పిటల్, బీ.ఎన్. రెడ్డి నగర్ క్రాస్‌రోడ్, హైదరాబాద్
bharathid506@gmail.com, 7989227504
“అప్పట్నుంచి అత్తింట్లో కంటే పుట్టింటి హింస ఎక్కువైంది.. చచ్చిపోవాలని ఉంది”