Children Stories | ఒక పెద్ద జంగల్ల ఒక కుందేలు ఉండేటిది. ఒకపారి యాడికో వోయిరాంగ తొవ్వ పొంటున్న పొలంల దానికి మస్తుగ గాజర్ గడ్డలు కనిపిచ్చినయి. అవ్విట్ని సూడంగనే కుందేలుకు నోరూరింది. కడుపు వలిగెటట్టు మేసి నడువ శాతగాక ఆన్నే ఓ పెద్ద బండకు ఈపు ఆనిచ్చి కూసుంది. కొంచెం సేపటికి ఆకలి మీనున్న ఒక తోడేలు ఆడికెల్లి వోతాంది. అంతట్లకే దానికి కుందేలు కానచ్చింది.‘అమ్మయ్య, ఈ పూటకు బువ్వ దొరికింద’నుకుంట కుందేలు తానికి వోయి ఎదురుంగ నిలుసుంది. తోడేలును జూడంగనే బుగులువడ్డ కుందేలు, ఎంటనే ఇకమతు జేసింది. “రా తోడేలు మామ! నువ్వు బరాబరి టైముకచ్చినవు, జరంత సేపట్ల మొగులు మీదవడ్తదంట. ఈ బండవెట్టి ఆపుతున్న. నువ్వు జరంత సేపు దీన్నిట్ల వట్టుకుంటె నేను ఇంకో బండ దెత్త” అన్నది. ‘అమ్మో, మొగులు మీదవడి పిడాత పానం బోతె కుందేలును తినుడెట్ల, అంత సక్కగయినంక దీన్ని దింట’ అనుకుంట, ఉరికిపోయి తాకతంత వెట్టి బండను గట్టిగ వట్టుకుంది తోడేలు.
ఇకమతు వారినందుకు చెంగోబిల్ల అనుకుంట కుందేలు ఆడికెల్లి తప్పించుకుంది. కుందేలు కోసం సూసుకుంట తోడేలు ఆన్నే గూసుంది. తొవ్వపొంటి వోయే జీవాలన్ని తోడేలును ‘బండనెందుకు జబర్దస్తుగ వట్టుకున్నవ’ని అడిగితే కతంత జెప్పవట్టింది. కుందేలు ఇకమతుకు జీవాలన్ని నవ్వుకుంట వోయినయి. కుందేలు ఎంతసేపయినా రాకవోయేవరకు, యాష్టకచ్చి ‘మొగులు కిందవడ్తె వడని, నాకేంది, ఈ జంగల్ను కాపాడనీకి నేనేమన్న టేక దీస్కున్ననా’ అనుకుంట బండను పక్కనవెట్టి దుల్పుకొని తనబాటన తాను వోయింది తోడేలు. మల్లోపారి ఒక కుంట కాడ కుందేలు నీళ్లు దాగుతాంటె తోడేలుకు గూడ దూపయి ఆడికే అచ్చింది. తోడేలును దూరంకెల్లి జూశిన కుందేలు ఎట్లనన్న తప్పించుకోవాలె, లేకుంటె పానం బోతదనుకుని, కుంటల నీళ్లు దాగుతున్నట్టు జేయవట్టింది. తోడేలు సూసుకుంట ఆన్నే కూసుంది. మాలెస్క సేపైంది, అయినా కుందేలు అట్లనే నీళ్లు దాగవట్టింది. ఆగలేక “ఏంది అల్లుడూ ఇంతసేపు ఏం జేత్తాన్నవ్” అంట అడిగింది తోడేలు. ఇకమతు వారినందుకు ఖుషీ అయి, “అంతపెద్ద ముచ్చటేంగాదు గని, ఈ నీళ్లల్ల తిన్నంత తిండున్నది, గందుకే ఇండ్ల నీళ్లన్ని తాగి దీన్ని ఖాలి జేత్తున్న” అన్నది.
ఆశవోతు తోడేలు, “తిండా… ఏది… ఏడుంది?” అంట అడిగింది. “సూడు నక్కమామ, ఎంతపెద్ద ఎన్నముద్ద నీళ్లల్ల పారేశిండ్రో” అనుకుంట కుంట నీళ్లల్ల ఎలుగుతున్న పున్నమ చంద్రున్ని సూపిచ్చింది. చంద్రున్ని సూడంగనే ‘ఎంతపెద్ద ఎన్నముద్దో’ అంట… తోడేలుకు నోట్లె నీళ్లూరినయి… ‘ఈ కుందేలును అటెన్క దినచ్చు, ఎన్నపూస దినక ఎన్ని రోజులైందో’ అనుకుంట ఉరికివోయి.. ఇంకో పక్కకెల్లి కుంటల నీళ్లు దబ్బదబ్బ గటగట దాగవట్టింది తోడేలు. ‘అమ్మయ్య’ అనుకుంట తోడేలు జూడకముందే కుందేలు ఆడికెల్లి తప్పిచ్చుకపేంది.. నీళ్లు దాగిదాగి కడుపుబ్బి తోడేలు ఆన్నే అడ్డంగ వన్నది.
… పత్తిపాక మోహన్
Children Stories | రంభనే నా పెండ్లాం