Ramaayanam | పుస్తకాలనూ, మనుషులనూ, పరిసరాలనూ, జీవితాలనూ.. అన్నిటినీ, అందరినీ.. చదవడం మాకు నేర్పింది అమ్మే. అందుకే.. ఆమే మా తొలి గురువు. ఎవరి అమ్మ వాళ్లకు గొప్ప. అలాగే మా అమ్మలా ఏ తల్లీ ఉండదేమో అన్నంత గొప్ప.. మాకు మా అమ్మ!
చిన్నప్పుడు మాకు ఆటల్లో (నే అనుకోండి) ఎవరితోనైనా చిన్నపాటి గొడవొస్తే.. వెంటనే కాకపోయినా, తరువాతైన అమ్మ దగ్గరికి పరిగెత్తి వెళ్లి చెప్పేవాళ్లం. ఫలానా శ్యామల ఇట్లా అన్నదని చెబితే.. అమ్మ ఎందుకనో వెంటనే స్పందించేది కాదు. పనంతా అయ్యాక.. “ఆఁ! ఇప్పుడు చెప్పు.. ఏమైంది?” అని అడిగేది. అప్పటికి మా కోపమో, బాధో సగం చల్లబడేది. మేం మళ్లీ.. ‘శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా!’ అన్నట్టుగా.. శ్యామల అన్న మాటలు చెప్పేవాళ్లం. అప్పుడు అమ్మ.. ప్రాసిక్యూషన్ లాయర్ లా..
“అసలు ఎక్కడ మొదలైందో చెప్పు! నువ్వు ఏమనకుండనే శ్యామల గట్లెందుకంటది? ముందు లొల్లి ఎట్ల పుట్టిందో చెప్పు!” అనడిగేది. మేం మొత్తం చెప్పాక.. మా తప్పయితే.. “గదే మరి, గట్ల చెప్పు! నువ్వన్న మాట మొదలే చెప్పవేంది? నువ్వు అట్ల అంటె.. గా పిల్ల గిట్లన్నది. నువ్వు అట్ల మాట్లాడుడు తప్పు గాదా! రేపు బడికి పోయినంక శ్యామలతోని చెప్పు.. ‘నాదే తప్పయింది’ అని సరేనా?” అనేది.
ఒకవేళ అవతలి వాళ్లది తప్పయితే.. “సరేలే! నీదేం తప్పు లేదు. ఆ పిల్లకు అట్ల ఎందుకు అనిపించిందో! ఎందుకు అన్నదో! ఇగ ఆ సంగతి ఒదిలిపెట్టు. అట్లని మాటలు గిన బంజేసేవు.. అదింకా తప్పు!” అని చెప్పేది. మాకు శత్రువులే లేరు. ఎవరినైనా కలుపుకొని పోవడమే తప్ప.. గొడవ పెట్టుకోవడం, మాటలు మానేయడం మాకు తెలియదంటే.. అది అమ్మ పెంపకంలోని గొప్పదనమే!
అమ్మ మాకు రకరకాల కథలు చెప్పేది. జంతువుల కథలు, రాజుల కథలు, దేశభక్తి కథలు, నీతి కథలు.. ఇలా ఎన్ని చెప్పినా, అందులో మాకు ఉపయోగపడే ఏదో ఒక విషయం తప్పకుండా ఉండేది. అలా లేని మూసకథలు అసలు చెప్పేదే కాదు. మా పిల్లలను కూడా కథలు చెప్పింది అమ్మ. సహజంగా అమ్మకు హాస్యం ఇష్టం. అక్బర్ బీర్బల్, తెనాలి రామకృష్ణ, మౌల్వీ నసీరుద్దీన్ కథలు బాగా చెప్పేది. ప్రతి మామూలు సందర్భంలోంచి ఎంతో కొంత హాస్యం వెతుకుతుంది. ఏ విషయమైనా ఆమె చెప్పే విధానంలోనే నవ్వు వస్తుంది. ఒకసారి మా ఇంటికి బాగా రాత్రయ్యాక బంధువులొచ్చారు. అన్నం అయితే వండుతారు గానీ.. పల్లెటూర్లో అప్పటికప్పుడు కూరలేముంటాయి? ఆపద్బంధువుల్లాగా వడియాలు, మామిడి వరుగులు, చల్ల మిరపకాయలు, చిట్లపొడి, కందిపొడి, ఊరగాయలు ఇలాంటి సందర్భాల్లో పనికి వచ్చేవి. ఉన్న కూరలు మగవాళ్లకు వేసి.. అదనంగా చింతకాయ పచ్చడి వడ్డించింది అమ్మ. వెంటనే అందులో పెద్దాయన.. “ఆహాఁ! గింత రాత్రి అయినా ఎంతమంచి భోజనం పెట్టినవే శకుంతలా! నీచేత ఏది చేసినా అమృతం! గీ చింతకాయ తొక్కు ఇంట్ల ఉంటె ఏ రంది ఉండది. కన్నతల్లి ఉన్నట్టె!” అన్నాడు లొట్టలేసుకుని తింటూ. “అట్లనే గీ కన్నతండ్రిని గూడ తిని చెప్పండి, బాగున్నదో లేదో!” అంటూ మామిడికాయ నిలువ పచ్చడిని కంచంలో వేసింది అమ్మ. కొంచెం సేపటికి ముసలాయనకు విషయం అర్థమై పకాళించి నవ్వాడు. “ఏమి జోకు ఏసినవే మనుమరాలా! పోతన వంశస్తురాలివైతివి. నీక్కూడా కవిహృదయం ఉన్నది” అని అమ్మను మెచ్చుకున్నాడు. ఎవరింటికీ.. వాళ్లు పిలవకుండా భోజనాల సమయంలో వెళ్లొద్దని అమ్మ చెప్పేది. ఎందుకంటే వాళ్లు మనల్ని తినమనకుండా ఉండలేరు. ఒకవేళ అంటే గనక.. అందుకు సరిపడా భోజనం ఉండకపోతే వాళ్లను ఇబ్బంది పెట్టినవాళ్లం అవుతాం! అదే మనింట్లో మనం ఏది తింటున్నా.. ఆ సమయంలో ఎవరైనా వస్తే, వాళ్లకు ఇవ్వకుండా తినొద్దని ఇప్పటికీ చెబుతుంది. మేం ఎవ్వరితోనూ ఒక్కమాట కూడా అనిపించుకోకుండా ఉండాలని అమ్మ కోరిక. చిన్నప్పుడు ఏ ఊరెళ్లినా, బయల్దేరే ముందే..
