తుంగతుర్తి, జూన్ 09 : కల్లాలల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని బీఆర్ఎస్ నేత మట్టిపల్లి వెంకట్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి, అధికారులు మెుద్దు నిద్ర పోతున్నారని దుయ్యబట్టారు. ,దాదాపు రెండు నెలలుగా ఐకేపీ కేంద్రాలలో ధాన్యాన్ని రైతులు కాపాడుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. రైతులు నార్లు పోసే వరకు కూడా ప్రభుత్వం ధాన్యం కోనుగోలు చేయకపోవడం సిగ్గు చేటు అన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం పూర్తిగా తడిసి మెులకలు వస్తున్నాయని, ఇదే అదునుగా తలంచి మిల్లర్లు రైతులు నుండి కటింగ్ పేరుతో క్వింటాకు 4 కేజీలను తరుగు పేరుతో దోచుకుంటున్నట్లు ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే తరుగు లేకుండా కోనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.