‘అక్కడ పిచ్చి వేషాలు వెయ్యం! ఎవ్వరితోనూ లొల్లి పెట్టుకోం! ఏది పెడితే అదే తింటం! గిదే కావాల్నని సతాయించం! పెద్దోళ్లు మాట్లాడుకుంటుంటె అక్కడ ఉండం!’ ఇలాంటి ఎన్నో వాగ్దానాలు మా చేత చేయించేది. మేం ఆ లక్ష్మణ రేఖ కొంచెం దాటినా.. అమ్మ చూపులకే భయం వేసి సర్దుకునేవాళ్లం.
‘మన పిల్లల తప్పులు మనం తెలుసుకుని మందలించి, బుజ్జగించి, తెలియజెప్పి సరిచేయాలి. పిల్లల్ని ఏమీ అనొద్దు అనుకుంటే.. భవిష్యత్తులో లోకం వాళ్లను ఏదైనా అంటుంటే, అప్పుడు మనం చూస్తూ ఉండాల్సి వస్తుంది’ అనేది అమ్మచెప్పే సూత్రం. మనవళ్లపైనా, మనవరాలిపైనా ఎంతప్రేమ చూపుతుందో.. అంతగానూ వాళ్లమీద జోకులేసి నవ్వడానికి అమ్మవెనుకాడదు. అమ్మకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ!
ఇప్పటికీ తొంభై ఏళ్ల వయసులో కనీసం ఎనభై అయిదేళ్ల కిందటి సంగతులు, వ్యక్తుల పేర్లు, ఊర్ల పేర్లు సహా చెబుతుంది. మాన్యులనుంచి సామాన్యులవరకు.. అందరూ, అన్నీ ఆమెకు గుర్తే! అమ్మకు చెట్లంటే ప్రాణం. నీళ్లు చేది పోసి మరీ ఎన్ని చెట్లను పెంచిందో! పుట్టిన పదిహేను రోజులకే తల్లిని పోగొట్టుకున్న అమ్మ.. తండ్రి ప్రేమకూ నోచుకోలేదు. కానీ, తన ప్రేమను నిండుగా, మెండుగా మాకందించింది. ఇటీవలి కాలందాకా వార్ధక్యాన్ని చాలా సహజంగా, ఎంతో తేలిగ్గా తీసుకుంది అమ్మ. ఈ మధ్య తొంభై దాటాక.. తన పనులు తాను చేసుకున్నా కూడా, మిగతా పనులు ఏవీ చేయలేకపోతున్నానని బాధపడుతూ ఉంటుంది. “నాకసలు కొత్తగ ఇగ బట్టలు కొనకండి” అంటూ ఉంటుంది. తన చీరలు, వస్తువులు ఎవరికో ఇచ్చేస్తూ ఉంటుంది. మాకు ఇప్పటికీ సలహాలూ, నవ్వులూ, విలువైన జ్ఞాపకాలూ పంచుతూ ఉంటుంది. ఎవరు చనిపోయారన్న వార్త తెలిసినా.. “అయ్యో! నన్ను రమ్మంటే.. ‘ఒస్తున్నా!’ అనుకుంటు పొయ్యేటందుకు సిద్ధంగ ఉన్న! నన్ను పిలువడు. వాడు నన్ను పుట్టిచ్చిన సంగతే మరిచిపోయిండు. పిలుస్తలేడు” అంటూ ఉంటుంది. ఆ పైవాడు అలాగే మరి కొన్నేళ్లు మర్చిపోవాలనీ, మా అమ్మ నిండు నూరేళ్లూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం. దేవుడిని కూడా ప్రార్థిస్తున్నాం.
నెల్లుట్ల రమాదేవి ( Nellutla Ramadevi ), రచయిత్రి
Ramaayanam | సకలకళా.. వల్లభన్!
Ramaayanam | చుట్టాలమ్మో చుట్టాలు 2
“Ramaayanam | చుట్టాలమ్మో చుట్టాలు”